ఆదిబట్ల, మే 7: ముందు సమాచారం లేకుండా గ్రామసభను ఎలా నిర్వహిస్తారని, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుతో మాలాంటి పేద రైతులకు ఏం లాభం అని గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు అధికారులను నిలదీశారు. బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని రావిర్యాల గ్రామంలో కొంగరఖుర్ధు రెవెన్యూలో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారి రాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు ఎంతో ఆవేదనతో అధికారులను నిలదీశారు.
రాత్రి అందరూ పడుకున్న తరువాత టాం టాం వేయించి తెల్లవారే సరికి ఎవరికి సమాచారం లేకుండానే గ్రామసభలు నిర్వహించడం ఏంటని భూసేకరణ అధికారిని రైతులు నిలదీశారు. ఒకే సర్వే నంబర్లో రెండుసార్లు ప్రభుత్వం భూమిని సేకరించడం ఏంటన్నారు. దీంతో కాసేపు రైతులకు సమాధానం చెప్పలేక భూసేకరణ అధికారి రాజు కాసేపు అయోమయానికి గురయ్యాడు. దీంతో దాదాపు 30 మంది రైతులు గ్రామసభను బహిష్కరిస్తూ తీర్మానం చేసిన కాపీని భూసేకరణ అధికారికి అందజేసి రైతులు గ్రామసభ నుంచి వెళ్లి పోయారు. దీంతో అక్కడ ఉన్న కొంత మందితో గ్రామ సభను నిర్వహించారు.
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటులో భూము లు కోల్పోతున్న భూముల్లో ఉన్న రైతులకు టైటిల్ డీడ్ తప్పనిసరి. కేవలం కబ్జాలో ఉంటే వారికి నష్టపరిహారం ఇవ్వడం జరగదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. గ్రామ సభకు విచ్చేసి మాట్లాడారు. రోడ్డు ఏర్పాటులో 100 శాతం భూములు కోల్పోతూ పూర్తిగా ఆ భూమిపై ఆధారపడి జీవిస్తున్న రైతుల కుటుంబాలకు ఆ కుటుంబంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.5లక్షల 50 వేలను ప్రభుత్వం ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
త్వరలోరనే రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న భూములకు ఎంత ధర చెల్లించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఇప్పటికి రోడ్డు ఏర్పాటులో 42 మంది రైతులకు చెందిన 54 ఎకరాల 33 గుంటల భూమి సేకరించడం జరిగిందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ బాధితులతో రావిర్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రైతుల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. గ్రామసభలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, ఆదిబట్ల సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్, కె.రాజు పెద్దఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్పటికే గ్రామసభ నిర్వహించే ప్రాంతం చుట్టు పోలీసులను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం మా భూములను రోడ్డు కోసం గుంజుకొని మా భూముల్లోకి రాకుండా పోలీసులతో వచ్చి సర్వే చేశారు. మా భూముల్లోకి పోతే మీ మెడలు పట్టి నెట్టివేశారు. నాకు ఉన్న సర్వే నంబర్ 13లో ఎకరం భూమి పూర్తిగా పోతున్నది. కనీసం ఎంత రేటు ఇస్తున్నరో అడుగుదామని అనుకున్నా పోలీసులు అడ్డుపడుతున్నారు. మా సమస్యలు వినకుండా మేము ఎందుకు గ్రామ సభలో ఉండాలి? అందుకే మేము గ్రామసభను బహిష్కరిస్తున్నాము. కలెక్టర్ వచ్చి గ్రామసభలో మాకు సమాధానం చెప్పాలి.
– కాసుల సుధాకర్, భూ బాధితుడు, రావిర్యాల గ్రామం
సారూ నాకు మా అమ్మగారు కట్నం కింద సర్వే నంబర్-13లో 20 గుంటల భూమి ఇచ్చిండ్రు. మా బతుకు మొత్తం ఆ భూమి పైనే ఆధారపడి జీవిస్తున్నాం. నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు అక్కడ అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయన్నారు. ఇప్పుడు ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు ఏర్పాటతో నా భూమి అందులో పోతుంది. ఇప్పుడు ప్రభుత్వం కేవలం తక్కు వ ధరను ఇస్తుందని అంటున్నారు. ఇప్పటికి ఎంత ధర ఇస్తారో కూడా చెప్పడం లేదు.
– రమాదేవి, భూ బాధితురాలు, రావిర్యాల గ్రామం
నాకు సర్వే నంబర్ 13లో 3 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. మా కుటుంబం దానిని వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడిపేవాళ్లం. ఇప్పుడు ఆ ఉన్న భూమి కూడా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డులో పోతున్నది. మా దగ్గర నుంచి బలవంతంగా గుంజుకున్నా మాకు ఎక్కువ రేటు ఇవ్వాలి. కనీసం నేడు ఆ ప్రాంతంలో పోతున్న రేటు ప్రకారం చెల్లించాలి. లేకుంటే మా బతుకులు రోడ్డు మీదకు వస్తాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.
– గున్నాల నర్సింహ, భూ బాధితుడు, రావిర్యాల గ్రామం