రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) ; న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం సైతం నిర్బంధ కాండను కొనసాగించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో ఉంచారు. కొంతమంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన పిలుపుమేరకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే అక్రమ అరెస్టులకు పూనుకున్నారు. అరెస్టు అయిన బీఆర్ఎస్ నేతలు ఠాణాల్లోనే నిరసనలను కొనసాగించారు. కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ ధోరణిపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు భగ్గుమన్నారు. అరెస్టులతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజులుగా సర్కారు నియంతృత్వం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేయడంతో గురువారం బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన చేయగా పోలీసులు హరీశ్‌రావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అరెస్టు చేసి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి, కేశంపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టగా, పోలీసులు వెనక్కి తగ్గి అర్ధరాత్రి విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం అరికెపూడి గాంధీ ఇంట్లో సమావేశం నిర్వహించేందుకు తరలిరావాలని కౌశిక్ రెడ్డి, శంభీపూర్ రాజులు పిలుపునివ్వడంతో పోలీసులు మరోమారు జులుం ప్రదర్శించారు.
సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ శ్రేణులపై శుక్రవారం తెల్లవారుజాము నుంచే సర్కారు నియంతృత్వాన్ని ప్రదర్శించింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగింది. దీంతో ఠాణాల్లోనే బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలను కొనసాగించారు. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్యనేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆమె నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని నందిగామ మండలం మొదళ్లగూడలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు.
భగ్గుమన్న తెలంగాణ వాదులు..
బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అరెస్టుల పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని, కాంగ్రెస్ అసంబద్ధ విధానాలపై ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమేనని తెగేసి చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఆనాటి ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై దాడిచేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం… కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు విధానాలకు నిదర్శనమని పేర్కొంటున్నారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని కాంగ్రెస్ తీసుకొచ్చిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.
ప్రజా పాలన అంటే నిర్బంధాలా ?..
కాంగ్రెస్ ప్రజా పాలన అంటే నిర్బంధాలు చేయడమేనా ? శాంతియుతంగా నిరసన తెలుపాలనుకున్న బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేయడం ఏమిటీ ?.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకొంటున్న అరికెపూడి గాంధీ ఇంటికి సమావేశం కోసం వెళ్లడానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. నిర్బంధాలు, కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తాం. ప్రజలకు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్థమవుతున్నాయి. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌ను గద్దె దించి బుద్ధి చెబుతాం.
– మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి