కొడంగల్ : ప్రభుత్వం చూపిస్తున్న కక్షసాధింపు చర్యలకు ఎవరూ భయపడొద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన బొంరాస్‌పేట మండలంలోని బొట్లవోనితండాను సందర్శించి తండా వాసులు, నాయకులతో మాట్లాడారు. సమస్యలపై పోరాడి సాధించుకుందామన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉన్న చోట ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా అభివృద్ధిని అడ్డుకొంటున్నదని.. ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
కనీసం సొంత నియోకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచన సీఎంకు లేకపోవడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా జీవిస్తే.. ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం అండదండలతో స్థానికంగా కొందరు నాయకులు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ శేరినారాయణరెడ్డి, మాజీ ఎంపీటీసీ తిరుపతయ్య, ఉపాధ్యక్షుడు నెహ్రూనాయక్, సర్పంచ్ బాలూనాయక్, ఉప సర్పంచ్ రవీనాయక్, రవిగౌడ్, మల్లేశ్‌గౌడ్, లగచెర్ల సురేశ్, పులిసింగ్నాయక్, దేశ్యానాయక్ పాల్గొన్నారు.