ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా యూరియా కోసం గత 30 రోజులుగా అన్నదాతలు అరిగోసపడుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఎరువుల కేంద్రాల వద్ద క్యూలో పడిగాపులు పడుతున్నారు. గురువారం భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా యూరియా కోసం తంటాలుపడ్డారు. అయినా కొందరికి మాత్రమే ఎరువుల బస్తాలు దక్కాయి. మిగతావారు నిరాశతో ఇండ్లకు వెనుదిరిగారు. బంట్వారంలో యూరియా లారీ రాగా.. ప్రతి రైతుకూ ఇచ్చాకే వెళ్లాలని అధికారులతో వాగ్వాదానికి దిగి బైఠాయించారు. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య కొంత మాత్రమే పంపిణీ చేయగా.. రైతులు లారీ ఎక్కి బస్తాలను కిందికి దించారు. విధిలేని పరిస్థితిలో మొత్తం యూరియాను అందజేశారు. కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో అన్నదాతలు ధర్నా నిర్వహించి వాహనాలను ఆపివేశారు. నందిగామ మండలం చేగూర్ సొసైటీ ఎదుట యారియా కోసం అవస్థలు పడుతున్న సీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ మండలంలో యూరియా అందజేయాలని వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలానికి చెందిన ఓ రైతు కులకచర్ల ఎస్సై రమేశ్‌కుమార్ కాళ్లపై పడి వేడుకున్నాడు. గత ప్రభుత్వంలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉండేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడంతో రైతులకు యూరియా అందక అవస్థలు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన పాపానికి ఇంతటి కష్టాలు చవిచూస్తున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. అధికారులు, నాయకులు తమను పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. బ్లాక్‌లో యూరియా అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
నందిగామ:ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం తెల్లవారు జామునుంచే బారులు తీరినా ఎరువులు దొరక్క పలుచోట్ల రైతులు నిరసనలకు దిగారు. చేగూర్ సొసైటీ ఎదుట రైతులు సీఎం డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేస్తూ గురువారం ఆందోళన చేపట్టారు. గత కొన్ని రోజులుగా యూరియా కోసం సొసైటీల చుట్టూ తిరుగుతున్నా దొరకడం లేదని, ఎప్పుడో ఒక లారీ వచ్చి కొంత మంది రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నారని, చాలా మంది రైతులకు యూరియా దొరకడం లేదని, పంటలకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో యూరియా పుష్కలంగా అందుబాటులో ఉండేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు యూరియా కష్టాలు వస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ డౌన్..డౌన్ అంటూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు సొసైటీ వద్దకు చేరుకుని రైతులను సముదాయించారు.
పెద్దేముల్ : యూరియా బస్తాలకోసం రైతులు వర్షంలో సైతం బారులు తీరుతూ అవస్థలు పడుతున్నారు. గురువారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్‌లోని ఎఫ్ఎస్సీఎస్ కార్యాలయం ఎదుట రైతులు తెల్లవారు జామునుంచి క్యూలో ఉన్నారు. భారీ వర్షం కురిసినా రైతులు గొడుగులు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. రైతు సహకార సంఘం దగ్గర 245 బస్తాలు మాత్రమే రాగా వందల మంది రైతులు నిలబడ్డారు. దీంతో కొందరికి మాత్రమే యూరియా బస్తాలు అందాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేసిన పాపానికి ఇంతటి కష్టాలు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు పెద్దేముల్లో వర్షంలో యూరియా కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల బాధలను తెలుసుకున్న బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ రైతులకు కావాల్సిన ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రేవంత్‌రెడ్డి ఆరాచకం ప్రజలకు కనిపిస్తున్నదన్నారు. రైతులు రోడ్లపై బారులు తీరితే ప్రభుత్వానికి కనిపించడ్ంతలేదా అని ప్రశ్నించారు. బ్లాక్‌లో యూరియా అమ్ముతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడ్తాల్: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కేంద్రాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాల వద్దకు తిరుగుతూ, గంటల తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గురువారం కడ్తాల్‌లోని ప్రాథమిక సహకార సంఘం కేంద్రం గోదాంకు 440 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు ఉదయం ఆరు గంటలకు గోదాం వద్ద గుమిగూడారు. పోలీసు పహారాలో ఒక్కో రైతుకు టోకెన్లు అందజేసి, రెండు బస్తాల చొప్పున యూరియాను పంపణీ చేశారు. యూరియా అందక చాలా మంది రైతులు వెనుదిరిగారు.
కులకచర్ల: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. తాము వేసిన వరి పంటకు సకాలంలో యూరియా వేయక పోవడం వలన పంట నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కులకచర్ల పెద్ద గేటు చౌరస్తాలో ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు పలువురు మాట్లాడుతూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రెండు రోజులకు ఒక సారి సగం లారీని మాత్రం తమ మండలానికి పంపిస్తే వేల డిమాం డుకు తగ్గ ఎరువులు రాక పోవడంతోనే రైతులం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పరిగి ఎమ్మెల్యె వెంటనే స్పందించి రైతులకు సరిపోను యూరియాను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొందుర్గు : ముట్పూర్ రైతువేదిక వద్ద గురువారం యూరియా పంపిణీ చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 7గంటలకే క్యూలైన్లల్లో నిలబడి యూరియాకోసం ఎదురు చూశారు. ఒక రైతుకు కేవలం రెండు బస్తాల యూరియాను అందజేయడంతో పెద్ద మొత్తంలో సాగు చేసిన రైతులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో యూరియాను అందజేయకపోవడంతో నిరాశలో వెనుదిరిగారు. పోలీసుల పహారా మధ్య యూరియాను పంపిణీ చేశారు.
పూడూరు: గురువారం పూడూరు మండల పరిధిలోని చన్గోముల్, కంకల్ గ్రామాల్లోని రైతు వేదికలో పీఏసీఎస్ ద్వారా పంపిణీ చేయగా, మన్నెగూడ,పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల్లో ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల ద్వారా పంపిణీ చేశారు. నాలుగు సెంటర్లకు గాను 2వేల 200ల బస్తాలు వచ్చినట్లు వ్యవసాయాధికారి తులసి రామ్ తెలిపారు. యూరియా పంపిణీ చేసే కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే అందజేశారు. మధ్యాహ్నం వరకే యూరియా అయిపోవడంతో చాలా మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిగి : ఓవైపు పంటలకు యూరియా వేయాల్సిన అవసరం, మరోవైపు యూరియా లభించక రైతన్న అవస్థల పాలవుతున్నారు. గత రెండుమూడు రోజులుగా పరిగిలో యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఉదయం ఎరువుల దుకాణాలు తెరవక ముందే రైతులు యూరియా కోసం దుకాణాల ముందు పడిగాపులు పడుతున్నారు. గురువారం సైతం పరిగి పట్టణంలోని పలు దుకాణాలలో యూరియా విక్రయించారు. ఈ సందర్భంగా రైతులు క్యూ లైన్లో నిలబడి మరీ యూరియా కొనుగోలు చేశారు. కొందరు రైతులు సాయంత్రం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ఎకరాలున్నా ఒకటిరెండు బస్తాల యూరియా ఇస్తే తమ పంటలకు ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు.
మంచాల: రైతు సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నా లేకున్నా ఒకటే అని రైతులు నిత్యం యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్లో ఉన్నా ఏఒక్కరికీ యూరియా దొరకడం లేదని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొంతం మాధవరెడ్డి అన్నారు. గురువారం మంచాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆద్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూరియా కోసం సహకార సంఘం కార్యాలయాల వద్ద రైతులు నిరీక్షించినప్పడికి యూరియా దొరకక రైతులు నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సకాలంలో పంటల సాగుకోసం యూరియా అందివ్వలేని ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు అలీమొద్దీన్, ఎల్లేష్, నారాయణరెడ్డి, బాలయ్య, అండాలు, అనంతరెడ్డి, మంగమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.