తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన ‘ధరణి’తో భూ యజమానులు సర్వ హక్కులు కలిగి ఉండి ఎలాంటి చిక్కులు లేకుండా హాయిగా తమ భూములను కౌలుకు ఇచ్చుకుంటున్నారు. కానీ, పట్టాదారు పాసుపుస్తకాల్లో కౌలుదారుల కాలమ్ పెడుతామని కాంగ్రెస్ చేస్తున్న ప్రకటనలపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. భూ యజమానులు, కౌలు రైతులకు కయ్యం పెట్టేలా ఆ పార్టీ నేతల మాటలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు భూ రికార్డులన్నీ ఆగమాగంగా ఉండేవని, పాస్‌బుక్, పహాణీ, షేత్వారీల్లో వేర్వేరు పేర్లు, పట్టాదారు ఒకరు.. అనుభవదారు మరొకరు వంటి తప్పుడు రికార్డులతో రైతులకు ప్రభుత్వ పథకాలేవీ వర్తించేవికావని వాపోతున్నారు. ‘
ధరణి’ వచ్చాక ప్రతి రికార్డూ పకడ్బందీగా ఉండడంతో భూ యజమానులు ఏ ప్రాంతంలో ఉన్నా దర్జాగా తమ భూములను కౌలుకు ఇస్తున్నారన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ‘భూమాత’ పేరుతో కౌలుదారు చట్టాన్ని తీసుకొచ్చి అన్నదాతల జీవితాల్లో కల్లోల పరిస్థితులను రాజేసేందుకు కుయుక్తులు పన్నుతున్నదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చట్టంతో భూ యజమానులు కౌలుకు ఇచ్చే భూములతో వివాదాలు చోటు చేసుకునే ప్రమాదం ఉన్నదని, దీంతో భూములను కౌలుకు ఇచ్చేందుకు ఎవరూ ముందుకురారని, ఫలితంగా చిన్న, సన్న కారు రైతులు తీవ్రంగా నష్టపోతారని భయాందోళనకు గురవుతున్నారు. భూములపై భస్మాసుర ‘హస్తం’తో మళ్లీ పాత రోజులను తెచ్చేందుకు యత్నిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూటకోమాటతో రైతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు.
-రంగారెడ్డి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు భూ రికార్డులన్నీ ఆగమాగం. పాస్‌బుక్కులో ఒక పేరు.. పహాణీలో ఇంకో పేరు.. షేత్వారీలో మరో పేరు. పట్టాదారు ఒకరు.. అనుభవదారు మరొకరు.. తప్పుడు రికార్డులు.. తప్పుడు పేర్లతో ప్రభుత్వ పథకాలేవీ వర్తించని పరిస్థితి ఉండేది. పర్యవసానం అప్పులు.. వాటిని తీర్చలేక ఆత్మహత్యలు.. ‘ధరణి’ వచ్చాక కుదుటపడ్డ రైతుల జీవితాల్లో కల్లోల పరిస్థితులను రాజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నుతున్నది. ‘ధరణి’ స్థానంలో ‘భూ మాత’ను తీసుకొచ్చి భస్మాసుర హస్తంతో మళ్లీ పాత రోజులను తెచ్చేందుకు యత్నిస్తున్నది. పట్టాదారు పాసు పుస్తకాల్లో కౌలుదారుల కాలమ్ పెడతామని ‘హస్తం’ పార్టీ చెప్పడంపై జిల్లా రైతాంగం మండిపడుతున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి రైతుల మధ్య చిచ్చుపెట్టే యత్నాలను తిప్పికొడతామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తన సహజమైన రైతు వ్యతిరేకతను, కక్షపూరిత వైఖరిని మరోసారి భయపెడుతున్నది. 3 గంటల కరెంటు చాలు.. రైతు బంధు దండగ.. ధరణిని ఎత్తేస్తాం.. అంటూ ప్రశాంతంగా ఉన్న రైతుల జీవితాల్లో నిప్పులు పోయాలని చూస్తున్నది. భుములపై అసలు హక్కుదారులకు ‘ధరణి’తో సీఎం కేసీఆర్ సర్వ హక్కులను కల్పిస్తే.. దాన్ని కాలరాసేందుకు కొత్త కుయుక్తులకు కాంగ్రెస్ తెరలేపుతున్నది. ‘ధరణి’ స్థానంలో ‘భూ మాత’ పోర్టల్‌ను తీసుకొచ్చి పట్టాదారు పాసుపుస్తకాల్లో అనుభవదారు కాలమ్ పెడతామని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. ధరణితో నిశ్చింతగా ఉన్న రైతాంగం కాంగ్రెస్ మాటలకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కాంగ్రెస్‌కు ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామని రైతులు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాల్లోనే ఉన్న సేద్యం ప్రస్తుతం మూడున్నర లక్షల ఎకరాలకు పెరిగింది. పంటలు పుష్కలంగా పండడం, ఇటు ప్రభుత్వ సాయమూ అందడంతో రైతులు భూమిని తెగనమ్ముకునే దుస్థితి నుంచి భూమిని బంగారంగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది. ‘ధరణి’తో భూభాగం మొత్తాన్ని డిజిటలైజ్ చేయడంతో రికార్డులకు భద్రత ఏర్పడింది. ఒకే ఒక్క బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయ్యేలా సరళీకృత విధానాలను అందుబాటులోకి తెచ్చింది. ధరణి పోర్టల్‌తోపాటు కొత్త పాసుపుస్తకాల్లో కేవలం పట్టాదారు కాలాన్నే ప్రభుత్వం పొందుపర్చింది. ఎలాంటి వివాదాలు లేకుండా రైతులు గుండెమీద చెయ్యివేసుకుని ఎవుసం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న మాటలకు జిల్లా రైతాంగం మండిపడుతున్నది.
ధరణి తీసివేస్తే మళ్లీ దళారుల రాజ్యం రావడం ఖాయం. రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతు బీమా డబ్బులు రావు. బ్యాంకు రుణాలకు మధ్యవర్తుల అవసరం వస్తుంది. డబ్బులు జమ కాక ఎమ్మార్వో అఫీసు చుట్టూ, దళారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
– సైదులు గౌడ్, (ఆమనగల్లు)
ధరణి పోర్టల్‌తో భూ సమస్యలు నిమిషాల్లో పరిష్కారమవుతున్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెలల తరబడి తిరిగినా పని కాకపోయేది. రైతుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ చిల్లర రాజకీయాలను నమ్మం.
– బుట్టి చంటి, ఎలిమినేడు (ఇబ్రహీంపట్నంరూరల్)
కౌలుదారు చట్టం వల్ల దళారీ వ్యవస్థ పెరుగుతుంది. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే. సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి భూ సమస్యలు లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు, కౌలు రైతుల మధ్య పంచాయితీలు మొదలవుతాయి.
– ధనోవా, (శంకర్పల్లి)
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను నమ్మం. కాంగ్రెస్ అధికారంలోకి రైతులకు కష్టాలు తప్పవు. సాఫీగా సాగుతున్న ధరణి పోర్టల్‌ను ఎందుకు తీసేయ్యాలి ?.. మళ్లీ రైతుల పొట్టకొట్టి దళారుల కడుపు నింపాలని కాంగ్రెస్ చూస్తున్నది. ధరణిని కొనసాగిస్తేనే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– బుయ్య సుధాకర్‌గౌడ్, రాయపోల్ (ఇబ్రహీంపట్నంరూరల్)
భూమి లేని కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం సరికాదు. మా భూమిపై కౌలు రైతుకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పడం ఇదెక్కడి న్యాయం. సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అనే విధంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతాం.
– చీపిరి అంజమ్మ, రైతు సోలిపూర్ గ్రామం(షాద్‌నగర్‌టౌన్)
కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోవద్దు. సాధ్యం కాని హామీలిచ్చి కౌలురైతుల పొట్టకొట్టేలా ఉన్నారు. కాంగ్రెసోళ్లకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తరు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. ధరణితో భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. కల్లబొల్లి మాటలు చెప్పె కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదు.
– కరికె కిష్టయ్య, దేవునిఎర్రవల్లి గ్రామం(చేవెళ్ల)
.కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలోని కౌలు చట్టంతో పట్టాదారులకు ఉరే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ అద్భుతంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌలు రైతుల కోసం చట్టం తీసుకొస్తామని చెప్పడం పట్టాదారులకు భయాన్ని కలిగిస్తున్నది. కౌలు రైతుల ఒప్పంద చట్టంతో అనేక భూ సమస్యలు తల్లెత్తడమే కాకుండా కోర్టుల వరకు వెళ్లాల్సి వస్తది. కౌలు చట్టాన్ని పట్టాదారులు ఎవరూ అంగీకరించరు.
– లక్ష్మీనర్సింహారెడ్డి, (కడ్తాల్)
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే పాత రెవెన్యూ పద్ధతిని ప్రవేశపెట్టి, కాస్తు కాలం మళ్లీ తెస్తామనడం చాలా దారుణంగా ఉన్నది. కౌలు ఒప్పందాలు చేసిన తర్వాత భూమిపై హక్కులు కొల్పోతామనే భయం పట్టాదారుల్లో ఉన్నది. భూములు ఇవ్వకపోతే కౌలు రైతుల నోట్టో మట్టి కొట్టినట్లవుతది. దీంతో కౌలు రైతుల జీవితాలు రోడ్డున పడతాయి. కౌలు చట్టంతో పట్టాదారుడి రైతుల భూములకు రక్షణ కరువైతది.
– యారం శేఖర్‌రెడ్డి, సుందరాపురం (కేశంపేట)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి తీసేస్తే అవినీతి పెరుగుతది. అటు ఆఫీసర్లకు, దళారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి సమస్యల సుడిగుండంలో పడిపోతారు. కాంగ్రెస్ ఇస్తున్న హామీలు కౌలు రైతుల పొట్ట కొట్టేలా ఉన్నాయి.
పట్టాదారులు ఇబ్బందులు పడతారు..
బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే ధరణిని రద్దు చేసి పాత రెవెన్యూ రికార్డును మళ్లీ ఏర్పాటు చేస్తే పట్టాదారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.