కొడంగల్, జూన్ 18 : కాంగ్రెస్ చేతగాని పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని దుద్యాల మండలంలోని గౌరారం గ్రామం చాంద్‌పాషా ఫాంహౌస్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరిన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రేవంత్‌కు రైతులపై ఎనలేని ప్రేమ గుర్తుకు వచ్చిందని,ప్రస్తుతం రైతు భరోసాలో భాగంగా రైతు ఖాతాలో నగదు జమ చేస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ మోసపూరిత పాలనను ప్రజలు గుర్తిస్తున్నారని, ఎన్ని ఎత్తులు వేసినా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదన్నారు. అభివృద్ధి పేరుతో పచ్చటి భూములను లాక్కొంటున్నారని, భూములిచ్చిన రైతులకు ప్రకటించిన నష్ట పరిహారాన్ని కూడా పూర్తి స్థాయిలో అందించకుండా మోసం చేస్తున్నారన్నారు.
పాలనపై చిత్తశుద్ధేది?
ప్రజా పాలనపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. అధికారం దక్కించుకునే దిశగా గ్యారెంటీలను ప్రకటించి మోసపూరితంగా అధికారాన్ని దక్కించుకున్నట్లు తెలిపారు. అప్పట్లో కేసీఆర్ అందించిన కల్యాణలక్ష్మి పథకంతో పాటు తులం బంగారాన్ని అందిస్తామని రేవంత్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు తులం బంగారాన్ని ఏ ఒక్క లబ్ధిదారు కూడా అందుకోలేదన్నారు.
దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతుల తరపున పోరాటం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి జైలుకు పంపించడం కాంగ్రెస్ పార్టీ పాలనకు నిదర్శనంగా పేర్కొన్నారు. కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్ ప్రాంతానికి లక్షా 50వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా 90 శాతం పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందడం వల్లే నేడు సీఎం నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై కాంగ్రెస్ శ్రేణులను ప్రజలు నిలదీయాలని, కలిసికట్టుగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్నది మళ్లీ బీఆర్ఎస్ సర్కారేనని, కాంగ్రెస్‌తో పాటు రేవంత్ పతనం కొడంగల్ నుంచే ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కొడంగల్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల అధ్యక్షులు దామోదర్‌రెడ్డి, చాంద్‌పాషా, యాదగిరి, మాజీ జడ్పీటీసీ మహిపాల్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబు, బీఆర్ఎస్ నాయకులు బాబర్, నరేశ్, సురేశ్, శ్రీను, రవిగౌడ్ పాల్గొన్నారు.