సిటీబ్యూరో/హియాయత్‌నగర్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, పట్టణ ప్రణాళిక, వనరుల నిర్వహణను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో జీఐఎస్ సర్వే ఎంతగానో దోహదపడుతుందని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి అన్నారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి.. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టంపై వివరించారు. జీఐఎస్‌తో గ్రేటర్ మొత్తాన్ని డ్రోన్ ద్వారా సర్వే చేసి.. రికార్డు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూములు, చిన్నా, పెద్ద రోడ్లు, చెరువులు, సరస్సులన్నీ.. ఇలా సిటీ మొత్తం మ్యాపింగ్ జరుగుతుందన్నారు.
దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గల హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. అందులో 2.7 లక్షల కమర్షియల్ గృహాలు ఉన్నాయన్నారు. జీఐఎస్ సర్వే పూర్తయిన తర్వాత ప్రతి ఇంటికి డిజిటల్ డోర్ నంబర్ ఏర్పాటు చేస్తారని వివరించారు. ప్రతి ఇంటి ఎదుట జీఐఎస్ డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఉదాహరణకు తమ కాలనీల్లో ఎకడైనా సమస్యలున్నా.. జనన, మరణ ధ్రువీకరణ పత్రం , ఆస్తుల మ్యుటేషన్, ఇతర సేవలను నేరుగా ఇంటి వద్ద నుంచే పొందవచ్చని వివరించారు. విపత్తుల సమయంలో, ప్రమాద ఘటనల్లో ప్రజలు త్వరితగతిన సేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆయా అధికారులు వేగవంతంగా స్పందించి నేరుగా వెళ్లి సేవలు అందించే వీలు కలుగుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు వంటివి కబ్జాలకు గురికాకుండా నిఘా ఉంటుందని కమిషనర్ తెలిపారు.ఇప్పటికే హైదర్‌నగర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్, హయత్‌నగర్‌లలో జీఐఎస్ సర్వేను ప్రారంభించామన్నారు. శాటిలైట్, గ్రౌండ్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిసున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 130 చదరపు కిలోమీటర్లలో డ్రోన్ సర్వే పూర్తయిందని, త్వరలో 1,40,020 ప్లాట్స్ డిజిటలైజ్ చేయనున్నట్లు చెప్పారు.
ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, సర్వేకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సర్వేతో అన్ని కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వెసులుబాటు ఉంటుందన్నారు. మొత్తం 600 బృందాలను ఏర్పాటు చేసి, రానున్న 6 నెలల వ్యవధిలోనే సర్వే పూర్తి చేస్తామన్నారు. శాటిలైట్, డ్రోన్ ఫిజికల్ ద్వారా సర్వే నిర్వహిస్తామన్నారు. ఫిజికల్ సర్వేలో వ్యక్తిగత వివరాలను అడగడం లేదని స్పష్టం చేశారు. ఈ సర్వేతో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, భవనాలు, చెరువులు, పారులు ఎన్ని ఉన్నాయి.. ఇలా ప్రతి సంఖ్య కచ్చితంగా చెప్పే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు..