వికారాబాద్, అక్టోబర్ 25: అర్హులందరికీ రూ.500లకే గ్యాస్ అందిస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మహాలక్ష్మి పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్స్‌ను కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మా ట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరుగుతూ హామీలు ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తపన ఉందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఐదేండ్లలో నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఉన్న బెల్టు షాపులను తొలగించేందుకు సీఎంతో కలిసి కృషి చేస్తామన్నారు.
పేదలందరికీ సొంత ఇండ్లు
రాష్ట్రంలో పేదలకు సొంత ఇంటిని కల్పించడానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని స్పీకర్ తెలిపా రు. ప్రతి నియోజకవర్గానికి 3600 ఇండ్లను మంజూరు చేశామన్నారు. స్పీకర్ నియోజకవర్గం కావడంతో వికారాబాద్‌కు ఏడు వేల ఇండ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారని ఆయన అన్నారు. ఈ నిధులతో చెరువు లను అభివృద్ధి చేసుకుందామన్నారు. బ్యాంకు తప్పిదాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, డిసెంబర్ 9 నాటికి అర్హులందరికీ రూ.రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీవో వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్‌కుమార్, కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, నాయకులు జాఫర్, అంజయ్య, మోహన్ తదితరులు ఉన్నారు.
బడ్జెట్ లేక.. పథకాల అమలులో ఆలస్యం
ఆసరా పింఛన్లు, మహిళలకు రూ.2500 తదితర పథకాలు అమలు చేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని స్పీకర్ అన్నారు. బడ్జెట్ లేని కారణంగా పథకాల అమలులో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలోనూ రూ. 170 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తామన్నారు. ఉడా ఏర్పాటుతో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 493 గ్రామాల్లో సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చడానికి నిధులు మంజూరవుతాయని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. కొత్త పరిశ్రమలు వస్తాయన్నారు.