శంషాబాద్ రూరల్, నవంబర్ 29 : ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణనిరాహార దీక్షతోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసిందని మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం శంషాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన దీక్షాదివస్ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథులుగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ముందుండి పోరాటం చేయడం వల్లే 2014లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.
తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారని గుర్తు చేశారు. పదేండ్ల పాటు రాష్ర్టాభివృద్ధితోపాటు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందాయన్నారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని, కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్న ఏడాది కాలంలోనే రాష్ట్రం అధోగతిపాలవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బాపు కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఐటీ, రియల్ రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందాయని, ఏ ప్రాంతంలోనైనా ఎకరా భూమికి రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు డిమాండ్ వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను పక్కాగా అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మితో ఆర్థిక సాయం అందించారని, మిషన్‌కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత, పునరుద్ధరణ పనులు చేశారన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసిన గొప్ప మహానేత కేసీఆర్ అని గుర్తుచేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ వెంకటరమణరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కొంపల్లి అనంతరెడ్డి, ఈట గణేశ్, సత్యనారాయణ, శంషాబాద్ మాజీ ఎంపీపీ జయమ్మాశ్రీనివాస్, శంషాబాద్ కౌన్సిలర్ భారతమ్మ, దిద్యాల శ్రీనివాస్, కొన్నమొల్ల శ్రీనివాస్, అవినాశ్‌రెడ్డి, మంచర్ల మోహన్‌రావు, గుంటి చరణ్, అశోక్, చిన్నగండు రాజేందర్, హన్మంతు ముదిరాజ్ పాల్గొన్నారు.
కేసీఆర్ ఉద్యమ పటిమ చరిత్రలో నిలిచిపోతుంది..
– కార్తీక్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఇన్చార్జి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత ముందుండి నడిపించిన ఉద్యమ పటిమ చరిత్రలో నిలిచిపోతుందని రాజేంద్రనగర్ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి అన్నారు. నాడు బలవంతంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన నాటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం కొనసాగిందన్నారు. కేసీఆర్ రథసారధిగా సాగిన ఉద్యమంలో తెలంగాణ సమాజమంతా పోరాటంలో పాలుపంచుకున్నదన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది అసువులు బాస్తుతుండగా, చలించిన కేసీఆర్ తెలంగాణ కోసం సచ్చుడో.. రాష్ట్రం వచ్చుడోనని చేపట్టిన దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందన్నారు. కేసీఆర్ ఉద్యమ తీరును భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. అభివృద్ధి పథంలో రాష్ర్టాన్ని నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు.. ఇక సాగవని, రాబోవు రోజుల్లో వారికి తగిన గుణపాఠం తప్పదని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుకు కీలక మలుపే దీక్షాదివస్..
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్షే తెలంగాణ ఏర్పాటుకు కీలక మలుపు అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అన్న నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. 2014లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ దీక్షాదివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. డిసెంబర్ 1 తేదీన దవాఖానలలో రోగులకు పండ్లు పంపిణీ, 2వ తేదీన కళాకారుల ఆటపాట, 3వ తేదీన అమరుల కుటుంబాలకు సన్మానం, 4వ తేదీన విద్యార్థులతో ప్రత్యేక సమావేశాలు, 5వ తేదీన రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కిషన్‌రెడ్డి సూచించారు.
కేసీఆర్ దీక్షతోనే దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం..
– ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమ రథసారధి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నా.. విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా.. అప్పటి ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమై దీక్షను చేపట్టిన మహానేత కేసీఆర్ అని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకుల ఒత్తిడితో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. కరీంనగర్లో కేసీఆర్ చేపట్టిన ఆమరణనిరాహార దీక్షతో కేంద్రం దిగివచ్చి 2014జూన్ 2 తేదీన తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసిందని వివరించారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర మరువలేనిది..
– మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్
హైదరాబాద్ రాష్ర్టాన్ని బలవంతంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితే.. ఆంధ్ర పాలకులు ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని, ఆంధ్ర పాలకుల తీరు నచ్చక 1969లో తెలంగాణ ఏర్పాటుకు ఉద్యమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అసువువులుబాసినా ఫలితం దక్కలేదన్నారు. దేశవ్యాప్తంగా బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. 2001లో కేసీఆర్ న్యాయకత్వంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం… 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే రాష్ట్రం సిద్ధించిందన్నారు. కేసీఆర్ పాలనలో పదేండ్లు అద్భుత పాలన అందించారన్నారు.