శంకర్పల్లి, జనవరి 22 : నగరానికి కూత వేటు దూరం లో ఉండి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో గోపులారం గ్రామం ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం వివిధ సంక్షేమ పథకాలను అమల చేస్తున్నది. లక్షల నిధులను గ్రామాలకు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నది. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా తాగు నీటిని అందిస్తున్నది. ట్రయల్ రన్ ఇప్పటికే పూర్తి అయ్యింది.గ్రామ అభివృద్ధి కోసం స్థానిక నాయకులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి పాలనలో గ్రామంలోని రోడ్లు గుంతలుగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో 8 వార్డుల్లో రూ. 50 లక్షలతో సీసీ రోడ్లు వేయించారు. రూ. 30 లక్షలతో అండర్ డ్రైనేజీలు, రూ.12 లక్షలతో గ్రామ సంతను ఏర్పాటు చేశారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో గ్రామానికి అవసరమైన నిధులను సమకూర్చుకుంటున్నామని గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు. డంపింగ్యార్డు ఏర్పాటుతో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం లేదు. పంచాయతీ ఏర్పాటు చేసిన చెత్త బండిలోనే వేసి గ్రామంలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. నగరానికి దగ్గరగా ఉండటంతో గోపులారం గ్రామ శివారులో సినీ, రాజకీయ ప్రముఖులు వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకున్నారు.
గోపులారం గ్రామ అభివృద్ధికి నిరంతరం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే యాదయ్య సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను పూర్తి చేశా. సీసీ రోడ్లు, అండర్డ్రైనేజీలు చాలా వరకు పూర్తి అయ్యాయి.
-పొడువు శ్రీనివాస్, సర్పంచ్