పరిగి, సెప్టెంబర్ 13 : అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. శనివారం పరిగి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి యూరియా వచ్చింద న్న విషయం తెలియడంతో అన్నదాతలు తెల్లవారుజాము నుంచే అక్కడ అధికంగా పడిగాపులు కాశారు. 10:30 గంటల సమయంలో ఆగ్రోస్ కేంద్రాన్ని తెరిచి పోలీసుల సమక్షంలో యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. సగం మందికే (యూరియా స్టాక్ ఉన్నంతవరకే) ఇచ్చి అయిపోయాయంటూ నిలిపేయడంతో క్యూలో ఉన్న మిగిలిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా రైతులకు తర్వాత ఇస్తామని సర్ది చెప్పి పంపించేశారు.
ధారూరు : మండలంలోని మోమిన్ఖుర్దు ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే అన్నదాతలు క్యూ కట్టారు. లైన్లో ఉండే ఓపిక లేని వారు చెప్పులను పెట్టారు. అరకొరగా పంపిణీ చేస్తుండటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్ పదేండ్ల పాలన లో ఒక్కరోజు కూడా రోడ్డెక్కని రైతులు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నా రు. శనివారం ఆయన ‘నమస్తేతెలంగాణ’తో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే రైతులకు తిప్పలు మొదలయ్యాయన్నారు.
రైతులకు పెట్టుబడిసాయం అందకపోగా, అరకొరగా పంట రుణాలు మాఫీ అయ్యాయని.. అలాగే, యూరియా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బస్తా యూరియాకోసం రైతులు తెల్లవారుజాము నుంచే సహకార సంఘాలు, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాల ఎదుట నిరీక్షిస్తున్నా ఎరువు దొరకడంలేదన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో ఈ దుస్థితి అని ఆరోపించారు. యూరియా అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.