రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ఇబ్రహీంపట్నం మా జీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. మంచాల మండల పరిధిలోని ఆరుట్లలో ఆయన 1935లో ఆయన జన్మించారు. భూపోరాటాల్లో చురుకైన పాత్ర పోషించడంతో పాటు పీడిత ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం పని చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఆయన సీపీఎం నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇటీవలే ఆయన సతీమణి ముత్యాలమ్మ గుండెపోటుతో మరణించారు. అంతకు ముందు ఆయన పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్ అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రస్తు తం ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో ఒక కుమారుడు త్రిలోక్‌కుమార్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి బీఆర్ఎస్తరుఫున గెలుపొందాడు.
మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ ఆయన మృతదేహానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. అలాగే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు ఆయన మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి గటించారు. ఆయన మృతిపై నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రాములు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం ప్రాంతప్రజల సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడిన మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు మృ తి అత్యంత బాధాకరమని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాములు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని రాములు మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన తెలంగాణ పోలీసు బాస్ శివధర్‌రెడ్డికి…కొండిగారి రాములు అత్యంత సన్నిహితుడు ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి నివాళులర్పించిన శివధర్‌రెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రజా ఉద్యమాల్లో ముందుండే రాము లు మృతి ఇబ్రహీంపట్నం ప్రాంతానికి తీరని లోటని అన్నారు. ఆయన వెంట ఇబ్రహీంపట్నం ప్రాంత వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే, సీపీఎం మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యద ర్శి పగడాల యాదయ్య నివాళులర్పించారు.