వికారాబాద్/బొంరాస్‌పేట, ఆగస్టు 5 : గ్రామాలో ్ల పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 9వ తేదీ వరకు ఐదు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ ఒక కార్యక్రమాన్ని చేపట్టేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని పంచాయతీ కార్యదర్శులు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి ఒకసారి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేది. అదే విధంగా ప్రతి మూడు నెలలకోసారి పంచాయతీలకు నిధులను క్రమం తప్పకుండా విడుదల చేసేది.
ఈ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు, నీటి వనరుల క్లోరినేషన్, మొక్కల పెంపకం, కలుపు మొక్కలను తొలగించి పరిసరాలను శుభ్రం చేయడం, మురికి గుంతలను పూడ్చడం వంటి పనులు చేపట్టేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నయా పైసా పంచాయతీలకు ఇవ్వకుండా స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చెత్తను తరలించే ట్రాక్టర్లకు డీజిల్ పోయించి, వీధి దీపాల ఏర్పాటు కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంతో ఖర్చుల భారం తమపైనే పడుతున్నదని కార్యదర్శులు భావిస్తున్నారు. క్లోరినేషన్ పనులు చేయడానికి బ్లీచింగ్ పౌడర్నూ ప్రభుత్వం సరఫరా చేయడంలేదు. దీంతో కార్యదర్శులు సొంత డబ్బులు వెచ్చించి బ్లీచింగ్ పౌడర్‌ను కొనుగోలు చేశారు. ఫిబ్రవరి నెల నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు లేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
ఖర్చులు పెరిగాయి..
గ్రామాల్లో నిత్యం చేసే కార్యక్రమాలకు నిధులు కావాల్సిందే. పారిశుధ్య ట్రాక్టర్‌కు డీజిల్ తప్పనిసరి. పైప్‌లైన్ మరమ్మతులు, బోరు మోటర్ల మరమ్మతులు, వీధి దీపాలు, బ్లీచింగ్ పౌడర్, విద్యుత్ బిల్లులు, గుంతలు పూడ్చేందుకు జేసీబీలు తదితర ఖర్చులు పెరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దాదాపు 8 నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల కాలేదు. గ్రామంలో ఏ పనులు చేయాలన్నా పంచాయతీ కార్యదర్శులే కీలకం.
పంచాయతీ కార్యదర్శులే వీటిని భరించుకొని ఆర్థికంగా కృంగిపోతున్నారు. ఇది చాలదన్నట్లుగా ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామ సభలు, విద్యార్థులతో ర్యాలీలు, బహుమతులు, ఫ్లెక్సీలు, బ్లీచింగ్ పౌడర్, గేట్వాల్స్, పైప్లైన్లు, గుంతలు పూడ్చడం, డీజిల్, గడ్డి మందు, తాగునీరు తదితర వాటికి అదనంగా ఖర్చులు పెరిగాయని పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు.
దీనికి తోడుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఈ ప్రభావం పూర్తిగా పంచాయతీ కార్యదర్శులపై పడింది. గతంలో చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల బాధలు వర్ణనాతీతం. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేక పోతున్నామంటూ కొందరు కంటతడి పెట్టారు. విసిగిపోయిన కొందరు కార్యదర్శులు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే తప్ప పనులు చేయలేమని ఎంపీడీవోల దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌తో కూడా పంచాయతీ కార్యదర్శులు మొర పెట్టుకున్నారు. త్వరలో తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొంటున్నారు.
స్వచ్ఛదనం-పచ్చదనం షురూ..
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం సోమవారం షురూ అయ్యింది. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా 566 గ్రామ పంచాయతీలు, నాలుగు పురపాలక సంఘాల్లో పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పల్లెల్లో ర్యాలీలు నిర్వహించారు. మంగళవారం రెండో రోజు తాగునీరు, వర్షపు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, బుధవారం నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి పూడ్చివేయించడం, గురువారం కుక్కల బెడద నివారణతో పాటు ప్రజారోగ్యంపై దృషి, శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాలను శుభ్రం చేయడం, మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడుతారు. వీటితోపాటు పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ అంశాలపై ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహిస్తారు.