హైదరాబాద్, ఫిబ్రవరి 25, (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నివేదిక చెల్లదని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి టీ హరీశ్‌రావు తరఫు సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం బుధవారం హైకోర్టులో వాదించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని లేని కేసులో ఇరికించాలన్న కుట్రను ధర్మాసనం గుర్తించాలని కోరారు. ముందస్తు పథకంతో కుట్ర పూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రాజెక్టుకు చెందిన ఒక పిల్లర్ కుంగుబాటుకు కారణాలు తేల్చాల్సిన కమిషన్ తన పరిధికి సంబంధంలేని అంశాల్లోకి వెళ్లి విచారణ జరిపిందని అన్నారు. జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ సీఎస్ శైలేంద్రకుమార్ జోషి, అప్పటి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.
స్మితా సబర్వాల్, ఎస్కే జోషి తరఫున సీనియర్ న్యాయవాదులు జే రామచందర్‌రావు, తరుణ్ జీ రెడ్డి, రాష్ట్రం తరఫు సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, పీ శ్రీరామ్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. హరీశ్‌రావు తరఫున ఆర్యమ సుందరం వాదనలు వినిపిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ముందే నిర్ణయానికి వచ్చేసి విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసిందని చెప్పారు. ఆ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాలంటూ 2024, మార్చి 14న జస్టిస్ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టక ముందే పాలక పార్టీ పెద్దలు మీడియాలో వెల్లడించారని చెప్పారు. దానిని పబ్లిక్ డొమైన్లో కూడా పెడితే హైకోర్టు ఆదేశాల తర్వాత తొలగించారని గుర్తుచేశారు. చట్టప్రకారం, క్యాబినెట్ అనుమతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందున సీబీఐ విచారణకు ఆదేశించినా సిద్ధమని చెప్పారు.
వాదనల పూర్తి వివరాలు..వ్యాపోస్ నివేదిక తర్వాతే..
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టవిరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వ్యాపోస్తో సమగ్ర సర్వే చేయించి నివేదిక తెప్పించాకే నిర్మించారు. 2023లో భారీ వరదల కారణంగా మేడిగడ్డ బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగింది. దీనిని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించి ప్రణాళిక, నిర్వహణ, నిర్మాణ లోపాలున్నట్టు నివేదిక ఇచ్చింది. అనంతరం కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి దీనిపై విచారణ నిమిత్తం జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఏమీ జరుగకుండానే బండి ముందు గుర్రం కట్టినట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నిజనిర్ధారణ చేయాల్సిన కమిషన్ ఆ పని చేయకుండా వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ ఏకపక్షంగా నివేదిక ఇచ్చింది. కమిషన్ నిజనిర్ధారణకు బదులు పిటిషనర్లు తప్పు చేశారన్నట్టు చార్జిషీటు మాదిరిగా రిపోర్టు ఇచ్చింది. పిటిషనర్‌కు రిపోర్టు కాపీ ఇవ్వకుండా, అసెంబ్లీలో చర్చించకుండానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం మీడియాకు బహిర్గతం చేసింది.
వరి సాగులో దేశానికే తలమానికం
నిర్దేశించిన చోట నుంచి మరో చోటికి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని మార్చిన అంశం ఇకడ అప్రస్తుతం. (సీజే కల్పించుకొని ఇకడ ప్రాజెక్టు నిర్మాణ స్థలం ప్రధానం కాదన్నారు). కేంద్రం అన్నింటినీ లోతుగా పరిశీలించింది. ఆ ప్రాజెక్టుతో అనూహ్యంగా భూములు సాగులోకి వచ్చాయి. దేశంలోనే వరి సాగులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానానికి చేరింది. ఈ పరిస్థితుల్లో 2023లో ఒక పిల్లర్ (బ్లాక్ 7) కొద్దిగా బీటలు వారింది. ఈ నేపథ్యంలో 2024లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే దారుణం జరిగిపోయినట్టు గగ్గోలు మొదలుపెట్టింది. రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నిర్మాణప్రదాతను లక్ష్యంగా చేసుకొని విచారణకు ఆదేశించింది.
కమిషన్ పరిధి దాటి వ్యవహరించింది
పిల్లర్ కుంగుబాటుకు కారణాలు ఏమిటో తేల్చాల్సిన కమిషన్ ఏకంగా ప్రాజెక్టు నిర్మాణ తీరుతెన్నులపైనే విచారణ చేయడం చట్ట వ్యతిరేకం. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం మరో విడ్డూరంగా ఉంది. సీబీఐ దర్యాప్తు చేస్తే మాకేమీ అభ్యంతరం లేదు. లోపం ఎకడ జరిగిందో తేల్చడంలో కమిషన్ నిర్లక్ష్యం వహించింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కమిషన్ నిజనిర్ధారణ మాత్రమే చేయాలి. ఫలానా తప్పు జరిగిందని.. చర్యలు తీసుకోవాలని కమిషన్ తేల్చడానికి వీల్లేదు. కమిషన్ నివేదికకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కూడా లేదు. కమిషన్ నివేదికను చట్టసభలో ప్రవేశపెట్టి ఏం చేయాలో సభ నిర్ణయించాలి. రామకృష్ణ దాల్మియా కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వ్యవహరించింది. జ్యుడీషియల్ ఎంక్వైరీకి, కమిషన్ ఎంక్వైరీకి ఉన్న తేడాను గుర్తించి కమిషన్ నివేదికను కొట్టివేయాలి.
ప్రభుత్వం ముందే చెప్పినట్టు..
ప్రభుత్వం ముందే చెప్పినట్టు ఫలానా తప్పులు జరిగాయని కమిషన్ తేల్చింది. చట్టవిరుద్ధంగా ఫలానా వాళ్లు నిర్లక్ష్యం వ్యవహరించారని కమిషన్ నిర్ధారణకు వచ్చేసింది. మొత్తంగా చూస్తే కమిషన్ అన్ని కోణాల్లోనూ చట్ట నిబంధనలను ఉల్లంఘించింది. 10 5 2025 తేదీన కమిషన్ చేసిన కామెంట్లను పరిశీలించండి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్‌లోని సెక్షన్ 4, 5 ప్రకారం కమిషన్‌కు సివిల్ కోర్టు పవర్స్ ఉంటాయి. సీపీసీ కింద మాత్రమే కమిషన్‌కు అధికారాలు ఉంటాయి తప్ప సీఆర్పీసీ కింద ఉండవు. సాక్షిగా పిలిచే అధికారం సెక్షన్ 4 ప్రకారం ఉంది. సాక్షులుగా కమిషన్ సమన్లు జారీ చేయాలేగానీ నిందితులుగా భావించి పిలువకూడదు. ఇవన్నీ నిజనిర్ధారణ కోసమే చేయాలి. సమన్లు ఇచ్చిన ప్రతిని పరిశీలిస్తే కమిషన్ వ్యవహారశైలి బట్టబయలవుతుంది.
రైతులకు ఎంతగానో ఉపయోగం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రైతులకు ఎంతగానో దోహదపడింది. సాగు దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. దేశానికే తలమానికంగా వరి సాగు అవుతున్నది. తప్పుడు నిర్ణయాలు ఎకడా జరగలేదు. అంతా చట్ట ప్రకారమే జరిగింది. అయినా కమిషన్ కొందరు సాక్షుల వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని చట్టవిరుద్ధంగా నివేదిక ఇచ్చింది. బీహార్, ఎల్కే అద్వానీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పిటిషనర్ల ప్రతిష్ట దెబ్బతినేలా చర్యలు ఉండకూడదు. కమిషన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనే నిర్ణయానికి వచ్చినా, ఏదైనా నిర్ణయానికి వచ్చినా దాని ప్రభావం ఉన్న సాక్షులకు రాజ్యాంగం కల్పించిన సహజన్యాయసూత్రాలు దెబ్బతినడానికి వీల్లేదు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వల్ల పిటిషనర్ల విషయంలో సహజ న్యాయసూత్రాలు హరించాయి. కమిషన్ నివేదిక తర్వాత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
సహజ న్యాయసూత్రాలకు తిలోదకాలు
పిటిషనర్లకు సహజ న్యాయసూత్రాలు దెబ్బతినకుండా కాపాడాల్సిన బాధ్యత రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు, సుప్రీంకోర్టులపై ఉన్నది. ప్రాజెక్టు అంచనాలు పెరిగాయని చెప్పి పత్రికల్లో వార్తలు వచ్చాయి. పతాక శీర్షికలతో వచ్చిన వార్తలను పరిశీలిస్తే కమిషన్ నివేదిక ఏకపక్షమని అర్థమవుతుంది. కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో నివేదించడానికి ముందే పత్రికల్లో పతాక శీర్షిక వార్తలుగా రావడాన్ని తీవ్రంగా పరిగణించాలి. మంత్రివర్గ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మించారంటూ ప్రభుత్వం పదేపదే చెప్పినట్టుగానే కమిషన్ కూడా చెప్పడాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం కల్పించిన హకులను కాలరాసే విధంగా, ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే.. పిటిషనర్లకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే కమిషన్ నివేదిక చట్టవ్యతిరేకమని హైకోర్టు ప్రకటించాలి. అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవు. కమిషన్ నివేదికను కొట్టేయాలి’ అని ఆర్యమ సుందరం వాదనలు వినిపించారు.
న్యాయ విచారణ కాదు
ఘోష్ కమిషన్ నిజనిర్ధారణ కమిషన్ మాత్రమే. అది న్యాయ విచారణ కమిషన్ కానేకాదు. కమిషన్ ఇచ్చినవి షోకాజ్ నోటీసులని స్పష్టమవుతుంది. చార్జిషీట్ తరహాలో కమిషన్ చర్యలున్నాయి. కాబట్టి జీవో-6 చెల్లదు. కమిషన్ ప్రాజెక్టు నిర్మాణ అంశాల్లోకి వెళ్లడమే కాకుండా రుణాలు తీసుకోవడంపైన కూడా దృష్టి పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రజావసరాల కోసం ఖర్చు చేసింది. ఈ విషయాల జోలికి కమిషన్ వెళ్లాల్సిన అవసరం ఏముంది? పిల్లర్ కుంగుబాటు జరిగిన తర్వాత రోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని ఏర్పాటుచేసింది. అక్రమాలు జరిగాయని కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ చూస్తే నివేదిక ఏవిధంగా ఇవ్వబోతున్నదో అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌గా పరిగణిస్తూ జీవో ఇవ్వడం చెల్లదు.
క్యాబినెట్ ఆమోదంతోనే పనులు
మంత్రవర్గ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగాయి. వ్యక్తిగతంగా ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ఏకపక్ష నిర్ణయం కాదు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వమే నిర్మించింది. మంత్రివర్గ తీర్మాన ప్రతిని హరీశ్‌రావు కమిషన్‌కు సమర్పించారు. హరీశ్‌రావుకు సాక్షిగా మాత్రమే కమిషన్ నుంచి నోటీసు వచ్చింది. సెక్షన్ 8 ప్రకారం నోటీసు ఇవ్వలేదు. ఫలానా పొరపాట్లు, తప్పులు జరిగాయని ఇతర సాక్షులు చెప్పి ఉంటే వాటిని హరీశ్‌రావుకు ఇవ్వలేదు. వాటిపై వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. తప్పు జరిగిందన్న సాక్షులను క్రాస్‌ఎగ్జామ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కమిషన్ నివేదిక పూర్తిగా ఏకపక్షం, చట్ట వ్యతిరేకం. తెలంగాణ రాష్ట్ర తొలి నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్‌రావు మహారాష్ట్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపాక, ఒప్పందం ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంల చర్చలు జరిపాకే కేంద్ర జల వనరుల శాఖ కూడా ఆమోదం ఇచ్చింది. అన్నింటిపైనా మంత్రివర్గ ఆమోదం ఉంది. ఇది వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జరిగిన నిర్మాణం కానేకాదు.