యాచారం, డిసెంబర్ 15 : రమణీయతను పంచుతున్న పల్లె ప్రకృతివనంతో పల్లెలో కొత్తశోభ సంతరించుకుంది. ఏపుగా పెరిగిన వివిధ రకాల మొక్కలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతన వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలేశుడి గుట్టకింద ఉన్న పల్లె పకృతివనం పార్కును తలపిస్తున్నది. చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. సాయంత్రం ప్రశాంతవాతావరణాన్ని కల్పిస్తున్నది.
పర్యవేక్షిస్తూ.. సంరక్షిస్తూ..
పల్లె ప్రకృతివనాన్ని స్వయంగా సర్పంచ్ శ్రీధర్‌రెడ్డి ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. దీంతో మండలంలోని 24 పంచాయతీల్లో యాచారం పల్లె పకృతివనం అందరినీ కట్టిపడేస్తున్నది. ప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు అన్ని రకాల వసతులు ఉండడంతో ఇతర గ్రామాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నది. యాచారం పల్లెప్రకృతి వనానికి కడియం నుంచి అశోక, బొగోడ, కోనోకార్ఫస్ ఇతర మొక్కలను తీసుకొచ్చారు.పండ్లు, పూలు, డిజైన్ మొక్కలను పెంచుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిత్యం ట్యాంకర్‌తో కలుపుతీసి సంరక్షిస్తున్నారు. చుట్టూ ప్రహరీతోపాటు రూ.18 వేలతో రెండు గేట్లు, రూ.2లక్షలతో ముఖద్వారం, మొక్కల మధ్య సరదాగా నడిచేందుకు రూ.40వేలతో వాకింగ్ ట్రాక్, కూర్చొని సేద తీరేందుకు దాతల సహకారంతో కుర్చీలను ఏర్పాటు చేశారు.
3,500 మొక్కల పెంపకం
యాచారం పల్లెప్రకృతి వనంలో 2600 మొక్కలు, గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉన్న మొగుళ్లవంపులో 800, గాండ్లగూడలో 120 మొక్కలను పెంచుతూ వాటిని కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. గతంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్ యాచారం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి నిర్వహణను చూసి అభినందించారు. జిల్లాలోనే యాచారం ప్రకృతివనం ప్రత్యేకతను సంతరించుకున్నది.
మొక్కలను వృక్షాలుగా మలచడమే లక్ష్యం
పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్న ప్రతి మొక్కనూ బతికిస్తాం. ప్రకృతి వనంలోని మొక్కలను వృక్షాలుగా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పంచాయతీ సిబ్బంది నిత్యం ఉదయం, సాయంత్రం మొక్కలకు నీళ్లు పోసి బతికిస్తున్నారు. ప్రకృతి వనం చుట్టూ ప్రహరీ, ముఖద్వారం, రెండు గేట్లు, నడిచేందుకు అన్ని వైపులా దారి, కూర్చునేందుకు కుర్చీల వసతిని ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనాన్ని మరింతగా అభివృద్ధి చేస్తాం.
– ముదిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ యాచారం
పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలి
మండలంలో పల్లె ప్రకృతి వనాలు అన్ని విధాలుగా సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా యాచారం పల్లె ప్రకృతివనం మండలంలోనే ఆదర్శంగా నిలువడం అభినందనీయం. మండలంలో హరితహారం, పల్లె ప్రకృతివనం, బృహత్ ప్రకృతివనాల్లో నాటిన ప్రతి మొక్కను బతికించి పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటి సంరక్షించాలి. పచ్చదనాన్ని, పర్యావరణాన్ని సంరక్షించాలి.
– కొప్పు సుకన్య, ఎంపీపీ, యాచారం