వికారాబాద్, డిసెంబర్ 5 : వికారాబాద్ ఆర్టీసీ డిపోకు మరో 50 బస్సులు కావాలని సంబంధిత శాఖ మంత్రిని కోరితే 6 బస్సులే పంపించారని రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం వికారాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో భా గంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే అమలు చేశామని గుర్తు చేశారు.
మహిళా ప్రయాణికులు పెరుగుతుండడంతో బస్సుల్లో రద్దీ కూడా పెరుగుతున్నదని.. అందువల్ల వికారాబాద్ డిపోకు మరో 50 నూతన బస్సులు కావాలని రవాణా శాఖ మం త్రిని కోరితే ఆరు బస్సులే పంపించారని పేర్కొన్నారు. సంస్థ లాభాల బాట లో పయనించేందుకు సిబ్బంది తమ వంతు కృషి చేయాలని సూచించారు. ఎక్కువ లాభాలు వచ్చే రూట్లలో సమయానికి బస్సులు నడపాలన్నారు.
బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ అరుణ, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.