కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. దీంతో అన్నదాతలు పంటలను సాగు చేసుకుని సంతోషంగా జీవించారు. పరిశ్రమలు పవర్ హాలిడేలు లేకుండా కొనసాగాయి. కానీ.. ఏడాది కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మళ్లీ కరెంట్ కోతలు షురూ అయ్యాయి. ఎండాకాలం ప్రారంభం కావడం.. భూగర్భ జలాలు అడుగంటడంతో అనధికార కోతలతో పంటలు ఎండుతున్నాయని.. అదేవిధంగా గృహాలతోపాటు వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం పెరిగి ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడి లోవోల్టేజీ సమస్యతో తరచూ మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేయించే లోపే పంట పొలాలు ఎండిపోతున్నాయని.. అందువల్ల విద్యుత్తు సరఫరాలో కోతల్లేకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా వికారాబాద్ జిల్లాలో వ్యవసాయం, గృహ వినియోగం, పరిశ్రమలకు రోజుకు ప్రస్తుతం 7.2 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా, జిల్లాలో 75,193 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి.
రంగారెడ్డి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): కరెంట్ కోతలు మళ్లీ షురూ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే విద్యుత్తు కష్టాలు మళ్లీ మొదటికొస్తాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగానే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పవర్ కష్టాలు మొదలయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో అనధికారిక కోతలు కొనసాగుతున్నాయి. గృహాలతోపాటు వ్యవసాయ రంగానికి వినియోగం పెరగడంతో ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడి లోవోల్టేజీ సమస్య ఏర్పడుతున్నది. దాంతో తరచూ మోటర్లు కాలిపోవటంతోపాటు మీటర్లు, స్టార్టర్లల్లోనూ సాంకేతిక సమస్య తలెత్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, కొం దుర్గు, చౌదరిగూడ, తదితర మండలాల్లో లోవోల్టేజీ సమస్య తీవ్రంగా ఉండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతులు చేయించేలోపే పంటపొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో.. పదేండ్లపాటు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా అయితే.. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం అధికారికంగా నాలుగున్నర గంటలపాటు త్రీఫేస్ సరఫరాలో కోతలు విధిస్తుండగా.. అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు నిలిపివేస్తున్నా రు. ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటుతున్న భూగర్భజలాలకు తోడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వరి తదితర పంటలకు ఉన్న నీటిని కూడా అందించలేకపోతున్నారు. కరెంట్ కోతలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను జిల్లా రైతాంగం గుర్తు చేసుకుంటున్నది.
నాడు అర్ధరాత్రి 2-3 గంటల సమయంలో పంటలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఎంతో మం ది విద్యుదాఘాలతో మృత్యువాత పడడంతోపాటు చాలామంది రైతులు పంట పొలాలకు నీరు పెట్టేందు కు మోటర్లు ఆన్ చేయబోయి మృతిచెందారు. కరెంట్ ఎప్పుడొస్తదా..? అని రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ హయాంలో నిరంతర విద్యుత్తు సరఫరాతో పరిశ్రమలను నెలకొల్పేందుకు పలువురు క్యూ కడితే…ప్రస్తుతం విద్యుత్తు కోతలతో పరిశ్రమలు పవర్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు కనిపిస్తున్నా యి. ప్రస్తుతం పరిశ్రమలు, గృహ వినియోగానికి సం బంధించి కూడా విద్యుత్తు కోతలు పెరిగాయి. గృహ వినియోగానికి సంబంధించి పట్టణాలు, గ్రామాల్లో రోజుకు 10-15 సార్లు అనధికార కోతలు విధిస్తున్నారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో వ్యవసాయంతోపాటు గృహ వినియోగం, పరిశ్రమలకు రోజుకు ప్రస్తుతం 7.2 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతుండగా.. జిల్లాలో 75,193 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో సుమారు 50,000 పైగా ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. వాటిలో వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, రైస్‌మిల్లులు, కట్టెమిషన్లు, అపార్ట్మెంట్లు తదితర వాటికి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి. ఎండలు పెరుగుతుండడంతో విద్యుత్తు వినియోగం కూడా పెరిగి ట్రాన్స్ఫార్మర్లపై అదనపు భారం పడి సరఫరా చేయలేక అవి కాలిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. పదేండ్లపాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగానికి నిరంతర విద్యుత్తును సరఫరా చేసింది. నాడు కరెంట్ వస్తే వార్త.. నేడు కరెంట్ పోతే వార్త అనే విధంగా కనీవినీ ఎరుగని మార్పును తీసుకొచ్చింది.
పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నాం
బోరు బావుల్లో నీళ్లు తగ్గడంతో వరి పంట ను కాపాడుకునేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు. చెరువులు, దూ ర ప్రాంతాల నుంచి నీటిని ట్యాంకర్లు తదితర వాటి ద్వారా తీసుకొచ్చి పంటకు అందిస్తున్నాం.
-మడిగే శ్రీనివాస్ రైతు కుదురుమళ్ళ దుద్యాల
సరఫరాలో కోతల్లేకుండా చూడాలి
యాసంగిలో సాగు చేసిన వరి పంట చివరి దశలో ఉన్నందున ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేకుండా చూడాలి. భూగర్భ జలాలు తగ్గడంతో బోరు బావుల్లోనూ నీరు తగ్గిపోయింది. ఉన్న నీటితో పంటను కాపాడుకునేం దుకు బోరుమోటర్లను నిరంతరాయంగా నడిపించాల్సి ఉంటుంది. అందువల్ల విద్యుత్తు సరఫరాలో కోతలుండొద్దు.
-మల్లేశ్‌గౌడ్ రైతు తుంకిమెట్ల, బొంరాస్‌పేట
ఉదయం, సాయంత్రం కరెంటు పోతున్నది
ఉదయం, సాయంత్రం సమయాల్లో గంట సేపు చొప్పున ప్రతిరోజూ కరెంట్ సరఫరాను నిలిపేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బందిపడుతున్నాం. కరెంటు కోతలుండవని ఓ వైపు ప్ర భుత్వం, అధికారులు చెబుతున్నా కోతలు మాత్రం తప్పడం లేదు. ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు స్పందించి అనధికార కోతలు విధించొద్దు
-రామాచారి, రంగారెడ్డి