సిటీబ్యూరో : ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యా న్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్‌గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇందులో భాగంగానే 19.25 లక్షల మందిలో 13.60 లక్షల మంది మాత్రమే ఆస్తిపన్ను చెల్లించగా, వీరి నుంచి రూ. 1720 కోట్ల మేర ఆదాయాన్ని రాబట్టుకున్నది. ఆస్తిపన్ను చెల్లించకుండా ఉన్న దాదాపు 5 .75లక్షల మందిపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి రూ.280 కోట్ల రాబట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, డీసీలను సెలవులు రద్దు చేసిన కమిషనర్.. వసూళ్లు పెంచడమే రోజూవారీ సమీక్షలు పెట్టి టార్గెట్లు ఇస్తున్నారు. ఇతర పనులకు ఫుల్స్టాప్ పెట్టిన జీహెచ్ఎంసీ అధికారులు ఒక్క ఆస్తిపన్ను కలెక్షన్లపైనే ప్రధాన ఫోకస్‌గా పనిచేస్తున్నారు.జీహెచ్ఎంసీ కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ పథకానికి సద్వినియోగం చేసుకోవాలని, వడ్డీపై 90శాతం పన్ను రాయితీ పొందాలని కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఆస్తిపన్నును ఆన్లైన్, సిటీజన్ సర్వీస్ సెంటర్లు, ఈ -సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని, సర్కిల్, హెడ్ ఆఫీస్‌లో ఉన్న సిటిజన్ సర్వీస్ సెంటర్లు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేస్తాయని కమిషనర్ తెలిపారు.