తాండూరు/తాండూరు రూరల్ , మే 3 : తెలంగాణలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన సాగుతోంది, సీఎం రేవంత్ చక్రవర్తిని అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. ఆదివారం తాండూరులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, పక్క రాష్ట్రమైన సీఎం చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయి, ఆయన చెప్పిందే చేస్తున్నారని విమర్శించారు. రాష్ర్టాన్ని దోచిపెడుతున్నారన్నారు. ఆరు గ్యారెంటీలను విస్మరించారన్నారు. సీఎం రేవంత్‌కు పక్క నియోజకర్గమైన తాండూరులో ఏమి జరుగుతుందో తెలియదా? తెలిస్తే కూడా ఏమీ అనలేకపోతున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హోం, విద్య, మున్సిపల్ శాఖలను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాండూరు పట్టణంలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తే, పేరు మార్చి కాంగ్రెస్ పాలకులు ఇందిరమ్మ ఇండ్లు అని ఫ్లెక్సీలపై రాసుకోడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పట్టణంలో ఓ వర్గానికి చెందిన వారికి 200 ఇండ్ల పంపిణీకి ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా డ్రా తీసి, పంపిణీ చేస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజున ఈ డ్రా తీయడం ఏమిటన్నారు. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లకు ఏమీ పట్టదా? ఈ విషయంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నీరజ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పట్టణంలో 36 వార్డులున్నాయి. అన్ని వార్డుల్లో అన్ని మతాలు, కులాలవారు ఉన్నారు. అన్ని వర్గాల పేదవారికి 200 చొప్పున ఇండ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కులాల, మతాల మధ్య చిచ్చుపెట్టకుండా, అందరికీ సమానంగా ఇండ్లు మంజూరు చేయాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు అమ్ముకుంటున్నారని విమర్శించారు. కలెక్టర్‌కు ఫోన్ చేస్తే సమాధానం లేదు. ఎస్ఎంఎస్ పెట్టినా రిైప్లె ఇవ్వరు. ఇదా ప్రజాపాలన అని ప్రశ్నించారు. ఇటీవల పరిగిలో 1,200 ఎకరాల పేద రైతులు భూములు కోల్పోయే బాధితులకు, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వెళుతుంటే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులైన సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను హౌజ్ అరెస్టులు, దిగ్బంధాలు చేశారన్నారు. అదే కవిత వికారాబాద్‌కు వస్తే పోలీసుల పహారాలో ధర్నా చేయించారని విమర్శించారు. ఇదేనా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక అంటే ఎద్దేవా చేశారు.
విద్య గురించి చెప్పనక్కరే లేదు. గతంలో గురుకులాల్లో చదువుకునేందుకు పెద్దఎత్తున పోటీ ఉండేది, నేడు గురుకులాలంటేనే తల్లిదండ్రులను భయపడేలా చేశారు. ఫుడ్ పాయిజన్‌తో కొంత మంది విద్యార్థులు చనిపోయారు. ఇలా అనేక సమస్యలతో గురుకుల పాఠశాలలు కొట్టుమిట్టాడుతున్నాయని పేర్కొన్నారు. దాంతో తల్లిదండ్రులు గురుకులాల్లో విద్యార్థులకు చేర్చేందుకు ఇష్టపడటంలేదన్నారు. మున్సిపల్ శాఖ గురించి తాండూరు పట్టణంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పేరుగా మార్చి, ప్రైవేట్ సంస్థకు అప్పగించారని విమర్శించారు. సీఎం చేసే శాఖల పరిస్థితి దారుణంగా తయారయ్యాయని వివరించారు. సీఎంకు తన వద్ద ఈ శాఖలు ఉన్నాయా? అనే విషయం గుర్తుందా ? లేదా?అనే సందేహం కలుగుతున్నదన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లపై బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, పేదల కోసం లీగల్‌గా కోర్టుకు కూడా వెళతామన్నారు.
పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ ప్రైవేట్ సంస్థ అయిన జీఎంకె ట్రస్టు ద్వారా 200 మంది పేర్లపై డ్రా తీయడంపై గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో 861 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తే, సుమారు 9 వేల దరఖాస్తులు అప్పట్లో వచ్చాయన్నారు. దరఖాస్తులు ఎక్కువ వచ్చినందున డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ పెండింగ్‌లో పెట్టారన్నారు. కేసీఆర్ కట్టించిన ఇండ్ల పేరు మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండ్ల విషయంలో కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కూడా ఈ ఇండ్ల విషయంపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసచారి, నరేందర్‌గౌడ్, జావేద్, ఈర్షద్, ఆనంద్, ధనలక్ష్మి, రూప, దత్తు, ఫిరోజ్‌ఖాన్, సంతోష్‌గౌడ్, ఇంతియాజ్, రుద్రపాటిల్, సంజీవరావు, కరుణాకర్, ఆఇఫ్, శ్రీనివాస్, రమేశ్ ముదిరాజ్, పలువురు కౌన్సిలర్లు ఉన్నారు.