రంగారెడ్డి, మే 17 (నమస్తే తెలంగాణ) : గత యాసంగిలో అతివృ ష్టి, అనావృష్టితో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు వానకాలంలో పంటల సాగు కోసం రైతు భరోసా పెట్టుబడి సాయంపై ఆశలు పెట్టుకున్నా రు. వర్షాకాల పంటల సాగు కోసం ఇప్పటికే జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. సుమారు లక్ష ఎకరాలకు పైగా వరి సాగు కానున్నట్లు అంచనా వేశారు. ఈ పంట సాగుకు రైతుభరోసాను సకాలంలో అందించి ఆదుకోవాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
లేకుం టే పంట సాగులో తీవ్ర ఇబ్బంది పడుతామని పేర్కొంటున్నారు. గత యాసంగిలో అప్పులు తీసుకొచ్చి సాగు చేశామని.. ఆ అప్పులే ఇంకా తీరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా గతం లో పెట్టుబడి సాయానికి చాలామంది రైతులు దూరమయ్యారు. మరోవైపు అతివృష్టి, అనావృష్టితో పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈ యాసంగి పూర్తిగా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేసింది. పంట చేతికందే సమయంలో వడగండ్ల వాన, అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొన్నది.
జిల్లాలో సుమారు 3,00,000పైగా రైతులు రైతుభరోసాకు అర్హులుగా అధికారులు గుర్తించారు. వీ రందరకి రైతుభరోసా కింద పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా.. గత యాసంగిలో సగం మందికి మాత్రమే ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ఈ వానకాలంలో సాగు విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉండడంతో.. అన్నదాతలు రైతుభరోసా ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. వర్షాకాలంలో పొలం పను లు ప్రారంభం కాగానే పెట్టుబడి సాయాన్ని అం దించాలని కోరుతున్నారు. కానీ, ప్రభుత్వం ఇంకా భరోసాకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. అదేవిధంగా పంట రుణాలు మాఫీ కాని వేలాది మంది రైతుల రుణాలను మాఫీ చేయాలని కోరుతున్నారు.
కేసీఆర్ హయాంలో రైతుబంధు పంటల సాగుకు ముందే అన్నదాతల బ్యాంకు ఖాతా ల్లో జమ అయ్యేది. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుభరోసా పెట్టుబడి సాయం కోసం ఏడాదిగా ఎదురు చూడాల్సి వస్తున్నది. గత యాసంగిలో కొద్దిమంది రైతులకు పెట్టుబడి సాయాన్ని పంపిణీ చేసి.. మిగిలిన రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో చాలామంది వ్యాపారుల వద్ద వడ్డీకి తీసుకొచ్చి పంటలను సాగు చేశారు. రేవంత్ సర్కార్ అన్నదాతను ఇబ్బంది పెట్టకుండా.. అర్హులందరికీ రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని పంటల సాగుకు ముందే అందించి ఆదుకోవాలి. -చిలుకల బుగ్గరాములు