ఆమనగల్లు, అక్టోబర్ 15 : కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని కొత్తకుంటతండా గ్రామపంచాయతీకి చెందిన దాదాపు 20 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొనుగోటి అర్జున్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభావం తప్పదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలన్నారు.
ఇటీవల అసెంబ్లీలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పెట్టి తర్వాత జీవో-9 తీసుకువచ్చి ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడం జరిగిందని.. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఇటీవల హైకోర్టు ఈ జీవోను కొట్టివేయడం జరిగిందన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలని ఉంటే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్లో రాజ్యాంగ బద్దంగా బీసీలకు 42 శాతం ఆమోదం తెలిపేలా ఒత్తిడి తెచ్చేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల 18న బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఈ బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు కుమార్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ సత్యం, మాజీ సర్పంచ్‌లు, నాయకులున్నారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి
పరిగి : దోమ మండలం గూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహమ్మద్ బషీర్, తన కుమారులతో కలిసి బుధవారం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులున్నారు.