రంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో కొనసాగుతున్న భూసేకరణ అధికారులకు అగ్ని పరీక్షగా మారింది. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం భూములను సేకరించాలని ఆదేశాలు జారీ చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం భూములిచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. రైతులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్య క్షేత్రస్థాయిలో అధికారులు నలిగిపోతున్నారు.
జిల్లాలో పలు పరిశ్రమలు, ఫ్యూచర్‌సిటీ నిర్మాణం, గ్రీన్‌ఫీల్డ్, రేడియల్ రోడ్ల కోసం భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఓఆర్ఆర్ నుంచి ట్రిఫుల్‌ఆర్ వరకు సుమారు 41 కిలోమీటర్ల దూరం ఉండగా 330 అడుగుల వెడల్పుతో వేసే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం సుమారు వెయ్యి ఎకరాలు అవసరం కాగా అందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రభుత్వ భూములు పోగా..మరో ఐదు నుంచి ఆరువందల ఎకరాల పట్టా భూములను సేకరించేం దుకు ఇప్పటికే పలు గ్రామాల్లో అధికారులు సభలను నిర్వహించారు. అయితే, రైతులు మాత్రం తమ పట్టా భూములను ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు.
అలాగే, యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో పరిశ్రమల కోసం రైతుల నుంచి 650 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా.. రైతులతో అధికారులు మాట్లాడినా పరిహారం విషయం ఓ కొలిక్కి రాక అక్కడే ఆగిపోయింది. కందుకూరు మండలంలోని తిమ్మాయపల్లిలోనూ ఫ్యూచర్‌సిటీ కోసం భూములు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, రైతులు తమ భూములను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో అధికారులు వారిని ఒప్పించేందుకు తంటాలు పడాల్సి వస్తున్నది. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కొడంగల్ వరకు వేస్తున్న రేడియల్ రోడ్డు కోసం శంషాబాద్, షాబాద్, కొందుర్గు తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో భూ ములు తీసుకునేందుకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ గ్రామాల్లో భూసేకర ణ కోసం జాయింట్ కలెక్టర్ స్వయంగా గ్రామసభలు నిర్వహించినా భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా యాచారం మండలంలోని కుర్మిద్ద అనుబంధ గ్రామమైన మర్లకుంటతండాలో తమ భూములు తీసుకోవద్దంటూ గ్రామానికి చెందిన రైతులు చేపట్టిన రిలే దీక్షలు గత నెల రోజులుగా కొనసాగుతున్నాయి. తమ భూములు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు కోసం బలవంతంగా తీసుకోవద్దని.. వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించి తమ పేర్లతో ఆన్లైన్లో చేర్చాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, ఏసీపీ రాజు ఆధ్వర్యంలో పలువురు అధికారులు రైతుల దీక్షాశిబిరానికి చేరుకుని దీక్ష విరమించాలని కోరినా రైతులు అంగీకరించలేదు. మీ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా వినిపించుకోలేదు. తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే దీక్ష విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు.
జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి రైతులు ససేమిరా అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ఆయా ప్రాంతా ల వారీగా ప్రభుత్వ మార్కెట్ విలువను బట్టే ఇస్తున్నారు. కానీ, బయటి మార్కెట్లో మాత్రం జిల్లా శివారు ప్రాంతాల్లోని పలు మండలాల్లో భూముల విలువ రూ. ఐదు నుంచి రూ. పది కోట్ల వరకు పలుకుతున్నది. ప్రభుత్వం మాత్రం రూ. కోటి నుంచి రూ. కోటిన్నర వరకే చెల్లిస్తామంటుండగా.. దానిని పెంచాలని రైతులు కోరుతున్నారు. అలాగే, మరికొందరు భూమికి భూమే ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా…భూమికి భూమి ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు చెప్తున్నారు.