సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ వార్డుల విభజన వార్డుల విభజన ప్రక్రిను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పాటు జీహెచ్ఎంసీ అధికారులు సమగ్రంగా కసరత్తు చేసి రూపొందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం కౌన్సిల్ వేదికగా ప్రకటించారు. వార్డుల విభజనలో నాలాలు, ప్రధాన రహదారులు, మేజర్ ల్యాండ్ మార్కు, మేజర్ రైల్వే లైన్లు వంటి నాచురల్ బౌండరీలను ప్రాతిపదికన తీసుకున్నాం..అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న వార్డులను ఒకే నియోజకవర్గానికి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేశామని వెల్లడించారు.
తెల్లాపూర్ ప్రాంతాన్ని ఉదాహరణగా పేర్కొన్న కమిషనర్ ప్రస్తుతం అక్కడ సుమారు 23వేల జనాభా మాత్రమే ఉన్నప్పటికీ, రాబోయే పదేండ్లలో 80వేలకు పైగా జనాభా పెరిగే అవకాశం ఉందన్నారు. పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మాణంలో ఉన్నందున, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ వార్డుల సంఖ్యను పెంచామని కమిషనర్ ప్రకటించారు..కానీ కమిషనర్ మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని తేలిపోయింది…
వార్డుల డీ లిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందన్న బీఆర్ఎస్ నేతలు, స్థానికులు మాటలు నిజమేనని, అధికారులు కంప్యూటర్ ముందు పెట్టుకొని, గూగుల్ మ్యాపుల అధారంగా వార్డుల విభజన జరిగిందన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ వేదికగా బయట పడింది. వార్డుల విభజనలో ఎన్నో వ్యత్యాసాలు, లోసుగులు ఉన్నట్లు తేలింది.
గోషామహల్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉండగా, కొత్తగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ పేరుతో డివిజన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపుగా 16 వేల ఓటర్లు మాత్రమే ఉంటారని, భవిష్యత్తులో జనాభా పెద్దగా పెరిగే అవకాశం లేదని, తెల్లాపూర్ తరహాలో గ్రోత్‌కు నోచుకోదని విపక్ష నేతలు సభలో కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎత్తివేసి అక్కడ టవర్లు నిర్మిస్తారా? అని ప్రశ్నించారు. ఒక వర్గానికి లబ్ధి చేసేందుకు కోర్ సిటీలో వార్డుల విభజన జరిగిందని, హైదరాబాద్ నగరంలో పట్టున్న బీఆర్ఎస్ను దెబ్బ తీసేందుకు ఇష్టా రీతిలో వార్డుల విభజన జరిగిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. దాదాపుగా 48 డివిజన్లను యథావిధిగా ఉంచారని, ఎక్కువగా చార్మినార్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని డివిజన్లు విభజనకు నోచుకోలేదని లోపాలను ఎత్తిచూపారు.
అలాగే మల్కాజిగిరి నియోజకవర్గంలో డివిజన్ల ఖరారులో వ్యత్యాసాలు భారీగా ఉన్నాయని సభ్యులు కౌన్సిల్ వేదికగా చెప్పారు. హడావుడిగా, అడ్డగోలుగా చేసిన వార్డుల విభజనపై అటు ప్రజలను, ఇటు పార్టీలను తప్పుదోవ పట్టించడమే కాకుండా మొదట్నుంచి మ్యాపుల ప్రదర్శన ఇవ్వకుండా అభ్యంతరాలను స్వీకరించడమే కాకుండా, కౌన్సిల్లో సభ్యులకు హద్దులు లేని మ్యాపులను ఇచ్చి బురిడీ కొట్టించిన అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. మ్యాపులు ముందే సభ్యులకు ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయన్న భావనలో అధికారులు గోప్యత పాటించడం పట్ల పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విజన గోషామహల్ నియోజకవర్గంలో అశాస్త్రీయంగా జరిగిందని కౌన్సిల్ వేదికగా సభ్యులు ఎత్తిచూపారు. డివిజన్ల ఏర్పాటుపై గోషామహల్ నియోజకవర్గంలో గతంలో 6 మున్సిపల్ డివిజన్లు ఉండగా పునర్విభజనలో భాగంగా నూతనంగా మరో డివిజన్‌ను ఏర్పాటు చేసి దానికి ఎగ్జిబిషన్ డివిజన్‌గా నామకరణం చేశారు. ఈ డివిజన్ ఏర్పాటులో భాగంగా కలిపిన ప్రాంతాలను పరిశీలిస్తే మొత్తం 16 వేల నుండి 19 వేల వరకు ఓటర్లు మాత్రమే ఉండడం గమనార్హం. అయితే నియోజకవర్గంలో ఉన్న గన్‌ఫౌండ్రీ, గోషామహల్, మంగళహాట్, బేగం బజార్, దత్తాత్రేయ నగర్, జాంబాగ్ డివిజన్లు ఉండగా అన్ని డివిజన్లలో 40 నుంచి 60 వేల వరకు ఓట్లను ఉంచి, నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ డివిజన్‌కు మాత్రం 16 నుంచి 19 వేల ఓట్లను మాత్రమే ఉంచడం పట్ల నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఆరు డివిజన్లకు సరిపడా ఓట్లు ఉండగా ప్రత్యేకంగా మరో డివిజన్ ఏర్పాటు చేసి దానికి తక్కువ ఓట్లను కలపడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని పలువురు రాజకీయ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసమాన ఓట్ల విషయమై ఇప్పటికే పలువురు నాయకులు ఫిర్యాదులు కూడా చేశారు. విస్తరించే ప్రాంతాలు ఉంటే మున్ముందు ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. నూతనంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ డివిజన్‌కు మున్ముందు ఓట్లు పెరగడానికి అవకాశమే లేనందున గోషామహల్ నియోజకవర్గంలోని మొత్తం ఏడు డివిజన్ల ఓట్లను సమానంగా విభజించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఇది కేవలం ఏసీ గదులలో కూర్చుని చేయడం వల్లే డివిజన్లలో ఓట్ల అసమానత ఏర్పడిందని పలువురు నాయకులు అభిప్రాపయపడుతున్నారు.