వికారాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏడాది పాలనలో జిల్లా రైతాంగాన్ని ఆగం చేసింది. రైతు భరోసా, ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక విస్మరించింది. రూ.2 లక్షల రుణాలను ఒకే విడుతలో మాఫీ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ గత నాలుగు నెలలుగా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతున్నది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడంతో అర్హులైన రైతులకు నష్టం జరిగింది. ఇప్పటి వరకు మూడు విడుతల్లో రూ.1.50 లక్షల్లోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. నాలుగో విడుతలో రూ.2 లక్షల్లోపు రుణాలున్న రైతులకు సంబంధించిన జాబితాను ప్రకటించింది.
వారం రోజుల్లో సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బును జమ చేసేందుకు ప్రభుత్వం ప్రకటించింది. రూ.2 లక్షలకుపైన రుణాలున్న రైతుల్లో మాత్రం రుణమాఫీ అవుతుందా.. కాదా.. అన్న ఆందోళన నెలకొన్నది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.2 లక్షలపైన ఉన్న రుణాలను ఆగస్టు 15లోపు చెల్లించకపోతే మాఫీ వర్తించదని సంబంధిత అధికారులు స్పష్టం చేయడంతో చాలా మంది రైతులు రూ.2 లక్షలపైన ఉన్న మొత్తాన్ని చెల్లించారు. కటాఫ్ రుణాన్ని చెల్లించినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 లక్షలకుపైన మొత్తాన్ని చెల్లించిన రైతులు..
పట్టాదారు పాసు పుస్తకాలను కాకుండా రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో చాలా మంది అర్హులైన రైతులు నష్టపోయారు. రూ.2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయాధికారులు చెప్పడంతో కొంతమంది రైతులు చెల్లించారు. జిల్లా వ్యవసాయాధికారుల మాట విని జిల్లాలో రూ.2 లక్షలపైన రుణాలున్న సుమారు 2 వేల మంది రైతులు కటాఫ్నకు పైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించి రసీదులను వ్యవసాయాధికారులకు అందజేశారు. ఒకవైపు రుణాలను మాఫీ చేస్తున్నామంటూనే తిరిగి రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందు ప్రగల్భాలు చెప్పి ఇప్పుడు నట్టేట ముంచుతుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రుణాలు రూ.2 లక్షల పైచిలుకు ఉన్న రైతులు మిగతా రుణాలను చెల్లించేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలయ్యారు. పంట పెట్టుబడికి అప్పులు చేసిన రైతులు, రుణమాఫీ వర్తించేందుకు అప్పులు చేయడం తీవ్ర భారంగా మారింది. ఆగస్టు చివరి వారంలో విధివిధానాలు తెలియజేస్తామని అధికారులు తెలిపిన్పటికీ ఇప్పటివరకు నిబంధనలు ఏమిటో ఖరారు కాకపోవడం గమనార్హం.
మాఫీ చేసి, మాట నిలబెట్టుకోవాలి..
మర్పల్లి కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.2.03 లక్షల రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని చెల్లించాలని చెప్పింది. అప్పు చేసి పైన ఉన్న మొత్తాన్ని చెల్లించా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
– నీలి శంకరయ్య, మర్పల్లి
కాంగ్రెస్ మాటల గారడీ చేస్తున్నది..
కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడీ చేస్తున్నది. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి కొంతమందికే వర్తింపజేయడం సరికాదు. అర్హులందరికీ ఎలాంటి నిబంధనలు, కొర్రీలు లేకుండా రుణమాఫీ చేసి, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
– రాములు, విఠ్యల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం