యాచారం, అక్టోబర్ 10 : ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూ ములు కోల్పోయిన నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121 గజాల స్థలాన్ని కేటాయించిం ది. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లను అందజేసింది. కాగా, వారి కోసం కందుకూ రు మండలంలోని మీర్ఖాన్పేట సమీపంలోని బేగరికంచె (బల్జగూడ) వద్ద సర్వేనంబర్ 90, 91లో ఉన్న 620 ఎకరాల్లో..బాధితులకు ఎకరాకు 121 గజాల చొప్పున పాట్లను ఇచ్చేందుకు హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ లేఅవుట్లో బ్లాకుల వారీగా ప్లాట్లను అధికారులు ఏర్పా టు చేశారు.
గత జూలైలో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు కలిసి అక్కడే లాటరీ ద్వారా రైతులకు ప్లాట్ నంబర్లను కేటాయించారు. కాగా, లాటరీ తీసి మూడు నెలలు దాటుతున్నా నేటికీ రైతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. అసలు అధికారులు పత్రాలిస్తారా..?..ఇవ్వరా..? అని దిగులు చెందుతున్నారు. తమ ప్లాట్ల పత్రాలు ఎప్పుడు వస్తాయోనని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తే అక్కర నిమిత్తం అమ్ముకుంటామని కొంతమంది పేర్కొంటున్నారు. దీనిపై ప్రజాప్రతినిధులు, అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు మండిపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఫార్మాకు భూములివ్వని రైతులకు సంబంధించిన ప్లాట్లు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఆ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల కోసం రైతు లు తమ వివరాలను అధికారులకు ఇవ్వలేదు. దీంతో సుమారు 800 మంది రైతులకు చెందిన 2200 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లకు లా టరీ తీసి ప్లాట్ నంబర్ అలర్ట్ చేసినా రైతులు తీసుకునేందుకు సుముఖత చూపడంలేదు. తమకు భూములే కావాలని..ప్లాట్లు వద్దని ఆర్డీవో అనంతరెడ్డికి వారు వినతిపత్రాన్ని అందజేశారు.
యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాలకు చెందిన 5,720 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. ఇందులో యాచారం మండలంలోని 4 గ్రామాలకు కలిపి ఎకరాకు 121 గజాల చొప్పున మొత్తం 3,745 ప్లాట్లను కేటాయించారు. ఇందులో కుర్మిద్దకు 1,240, నానక్‌నగర్‌కు 359, మేడిపల్లికి 1,601, తాటిపర్తికి 545 గ్రామాల వారీగా ప్లాట్లను మంజూరు చేశారు. ఫార్మా ప్లాట్ల లబ్ధిదారులు యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట, బేగరికంచె, పంజాగూడ, సాయిరెడ్డిగూడ, అన్నోజీగూడ, ముచ్చర్ల, సార్లరావులపల్లి, కడ్తాల మండలంలోని పల్లెచెల్కతండాల్లో ఉన్నారు. వారికే ఇప్పటికే ఆర్డీవో అనంతరెడ్డి ఆధ్వర్యంలో లాటరీ విధానంలో ప్లాట్లను కేటాయించారు.
ఫార్మా బాధితులకు రిజిస్ట్రేషన్ డా క్యుమెంట్లు ఇవ్వాలి. లాటరీ తీసి మూడు నెల లు దాటినా పత్రాలు ఇవ్వకపోవడం దారుణం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆ వెంచర్లో అన్ని వసతులు కల్పించాలి. అలాగే, 600 గజాలకు సంబంధించిన ప్లాట్ల లబ్ధిదారులకు స్థలాలను కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. లేదంటే రైతులకు అండగా ఉండి ఆందోళన చేపడతాం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
భూనిర్వాసితులకు త్వరలోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందజేస్తాం. లబ్ధిదారులకు ఎకరానికి 121 గజాల చొప్పున రైతుల పేరున మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి డాక్యు మెంట్లను ఇస్తాం. ఇటీవల సీఎం చేతుల మీదుగానే మీర్ఖాన్పేటలో ఇవ్వాల్సి ఉండే. కానీ, కొన్ని కారణాలతో ఇవ్వలేకపోయాం. త్వరలో ఇచ్చేందుకు కృషి చేస్తాం. 600 గజాల ప్లాట్ల కోసం ఆలయ భూమిని పక్కనే తీసుకున్నాం. దీని కోసం అనుమతులు రాగానే ప్లాట్ల అభివృద్ధి పనులను చేపట్టి ప్లాట్లు కేటాయిస్తాం.
-అనంతరెడ్డి ఆర్డీవో, ఇబ్రహీంపట్నం
ఫార్మాసిటీ కోసం ఆరు ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులు నేటికీ ఫార్మా ప్లాట్లు నోచుకోలేదు. గతంలో సేకరించిన వెంచర్లో ఇప్పటికే ప్లాట్లు తయారు చేసిన విషయం తెలిసిందే, అయితే ,కాంగ్రెస్ సర్కారు ప్లాట్లు తయారు చేసిన వెంచర్ స్థలం నుంచే 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును నిర్మించనుండడంతో 600 గజాల ప్లాట్ల ఏర్పాటుకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో ఐదెకరాల్లోపు భూములిచ్చిన రైతులకు మాత్ర మే 60, 121, 242, 181, 309 ఇలా ఐదెకరాల్లోపు నిర్వాసితులకు ప్లాట్లను అందజేశారు. స్థలం లేకపోవడంతో ఆరు ఎకరాలకు పైగా భూములు కో ల్పోయిన రైతులకు నేటికీ ప్లాట్లను కేటాయించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్లాట్ల నంబర్లు కేటాయించక ముందే ఎంతోమంది రైతులు తమ ప్లాట్లను అవసరాల నిమిత్తం నోటరీల ద్వారా ఇతరులకు అమ్ముకున్నారు. ఆ ప్లాట్లకు ఫ్యూ చర్ ఉంటుందని గ్రహించిన మాజీ ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు వందల సంఖ్యలో కొనుగోలు చేశారు. మొదట్లో 121 గజాల ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు విక్రయించగా.. ప్లాట్లను లాటరీ తీసే ముందు రూ. 8 లక్షల నుంచి రూ.10లక్షలకు అమ్ముకున్నారు. లాటరీ తీసిన తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ విక్రయాలు జరిగినట్లు సమాచారం. జూలైలో రైతుల ప్లాట్లకు లాటరీ తీసి ప్లాట్ నంబర్ ఇవ్వడంతో కొన్నవారు సంతోషపడ్డారు. కానీ, ప్లాట్ల లాటరీ తీసి నెల లు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ పత్రాలు రాకపోవడంతో ఆం దోళన చెందుతున్నారు. రైతులకు పత్రాలు వచ్చేదెప్పుడు .. వారు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసేదెప్పుడని దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే కొందరు ధరలు అమాం తం పెరగడంతో అసలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేస్తారా ..? లేదా అనే సందేమాన్ని వ్యక్తం చేస్తున్నారు.