బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా కరెంట్ ఇస్తుంటే.. కాంగ్రెస్‌కు మాత్రం కడుపు మండుతున్నది. 24 గంటలు దండగ.. 3 గంటలే చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా రైతన్నలు భగ్గుమంటున్నారు. 10 హెచ్‌పీ బోరు మోటర్లు వాడితే ఎన్ని ఎకరాలకైనా నీరు పారించవచ్చన్న ఉచిత సలహాలు కాక పుట్టిస్తున్నాయి. ఎన్నికల ముందే ఆ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుండటంతో తర్వాత సంగతేమిటని గ్రామాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఏ రైతునూ కదిలించినా వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
10 హెచ్‌పీ మోటర్లు ఒకేసారి నడిస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయని, సబ్స్టేషన్లలో బ్రేక్డౌన్లు ఖాయమని వాపోతున్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో హస్తం పార్టీ ప్రభుత్వ పాలన కండ్ల్లారా చూస్తున్న అక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. అయితే తెలంగాణలోనూ పాగా వేయాలని కుట్ర రాజకీయం చేస్తుండడంతో తగిన బుద్ధి చెబుతామని ఇక్కడి కర్షకులు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. అసలు వ్యవసాయం గురించి తెలుసా? ఏ రైతయినా 10 హార్స్పవర్ మోటర్ ఎందుకు పెట్టుకుంటాడు? అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు అధికారం అప్పగిస్తే.. ఇక మా బతుకులు ఆగమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి,నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు. గట్టిగా అడిగితే 10 హెచ్‌పీ మోటార్లు అంటూ ఏదో కహానీలు చెబుతున్నారు. అంటే..దశాబ్దాలపాటు కరెంటు సరిగా ఇవ్వకుండా మనల్ని కాల్చుకుతిన్న కాంగ్రెస్‌కు సరిపోక..14 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో..పదేండ్లుగా ప్రశాంతంగా బతుకుతున్న రైతులను మళ్లా చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. ఇచ్చేది మూడు గంటలే అయితే పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట, రాత్రి ఒక గంట ఇస్తారేమో! అని రైతాంగం ఎద్దేవా చేస్తున్నది.
ఇదే జరిగితే..పొలం తడవక పంటలు పండక కనీసం తిండి గింజలు కూడా ఎల్లని పరిస్థితి రానున్నది. మరో పక్క రైతు బంధు దుబారా అంటున్నరంటే..పెట్టుబడికి సేటు దగ్గర చేయి చాపాల్సి వస్తుందని రైతాంగం ఆందోళన చెందుతున్నది. అప్పుల కుప్పలు మళ్లీ నెత్తిమీదికి వచ్చి ఇప్పుడు పండుగలా ఉన్న వ్యవసాయం మళ్లా దండగైతదని జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉరి తాడో..పురుగు మందో గతి అయి కుటుంబాలు ఆగమైతయని రైతులు చెబుతున్నారు. 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా వంటి వాటితో సంబురంగా బతుకుతున్న అన్నదాతల బతుకుల్లో నిప్పులు పోయాలనుకుంటున్న కాంగ్రెస్‌ను అధికారంలోకి రానివ్వబోమని జిల్లా రైతాంగం బాహాటంగానే చెబుతున్నది.
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటు రైతుల బతుకులు ఆగమే. ఉమ్మడి రాష్ట్రంలో రెండు, మూడు గంటలు వచ్చే కరెంట్‌తో అన్నదాతలు అవస్థలు పడ్డారు. పగలనక, రాత్రనక బావులకాడికిపోయి ఎన్నో ప్రమాదాలకు గురై మృత్యువాత పడ్డారు. రైతులు సచ్చినా కాంగ్రెస్ పట్టించుకోలేదు. మళ్లీ ఎలా ఆదరిస్తం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. మేము రానివ్వం. పదేండ్లుగా రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటుండ్రు. సీఎం కేసీఆర్‌కే మా మద్దతు.
– గంగిడి భూపాల్‌రెడ్డి, హైతాబాద్(షాబాద్)
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నానా కష్టాలు పడ్డం. పగలు కొన్ని గంటలు, రాత్రి కొన్ని గంటల కరెంట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నం. పురుగనక, బూసనక రాత్రంతా మోటర్ల కాడ పడిగాపులు కాసేది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ చీకటి బతుకులే. వ్యవసాయానికి ఎవరూ 10హెచ్‌పీ మోటర్లను వాడారు. అయినా ట్రాన్స్ఫార్మర్లపై లోడు పడి కాలిపోతయ్. అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానే రాదు.. సచ్చేది లేదు.. గాళ్ల మాటలు ఎందుకు నమ్ముతం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.
– శ్రీకాంత్, షాద్‌నగర్
కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తమంటుండ్రు. ఎకరం పొలమైనా పారుతదా..? ఆ మూడు గంటల కరెంట్ మాకెందుకు, సీఎం కేసీఆర్ ఇచ్చే 24 గంటల కరెంటే మాకు కావాలె. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం కళకళలాడుతున్నది. బంగారు పంటలు పండుతున్నయ్. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం. కారుగుర్తుకే ఓటు వేస్తం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. వాళ్ల మాటలు మేము నమ్మము. గతంలో కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలతో ఇనేక ఇబ్బందులు పడ్డాం. కరెంట్ పోయిందంటే వచ్చే వరకు పడిగాపులు గాసేది. వ్యవసాయంతో పాటు వుడ్‌వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నా.
– సాంబశివచారి, వుడ్‌వర్క్ (అబ్దుల్లాపూర్‌మెట్)
గతంలో వ్యవసాయం చేయాలంటే నరకం అనుభవించేది. కరెంట్ కోతలతో సతమతమయ్యేది. రాత్రింబవళ్లు బావుల వద్దే పడుకునేది. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే 24 గంటల కరెంట్ ఇస్తుండ్రు. దీంతో వ్యవసాయానికి కరెంట్ లోటు లేకుండా పోయింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంట్ ఇస్తనంటున్నడు. ఏ లెక్కన పొలం పారుతది. మూడు గంటల కరెంట్‌తో మూల కూడా పారది. భూమి విస్తీర్ణం ఎక్కువ ఉన్నా 10 హెచ్‌పీ మోటర్ అవసరం ఉండదు. వ్యవసాయంపై అవగాహన లేకుండా మాట్లాడుతుండ్రు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. బీఆర్ఎస్ పార్టీకే రైతులమంతా మద్దతు తెలుపుతం. మళ్లీ కేసీఆర్‌నే సీఎం చేసుకుంటం. రైతుల సంక్షేమాన్ని కోరే కారుగుర్తు గుర్తుకే ఓటు వేస్తం.
– గనేట్ అంతయ్య, కవాడిపల్లి (అబ్దుల్లాపూర్‌మెట్)
రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం కాంగ్రెసోళ్లతోని కాదు. ప్రజలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే చీకటి రాత్రులు తప్పవు. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ ఇస్తుండడంతో రైతులు పండుగలా వ్యవసాయం చేసుకుంటుండ్రు. 3 గంటల కరెంట్‌తో కొన్ని గుంటల పొలం కూడా తడువదు. వరి పంట వేస్తే నీళ్లు ఎక్కువగా అవసరం ఉంటది. అవగాహన లేకుండా కాంగ్రెసోళ్లు మాట్లాడుతుండ్రు. ఎకరం భూమిని కూడా సాగు చేయలేము. జనరేటర్లు కొని వ్యవసాయం చేయలేం. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే బిచ్చగాళ్లలా మారి రైతులు ఆగమయ్యే పరిస్థితి వస్తుంది. రైతులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. కాంగ్రెసోళ్లకు ఎలా ఓటు వేస్తం. అస్సలు వేయం. బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకే ఓటు గుద్దుతం. కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలె. మాకు రోజంతా కరెంటు రావాలె. ఇదే మా కోరిక.
– కందాళ బలదేవరెడ్డి, కొహెడ(తుర్కయంజాల్)
తెలంగాణ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నది. బోరుల మస్తు నీళ్లున్నయ్. ఏడాదికి రెండు పంటలు పండిస్తున్నం. 50 ఏండ్లు ఏలిన కాంగ్రెస్ రైతులకు ఏమి చేయలేదు. కొత్తగా సాగుకు 3 గంటల కరెంట్ ఇచ్చి 10 హెచ్‌పీ మోటర్ పెడుతామనడం సిగ్గు చేటు. కాంగ్రెస్ మాయ మాటలు వింటే రైతులు కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం రోడ్డెక్కాల్సిందే. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ అధికారంలోకి రాదు. మోసపు మాటలను ఎవరూ నమ్మరు. మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. కారుగుర్తుకే ఓటు వేస్తాం.
– కలమ్మ, కవాడిపల్లి (అబ్దుల్లాపూర్‌మెట్)
రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం. మాయమాటలు చెప్పే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెసోళ్లు చెబుతున్న మూడు గంటల కరెంట్‌తో ఏ మూల పారదు. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టాలంటే బోరుల నీళ్లు ఉండాలె కదా.. అందులో ఊట ఊరొద్దా.. బుద్ధి ఉండే మాట్లాడుతుండ్రా.. అవగాహన లేని మాటలు మాట్లాడితే తరిమితరిమి కొడుతం. ఇప్పుడు రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నరు. రాత్రిళ్లు బావులకాడి పోకుండా కంటి నిండా నిద్రపోతుండ్రు.
– బాకపురం రామస్వామి అంతారం గ్రామం, (చేవెళ్ల రూరల్)