get together | మొయినాబాద్, జూన్02: గురుకులంలో గురువుల వద్ద విద్యా బుద్ధులు పొందిన విద్యార్థులు విడిపోయి పాతికేండ్లకు పైబడింది.. వారంతా ఒకే వేదిక మీద కలుపుకోవడానికి గత రెండు నెలలుగా ఎంతో శ్రమించి అందరి విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫోన్ నెంబర్లను వెతికి హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులను సైతం తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. ప్రయత్నం సఫలీకృతం కావడంతో పూర్వ విద్యార్థులు ఒక వేదికను ఎంచుకుని అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో కన్నుల పండువగా నిర్వహించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటి పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న తెలంగాణ సాంఘిక పంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాకు 75 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఆ విద్యార్థులు చేవెళ్ల మండల పరిధిలోని మూడిమ్యాల్ గ్రామ రెవెన్యూలో గల ఓ ఫామ్ హౌస్‌లో అపూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక(సమ్మేళనం)ను విద్యా బుద్దులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి కన్నుల పండువగా నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సుమారుగా 40 మంది విద్యార్థులు హజరయ్యారు. పాఠశాలను వీడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 ఏండ్ల వసంతాల్లోనికి అడుగుపెడుతున్న సందర్భంగా అందరు విద్యార్థులు.. ఉపాధ్యాయులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరిని ఒకరు ఆత్మీయంగా పలుకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనానికి రావడంతో విద్యార్థుల ముఖంలో ఆనందం ఉప్పొంగింది. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులతో ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను వేదికపై పంచుకున్నారు. విద్యార్థి దశలో తెలిసీతెలియని వయస్సులో చేసిన చిలిపి చేష్టలను, తప్పులను విద్యార్థులు గుర్తు చేసుకుని ఉపాధ్యాయుల క్షమించాలని క్షమాపణ కోరారు. విద్యార్థులు ఎంతో ఆత్మీయంగా తమకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులను ఘనంగా సన్మానం చేసి మెమొంటోలను ప్రదానం చేసి గురువులు ఆశీస్సులను పొందారు. 26 ఏండ్ల తర్వాత కూడా తమను గుర్తు పెట్టుకుని ఆత్మీయ అనుబంధంతో ఆహ్వానించి అతి గౌరవంగా సన్మానించడంతో ఉపాధ్యాయులు ఆనందంతో ఉప్పొంగారు.
సమాజానికి తిరిగి ఎదో కటి చెల్లించాలి: గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య
విద్యార్థులు విద్యాబుద్ధులు పొంది వృద్ధిలోనికి రావడంతో పాటు సమాజంలో వెనుకబడిన వారిని కూడా వృద్ధిలోనికి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చిలుకూరు గురుకుల బాలుర పాఠశాల మాజీ ప్రిన్సిపల్ లక్ష్మయ్య అన్నారు. తమతో పాటు చదువుకున్న స్నేహితులకు ఎలాంటి సమయంలో ఎలాంటి ఆపద కలిగిన నైతిక మద్ధతు ఇవ్వాలని పూర్వ విద్యార్థులకు సూచించారు.26 ఏండ్ల తరువాత ఒకే వేదిక మీద కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తమలో గట్టి బంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక మైలురాయివంటిదని చెప్పారు. ఆత్మీయ కలయికతో ఆగిపోకుండా అందరు ఒక సొసైటీగా ఏర్పడి విద్యాబుద్ధులు పొందిన పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న ప్రస్తుత విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఉంటే వారిని ప్రోత్సహించే విధంగా అభినందించడానికి ముందుకు రావాలని సూచించారు. ఎవరు ఏ పనిలో నిమగ్నమై ఉన్నారనేది కాదని పని ఏదైనా నిబద్ధతతో పని చేసుకుంటే ఆర్థిక వృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తోటి స్నేహితులు మంచి వృత్తిలో ఉన్నారని దిగులుపడకుండా తము చేసే పనిలో అంకిత భావంతో పని చేసి నిజాయితీగా ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.. తమ శక్తి మేరకు మీరు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములమవుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరేందర్‌రెడ్డి, బాలకృష్ణ, పద్మారెడ్డి, భారతి, తాజావుద్దీన్, పద్మకుమారి, విజయ్‌కుమార్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.