యాచారం, మే 14 : గత నెల 3న మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల సర్వేకు అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అధికారులు పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఫార్మా భూములకు సర్వే చేపట్టి వెంటనే ఫెన్సింగ్ పనులను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని సర్వేను అడ్డుకున్నారు. అన్నదాతలకు అదనపు పరిహారం కింద చెల్లించాల్సిన ఎకరాకు 121 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చాకే సర్వే చేపట్టాలని అధికారులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆర్డీవో అనంతరెడ్డి అక్కడికి చేరుకొని రైతులు అందోళన చెందవద్దని, సర్వేకు సహకరించాలని రైతులను కోరారు. రైతులు మాత్రం ప్లాట్లు పంపిణీ చేశాకే సర్వే చేయాలని పట్టుబట్టారు.
దీంతో వారం రోజుల్లోగా ప్లాట్ల డ్రా తీసి కబ్జా చూపించడంతోపాటు ప్రభుత్వమే సొంత డబ్బులతో రైతుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్ అందజేస్తుందని అధికారులు, పోలీసుల సాక్షిగా హామీ ఇచ్చి రైతులను శాంతింపజేశారు. ఆర్డీవో హామీ ఇచ్చి నెల రోజులు దాటినా ఫార్మా ప్లాట్ల పంపిణీ ఊసే లేదు. పైగా పోలీసుల పహరాతో సర్వే పూర్తి చేసుకున్న అధికారులు భూములకు ఫెన్సింగ్ వేసే పనులను సైతం ముమ్మరంగా చేపడుతున్నారు. రైతులు మాత్రం భూ నిర్వాసితులకు ప్లాట్లు ఇంకెప్పుడిస్తరోనని ఎదురు చూస్తున్నారు.
నాడు సర్వేకు సహకరించాలని రైతులను ఒప్పించిన ఆర్డీవో అనంతరెడ్డి, డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకట సత్యనారాయణ, ఏసీపీ రాజు, సీఐ కృష్ణంరాజు, తహసీల్దార్ అయ్యప్ప మాత్రం ప్రస్తుతం రైతుల సమస్యను పట్టించుకోకుండా వదిలేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే ప్లాట్లకు సంబంధించి డ్రా తీసి, రైతులకు ప్లాట్ల కబ్జా చూపించి, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు. లేదంటే భూములకు వేస్తున్న ఫెన్సింగ్‌ను అడ్డుకోవడంతో పాటుగా ఇకపై అట్టి భూముల్లో ఎలాంటి పనులు ముందుకు సాగనిచ్చేదిలేదని హెచ్చరిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె (బల్జగూడ)లో ఫార్మా భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కందుకూరు మండలం బేగరికంచె వద్ద 620 ఎకరాల్లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్‌ను బ్లాకులవారీగా ప్లాట్లను తయారుచేశారు. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎకరాకు 121 గజాల స్థలం ఇచ్చేందుకు గత ప్రభుత్వం రైతులకు సర్టిఫికెట్లు ఇచ్చిన విషయం తెలిసిందే, ఇప్పటికే మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్ధిదారుల జాబితాను సైతం అధికారులు విడుదల చేశారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్లాట్ల లబ్ధిదారుల పూర్తి స్థాయి జాబితాను రైతులకు అందుబాటులో ఉంచారు. గత దసరా నుంచి రైతులు ప్లాట్ల పంపిణీ ఎప్పుడు జరుగుతుందోనని వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.
ఫార్మా భూ నిర్వాసితులకు పరిహారంతోపాటు అదనంగా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామ సమీపంలోని బేగరికంచె (బల్జగూడ) వద్ద సర్వేనం.90, 91లలో ఎకరాకు 121 గజాల చొప్పున ప్లాట్లను ఇచ్చేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే లబ్ధిదారులకు పాట్లకు సంబంధించిన పట్టాలను గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అందజేసిన విషయం తెలిసిందే. రైతులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో ప్లాట్ల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. యాచారం, కందుకూరు, కడ్తాల మండలాల భూనిర్వాసితులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలను ఇప్పటికే అందజేసింది. దీనికోసం కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో బల్జగూడ ప్రాంతంలో సుమారు 622 ఎకరాల్లో హెచ్ఎండీఏ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. అక్కడ భూమి చదును చేసి బ్లాకులవారీగా ప్లాట్లను తయారు చేసి, రోడ్ల నిర్మాణం సైతం చేపట్టారు. ప్లాట్ల పక్కనే నయానగరి (ఫోర్గ్ సిటీ) నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పనులు సైతం శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో రైతులకు ఫార్మా ప్లాట్లపై ఆశలు చిగురించాయి. అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం ప్లాట్లను అందజేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
యాచారం, కందుకూరు, కడ్తాల మండలాలకు చెందిన 5720 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో యాచారం మండలంలోని నాలుగు గ్రామాలకు కలిపి ఎకరాకు 121 గజాల చొప్పున 979 మంది రైతులకుగాను 3745 ప్లాట్లు కేటాయించారు. ఇందులో కుర్మిద్ద 1240, నానక్‌నగర్ 359, మేడిపల్లి 1601, తాటిపర్తికి 545 పాట్లు మంజూరు చేశారు. రైతుల పేర్లు కేటాయించిన ప్లాట్లకు సంబంధించిన పూర్తి జాబితాను ఇప్పటికే ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నోటీసు బోర్డులో రైతులకందుబాటులో ఉంచారు. ప్లాట్లకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలున్నా స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో, ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అధికారులు పేర్కొన్న విషయం తెలిసిందే, ఫార్మా ప్లాట్ల లబ్ధిదారుల్లో యాచారం మండలంలో మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కందుకూరు మండలంలో మండలం మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, సాయిరెడ్డిగూడ, అన్నోజీగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, కడ్తాల మండలంలో పల్లెచెల్కతండా గ్రామాలకు చెందిన రైతులున్నారు. త్వరలో ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి, రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
అధికారులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వారం రోజుల్లోగా ప్లాట్ల కబ్జా చూపిస్తామని అధికారులు, పోలీసులు హామీ ఇచ్చి నెల దాటినా ప్లాట్లు పంపిణీ చేయకపోవడం బాధాకరం. అది నెరవేర్చకుండానే ఫార్మా భూముల సర్వేను పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఫెన్సింగ్ పనులను సైతం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలో ప్లాట్లు పంపిణీ చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఫార్మా భూముల ఫెన్సింగ్ పనులను అన్ని విధాలుగా అడ్డుకుంటాం. భవిష్యత్తులో గ్రామంలో ఎలాంటి పనులను కొనసాగించేదిలేదు. రైతులతో కలిసి అడ్డుకుంటాం.
– పాశ్చా బాషా, మాజీ సర్పంచ్, మేడిపల్లి
భూనిర్వాసితులకు కేటాయించిన ప్లాట్లను డ్రా పద్ధతిలో త్వరలోనే కేటాయించేందుకు కృషి చేస్తాం. ప్లాట్ల లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. త్వరలోనే డ్రా పద్ధతిలో ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. అర్హులైన లబ్ధిదారులకు ఎకరాకు 121 గజాల చొప్పున ప్రభుత్వమే రైతుల రిజిస్ట్రేషన్ చేయించి రైతులకు డాక్యుమెంట్ ఇస్తుంది.
– అయ్యప్ప, తహసీల్దార్, యాచారం