హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : సచివాలయం సాక్షిగా కాంగ్రెస్ సర్కారు తెలుగు తల్లిని అవమానిస్తూ తల్లి రూపం మార్చడాన్ని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు గళమెత్తారు. బీఆర్ఎస్పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో తెలుగు తల్లికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ రావాలి.. మార్పు రావాలని ఎన్నికలకు ముందు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్థిత్వాన్ని పూర్తిగా దెబ్బతీసే కుట్ర కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరి తరమూ కాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ద్రోహం చేసి ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తెలంగాణవాదుల అభిప్రాయాల మేరకే తెలుగు తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరిస్తే నేటి సీఎం ఏకపక్షంగా ప్రజలకు నచ్చకున్నా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
పరిగి, డిసెంబర్ 10 : తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, కవులు, కళాకారులు కలిసి రూపొందించిన తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి విమర్శించారు. పరిగిలోని తెలుగు తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధమై, ఆమరణదీక్ష చేపట్టడంతోనే ఆనాటి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటించిందన్నారు. ఉద్యమ సమయంలో అందరి ఆలోచన మేరకు తెలుగు తల్లి విగ్రహం రూపొందించడం జరిగిందన్నారు. కేసీఆర్ పాలనలోని ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా తెలుగు తల్లి విగ్రహ స్వరూపాన్నే మార్పు చేయడం సరైంది కాదన్నారు. ఈ మార్పును తెలంగాణ ప్రజలు ఆమోదించడంలేదన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్‌కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తో తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ; షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
షాద్‌నగర్/కొత్తూరు, డిసెంబర్ 10 : కాంగ్రెస్ పార్టీ చర్యల వల్ల తెలంగాణ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కొత్తూరు వై జంక్షన్ వద్ద, షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మునుపటి తెలుగు తల్లి విగ్రహాలు, చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు, కవులు, కళాకారులు, మేధావులు ఏర్పాటు చేసిన తెలుగు తల్లి విగ్రహాన్ని మార్చడం రాష్ట్రంలో వచ్చిన మార్పు అని ఎద్దేవా చేశారు. ఉన్నదాన్ని మార్చడం కోసం ప్రజలు కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టారా లేక అభివృద్ధి కోసం అధికారం ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. సోనియాగాంధీ పుట్టిన రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం వల్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వాళ్లు ఇస్తున్న సందేశం ఏంటని ఆయన అడిగారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తెలంగాణవాదుల అభిప్రాయాల మేరకే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆవిష్కరిస్తే నేటి సీఎం ఏకపక్షంగా ప్రజలకు నచ్చకున్నా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఎవ్వరైనా మన తల్లి గొప్పగా ఉండాలని కోరుకుంటామే తప్పా తక్కువ చేసుకోబోమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు స్వాగతించడం లేదని, మునుపటి తెలుగు తల్లి విగ్రహాన్ని ఇక్కడి ప్రజలు ఆరాధించి పూజిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు జాప్యం వల్ల ఎంతో మంది యువత అసువులు బాశారని చెప్పారు. వారి చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. చావు నోట్లోకి వెళ్లివచ్చిన కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. ఉన్నవాటిని మార్చడం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, సీనియర్ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రవీందర్, పీఏసీఎస్ చైర్మన్ విఠల్, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీ రాజేందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.