నీకెక్కువ, నేను తక్కువ అన్న భేదం లేదు.. మనసు విప్పి మాట్లాడితే ఎక్కడ చులకనైపోతామేమో అన్న ఆందోళనా లేదు. తరగతి గదిలో కింద బండలపైనే కూర్చున్నా తక్కువైపోతామేమో అన్న ఆలోచనే రాలేదు.. పక్కోడు ఏమనుకుంటాడోనన్న బెంగ లేదు.. ఉన్నదాంట్లోనే సర్దుకుంటూ, ఒకరి భుజాలపై ఒకరు చెయ్యేసి నడుస్తుంటే కలిగిన భరోసానే వేరు.. ఫోన్ల ఫోబియా లేదు.. సోషల్‌మీడియా లొల్లి అసలే లేదు.. అందుకే స్నేహమంటే అదే.. కాలమంటే అదే. ఆ కల్మశం లేని దోస్తానా మళ్లీ వస్తే బాగుండని కోరుకునేవారెందరో.
లేదంటే కనీసం ఆ జ్ఞాపకాలను అందరితో కలిసి నెమరువేసుకున్నా ఆ సంతోషమే వేరు అనే దోస్తులెదందరో.. అందుకే పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరుతో అందరూ ఒక చోట కలిసి సందడిచేస్తున్నారు. అంతేకాదు తమ మిత్రుల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నరని తెలిస్తేచాలు…అందరూ ఏకమవుతున్నారు.. మేమున్నామని భరోసానిస్తున్నారు… ఈ రోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
నేడు స్నేహితుల దినోత్సవం
దశాబ్దం, రెండు దశాబ్దాలు, మూడు దశాబ్దాలు, నాలుగు దశాబ్దాలు.. ఏండ్లు గడిచిపోయాయి. బడిలో కలిసి చదువుకున్న రోజులు మాత్రం ఇప్పటికీ కండ్లముందే తిరుగుతున్నాయి. పలానా రోజు జరిగిన ఘటన, ఆ సార్ కొట్టిన దెబ్బలు, టీచర్ తిట్టిన తిట్లు.. రిపోర్టు కార్డు చూసుకుని దిగాలు పడ్డ సందర్భాలు.. జారిపడి తగిలిన గాయాలు ఇలా ఎన్నో, మరెన్నో.. ఏ సందర్భం గుర్తుకొచ్చినా మొదట కనిపించేది పెదవులపై చిరునవ్వే. చేసిన చిలిపి పనయినా, దాని పర్యావసానం ఇంకేమైనా ఇప్పుడు గుర్తుకొస్తే మాత్రం వచ్చేది నవ్వే. అందుకేనేమో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పాత దోస్తులను కలువాలని కోరుకుంటున్నవారు ఎక్కువవుతున్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరుతో మళ్లీ ఒక్కచోటకు చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఎలాగైనా మళ్లీ పాత దోస్తులను కలవాలని తపన పడుతున్నారు. తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని ఆరాటపడుతున్నారు. కలిసి మళ్లీ భుజాలపై చేతులేసి నడుస్తూ ఒకరికొకరు భరోసా ఇవ్వాలని ఆసక్తి చూపుతున్నారు. తమ చిన్నతనంలో చేసిన తప్పులను అంగీకరించాలని కూడా ఆసక్తి చూపుతున్నవారెందరో.
ఒక్కసారి తప్పు ఒప్పుకొంటే.. ఇక జీవితాంతం మరింత సంతోషంగా ఉండొచ్చని, ఆనందంగా మరింత దగ్గర కావొచ్చని చూస్తున్నవారెందరో. చెడు అలవాట్లను దూరం చేసుకున్న సందర్భాలను తెలుసుకుంటూ స్ఫూర్తి పొందేందుకు సైతం పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు ఆర్థికంగా వెనుకబడినా, తాను కష్టపడి ఉన్నత స్థానంలో ఉండేందుకు పడిన కష్టం, వచ్చిన ఫలితం ఇలా అన్నింటినీ నిర్మొహమాటంగా స్నేహితుల ముందు చెప్పేస్తున్నారు. తాము స్ఫూర్తి పొందిన గురువులను గుర్తు చేసుకుంటూ వారిని సన్మానిస్తున్నారు.
చదువులు చెప్పిన గురువుల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ‘అరేయ్.. నేను నిన్ను మరిచిపోలేదు. నువ్వు చేసిన పని ఇంకా నాకు గుర్తుంది’ అని గురువుల నోట వచ్చే మాటల కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మాటలు వింటూ తోటి స్నేహితులతో సంతోషాలు పంచుకుంటున్నారు. ‘ఏం రా.. నిన్న బడికెందుకు రాలేదు. అన్న సార్ ప్రశ్నకు.. పనుండె సార్ అన్నది విద్యార్థి జవాబు.. ఆహా.. పని లేకపోతెనే బడికొస్తావా?’ అంటూ సార్ కొట్టిన రెండు దెబ్బలను ఇప్పటికీ మరిచిపోలేనని చెప్తున్నారు ఏడు దశాబ్దాల వయసున్న సుదర్శన్.
కష్టాల్లో తోడుగా…
అపూర్వ సమ్మేళనాలతో ఒక్కచోటకు చేరుతున్న స్నేహితులు.. జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో పాటు కష్టాల్లో ఉన్నవారికి మేమున్నామంటూ చేయూతనిచ్చేందుకు వెనుకాడటంలేదు. అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న స్నేహితులకు బాసటగా నిలుస్తున్నారు. ‘మాది 1996 పదోతరగతి బ్యాచ్. ఓ స్నేహితుడి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని సాయం అందించాం’ అని మున్సిపాలిటీకి చెందిన జాల జంగయ్య తెలిపారు.
సంతోషాలకు వేదిక
పాత స్నేహితులందరం ఒక్కచోటకు చేరాలని కొందరు పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. కష్టమైనా అందరి ఫోన్ నంబర్లు సేకరిస్తున్నారు. ఇందుకోసం సోషల్‌మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఒక్కచోట ఒక్కరోజులో చదివిన పదేండ్ల జ్ఞాపకాలను గుర్తుచేసుకునేలా సమ్మేళనాలు ఏర్పాట్లు చేస్తున్నారు. కష్టసుఃఖాలను పంచుకుంటున్నారు.
తీపి జ్ఞాపకాలు.. మధురస్మృతులు..
స్నేహితుల దినోత్సవాన సోషల్‌మీడియా వేదికగా తమ తీపి జ్ఞాపకాలను పంచుకునేందుకు ఎక్కువమంది స్నేహితులు ఇష్టపడుతున్నారు. చిన్నప్పుడు దిగిన ఫొటోలను షేర్ చేసూ.. ప్రాణ స్నేహితులను గుర్తుచేసుకుంటున్నారు. స్నేహితుల సాయం పొందినవారు దోస్తుల గొప్పతనాన్ని సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు. బడిలో, బయట జరిగిన చిలిపి చేష్టలు, మధుర జ్ఞాపకాల చిత్రాలు, పూర్వ విద్యార్థుల సమ్మేళనాల ఫొటోలను షేర్ చేస్తున్నారు. మనకు మంచి చేసిన స్నేహితులను గుర్తు చేసుకునేందుకు ఫ్రెండ్‌షిప్‌డేను వేదికగా చేసుకుంటున్నారు. మరికొందరు స్నేహితుల దినోత్సవాన కలిసి సంతోషాలు పంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.