దోమ, మే 28 : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రాగా.. కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కిన ఘటన బుధవారం దోమ మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో నెలకొన్నది. అయినాపూర్ గ్రామ పెద్ద చెరువు ఆయకట్టు కింద రైతులు పెద్దఎత్తున వరి పంటను సాగు చేసి మంచి దిగుబడులను సాధించారు. పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకుందామని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా.. అధికారులు మాత్రం రెండు రోజులకు ఒక లారీని పంపడంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి.
దానికి తోడు వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి మొలకలు వచ్చినా సంబంధిత అధికారులు స్పందించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకనే రైతులకు ఇలాంటి పరిస్థితి దాపురించిందని అన్నదాతలంటున్నారు. తడిసిన వడ్లను సైతం కొంటామని ప్రగల్బాలు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ దుస్థితి కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి వరి ధాన్యం అయిపోయే వరకు రోజుకో లారీని పంపించి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కులకచర్ల : ధాన్యం కొనుగోలు చేయడంలో సెంటర్ల నిర్వాహకుల నిర్లక్ష్యం వహించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చౌడాపూర్ మండలం అడవివెంకటాపూర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవడం వలన వర్షాలకు తడిసి మొలకలొస్తున్నాయి. గత ప్రభుత్వంలో ముందుగానే ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని తీసుకునేవారని, నేడు సరైన సమయానికి తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. పీఏసీఎస్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కూడా దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సెంటర్ల దగ్గరే నిలువ ఉన్న ధాన్యం కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని రైతులు నిల్వ ఉంచారు. ధాన్యాన్ని సెంటర్ల నిర్వాహకులు సేకరించకపోవడంతో రైతులు కేంద్రాల వద్దే తమ ట్రాక్టర్లకు తాడ్పత్రీలను కట్టి ధాన్యాన్ని తడువకుండా ఉండేందుకు చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సెంటర్లకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం నిర్వాహకులు వివిధ ఆంక్షలు పెడుతున్నారని తెలియజేస్తున్నారు. ఒక్కొక్క కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సుమారు 15 రోజుల నుంచి నిరీక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వాహకులు తీసుకోవాల్సి ఉండగా గన్నీ బ్యాగులు లేవని, లారీలు రావడం లేదని చెపుతున్నారు. దీంతో కేంద్రాల్లో వర్షానికి ధాన్యం తడుస్తున్నది.
కులకచర్ల, చౌడాపూర్ మండలాల పరిధిలోని వివిద ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వ ఉండటం వలన ధాన్యం వర్షానికి తడువడంతో ధాన్యం మొలకెత్తుతున్నది. రైస్ మిల్లర్లు పెట్టే షరతులకు కూడా ఇబ్బందులకు గురవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
అడవివెంకటాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో 15 రోజులకు ముందుగా ధాన్యాన్ని వేశాం. ధాన్యాన్ని రైస్ మిలేకలకు కూడా పంపించారు. కాని మాకు డబ్బులు ఇప్పటివరకు రావడంలేదు. ఇదేమని అడిగితే అక్కడే సమస్య ఉందని సెంటర్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. ధాన్యం అమ్మి 15 రోజులు అవుతున్నా డబ్బులు రాలేదు. దీనిపై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. గతంలో వారంలోనే డబ్బులు వచ్చేవి. కాని నేడు మా పరిస్థితి అధ్వానంగా తయారైంది.
– రవినాయక్, మాజీ సర్పంచ్, గోగ్యానాయక్తండా
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తీసుకోకపోవడంతో కేంద్రాల దగ్గరే ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించి డబ్బులు వచ్చేలా చూడాలి.
– జుబేర్, మాజీ కోఆప్షన్ సభ్యుడు
వరి ధాన్యం కొనుగోళ్లలో భాగమైన ట్రాన్స్పోర్ట్ అధికారులు నిద్ర మత్తులో ఉండి రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించడంలో ఆలస్యం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ రైతులను అవస్థలకు గురిచేస్తూ అన్యాయం చేయడం బాధాకరంగా ఉన్నది. ఇప్పటికైనా అధికారుల్లో మార్పు రావాలి.. రైతులకు మేలు జరగాలి.
– మేకల శ్రీనివాస్, రైతు అయినాపూర్
పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి కుప్పలు పోసి ఉంచడం వల్ల నష్టపోవడం ఒక ఎత్తయితే.. దానికి వర్షం తోడై ధాన్యం తడిసి మొలకలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సర్కారు గుర్తించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం మాటలు చెప్పడంకాదు.. తడిసిన ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలి.
– పొట్ట రాములు, రైతు, అయినాపూర్