మంచాల, మార్చి 30 : భూగర్భ జలాలు ఒక్కసారిగా అడుగంటి పోవడంతో మండలంలో కరువు ఛాయలు అలుముకున్నాయి. ఎక్కడ చూసినా వరి పైర్లు ఎండిపోయి పశువులకు మేతగా వేస్తున్నారు. మంచాల మండలం బోడకొండ గ్రామానికి చెందిన రైతు మెగావత్ పాండు రెండు ఎకరాల్లో వరి పంటను సాగుచేశాడు. ఇప్పటివరకు తనకున్న రెండు బోరుబావులు వట్టిపోయాయి. దీంతో తాను సాగుచేసుకున్న వరి పంటకు నీళ్లు సరిపోకపోవడంతో పంటను కాపాడుకునేందుకు రైతు ట్యాంకర్‌కు వెయ్యి రూపాయల చొప్పున రోజూ నాలుగు ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసి పంటకు నీరు అందిస్తున్నాడు. పొట్ట దశలో ఉన్న వరి పంట చేతికి వస్తుందనే ఆశతో రైతు ట్యాంకర్లతో నీటిని పారబెడుతున్నాడు. ఇలా మండలంలోని కొర్రవానితండా, సత్తితండా, బొడకొండలో రైతులు పంటలను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నారు.
యాచారం, మార్చి 30 : మండలంలోని చింతపట్ల గ్రామానికి చెందిన రైతు ఇటికాల వెంకట్‌రెడ్డి తన పంటను కాపాడుకునేందుకు నిత్యం నానా అవస్థలు పడుతున్నాడు. తన పొలంలో నాలుగు బోర్లున్నప్పటికీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు బోర్లలో ఇప్పటికే ఇటీవలే మూడు బోర్లు పూర్తిగా వట్టిపోయాయి. ఒక బోరు మాత్రం అంతంత మాత్రంగానే పోస్తున్నది. తనకున్న 12 ఎకరాల పొలానికిగాను పంటకు నీరందుతుందో లేదోననే సందేహంతో 6 ఎకరాల పొలంలో యాసంగిలో వరి పంటను సాగు చేశాడు. మొదట్లో పంట బాగానే ఉన్నప్పటికీ ఇటీవలే మూడు బోర్లు అడుగంటిపోయాయి. ఉన్న ఒక్క బోరుతో పంట తడారకపోవడంతోపాటు మండుతున్న ఎండలకు క్రమంగా ఎండిపోవడం మొదలైంది.
దీంతో రైతు చేసేదేమీలేక కళ్లముందు ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు సాహసం చేశాడు. ఒక్కో ట్యాంకరు నీటికి రూ.1000 ఖర్చు చేసి నీటి ట్యాంకర్ ద్వారా పంట చేనుకు నీరందించడం మొదలుపెట్టాడు. చేతికొచ్చిన పంటను పొట్ట దశలో ఎండిపోకుండా రోజుకు నాలుగైదు వేలు ఖర్చు చేసి పంటకు నీరందిస్తున్నాడు. అయినప్పటికీ ఒకవైపు నీరు పెడుతుంటే.. మరో వైపు పంట ఎండుముఖం పడుతున్నది. పంట పూర్తిగా ఎండిపోతే పశువులపాలు కాక తప్పదని వాపోతున్నాడు. వేలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పదేళ్ల కాలంలో ఎన్నడూ ఇంతటి కరువును చూడలేదని.. ఈసారి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారిందని వాపోతున్నాడు. గత పదేళ్లు చెరువులు, కుంటలు నీటితో కళకళలాడాయని.. ప్రస్తుతం ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి రైతులకు సాగునీటి కష్టాలు వచ్చినట్లు పేర్కొన్నాడు. పంటలు ఎండిపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆయన తెలిపాడు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం కన్నెత్తి చూడటంలేదని వాపోతున్నాడు. పంటలెండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాడు.