Vikarabad | బంట్వారం, జూన్ 24 : సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
ఏవో శ్రావ్య సోమవారం కొంతమంది రైతులకు కంది విత్తనాలను అందజేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఎక్కువగా కంది పంటనే పండిస్తారు. అధికారుల అంచనా మేరకు మండలానికి సుమారు 800 బస్తాల విత్తనాలు అవసరం ఉన్నాయి. అయితే సోమవారం నాటికి అధికారులు విత్తనాలను కేవలం 150 బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో వచ్చిన రైతులు ఎగబడి తీసుకోవడంతో మధ్యాహ్నానికి అయిపోయాయి. మంగళవారం సైతం 20 బస్తాలే సరఫరా చేశారు. దీంతో విత్తనాల కొరకు ఉదయం 10 గంటలకే వచ్చి కార్యాలయం వద్ద కూర్చున్న కొంత మంది రైతులకు సైతం విత్తనాలు అందలేదు. దీంతో రైతులంతా అధికారుల తీరుపై మండిపడుతూ వెనుదిరిగారు. సుమారు 100 మంది రైతులు రైతు వేదిక వద్దకు రాగా సరిపడా విత్తనాలు లేకపోవడంతో అధికారులు చేతులెత్తేశారు. విత్తనాలు సరఫరా చేసే డీలర్లు సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఈ సమస్య నెలకొందని ఏవో శ్రావ్య పేర్కొంటున్నారు. ఇప్పటికే రైతులకు విత్తనాలు విత్త సమయం దగ్గర పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని వారు కోరుతున్నారు.