రంగారెడ్డి, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు. కాని, పెట్టుబడి సాయం అందక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత యాసంగి సీజన్లో అతివృష్టి, అనావృష్టితో పెట్టిన పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సీజన్లోనైనా రైతు భరోసా ముందుగానే ఇస్తే కొంతమేరకైనా నిలదొక్కుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వానకాలం సీజన్లో వరి, పత్తి, ఆముదం, మొక్కజొన్న పంటలు వేస్తారు. ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించకపోవడంతో అప్పులు చేసి మరీ రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజన్‌కు ముందే రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ.5వేల చొప్పున ముందుగానే వేసేవారు. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చినప్పటికీ అన్నదాతలకు మాత్రం భరోసా ఇవ్వడంలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షగకట్టిందని, తమకు ఏమాత్రం ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడంలేదని పలువురు అన్నదాతలు వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు భూములకు రైతు భరోసా ఇస్తామని చెప్పి అనేక మంది రైతుల పేర్లను తొలగించింది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 3.24 లక్షల మంది రైతులను అర్హులుగా ప్రకటించింది. వీరికి రైతు భరోసా కింద ఏటా రూ.300 కోట్లకు పైగా సాయం ఇవ్వాల్సి ఉంది. కాని, ప్రభుత్వం మాత్రం రైతు భరోసాపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గత యాసంగి సీజన్లో 4 ఎకరాల లోపున్నవారికి మాత్రమే సాయమందించింది. ఈ సీజన్లోనైనా రైతు భరోసా ఇస్తారా.. లేదా అనే అనుమానంతో ఉన్నారు.
అతివృష్టి, అనావృష్టితో తీవ్ర నష్టం
గత యాసంగి సీజన్ ప్రారంభంలోనే బావులు, బోర్లు ఎండిపోయి భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోయి పంట పొలాలు ఎక్కడికక్కడే ఎండిపోయాయి. జిల్లాలోని మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్, కేశంపేట, కొందుర్గు, షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో పెద్దఎత్తున పంట పొలాలు ఎండిపోయాయి. రైతులు పంటల కోసం పెద్దఎత్తున డబ్బులు ఖర్చుపెట్టి ఎండిన పంటలను పశువుల మేతకు వదిలిపెట్టారు. ఉన్న కాస్త పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వాన పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.
బ్లాక్‌లిస్టులో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు
రంగారెడ్డిజిల్లాలోని ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పెద్దఅంబర్‌పేట్, ఆదిబట్ల, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, శంషాబాద్ మున్సిపాలిటీలు అర్బన్ ప్రాంతాలుగా గుర్తించి ప్రభుత్వం ఆ ప్రాంతాల్లోని రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లోని రైతులు అప్పులు చేసి పంటలువేస్తున్నారు. కాని, అతివృష్టి, అనావృష్టి వారిని మరింత కుంగదీశాయి.
అర్హులందరికీ రైతు భరోసా అందజేయాలి
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇప్పటి వరకు పెద్దఎత్తున రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. భూమిని నమ్ముకుని జీవిస్తున్న రైతుల భూములను బ్లాక్‌లిస్టులో పెట్టి రైతు భరోసా సాయం అందించకపోవటం ప్రభుత్వానికి సరైంది కాదు. అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించడంతోపాటు ఎన్నికల్లో రైతులకిచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చాలి.
– మొద్దు అంజిరెడ్డి, ఉత్తమ రైతు
సకాలంలో సాయం చేయాలి
రైతు భరోసాను సకాలంలో అన్నదాతల ఖాతాల్లో జమ చేయాలి. దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. యాసంగిలో సాయమందక ఎన్నో అవస్థలుపడ్డాం. పంట నష్టం కావడంతో అప్పులపాలయ్యాం. సర్కారు ఆలోచన చేసి సాయం అందించాలని కోరుతున్నా.
– జంగయ్యగౌడ్, నల్లచెరువు, మాడ్గుల మండలం
రైతులను ఆదుకోవాలి
అన్నదాతలకు రైతు భరోసా డబ్బులివ్వాలి. వానకాలం పంటల సీజన్ వస్తున్న సందర్భంగా సాయమందిస్తే రైతులకు ఆసరాగా ఉంటుంది. ఇంతకుముందు డబ్బులివ్వకుండా సర్కారు నిర్లక్ష్యం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సాయమందించి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నా.
– శంకరయ్య, నాగిళ్ల, మాడ్గుల మండలం