యాసంగి సీజన్ పూర్తి కావొస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి జిల్లాలోని రైతులకు రావాల్సిన రూ. 500 బోనస్ మాత్రం అందడం లేదు. ప్రభుత్వం గత వానకాలంలో జిల్లా లో 38 కొనుగోలు కేంద్రాల ద్వారా పదివేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. అందులో సుమారు ఆరు వేల మెట్రిక్ టన్నుల సన్న వరి ధాన్యం ఉన్నది. ఇందుకుగాను బోనస్ డబ్బులు రూ.2.88 కోట్లు రైతులకు అందాల్సి ఉండగా.. కేవ లం రూ. 1.33 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.1.50 కోట్ల కోసం అన్నదాతలు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అదును దాటిపోతున్నా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
-రంగారెడ్డి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ)
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధరతోపాటు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ఇస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. దీంతో జిల్లాలోని 1,971 మంది అన్నదాతలు 38 కేంద్రాల్లో సుమారు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. అందులో సుమారు 6,000 మె ట్రిక్ టన్నుల వరకు సన్న వడ్లు ఉన్నాయి. వాటికి బోనస్‌గా రూ.2.88 కోట్లు రైతులకు రావాల్సి ఉన్నది. అయితే ప్రభుత్వం కేవలం రూ. 1.33 కోట్లు మాత్రమే చెల్లించింది. మిగిలిన రూ.1.50 కోట్ల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ఆ డబ్బులు వస్తే యా సంగి పెట్టు బడికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
రైతును రాజుగా మార్చాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున ఠంచన్‌గా పెట్టుబడి సాయం అందేది. దీంతో అన్న దాతలు సకాలంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలను సాగు చేసేవారు. అయితే రేవంత్ సర్కార్ రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చి.. ఏటా ఎకరాకు రూ. 12 వేల చొప్పున పంపిణీ చేస్తామని ప్రకటించింది. గత వానకాలంలో అన్నదాతలకు రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. వ్యవసాయ యోగ్యం కావనే సాకుతో జిల్లాలో సుమారు 50,200 ఎకరాలకు పైగా రైతుభరోసాను నిలిపేయడంతో దా దాపుగా 30,000 మంది అన్నదాతలు ఇబ్బందిపడుతున్నారు. అర్హులందరికీ రైతు భరోసా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లాలో సన్న వడ్లు విక్రయించిన సుమారు 5,000 మంది వరకు రైతులకు ప్రభుత్వం బోనస్ కింద రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. గత నాలుగైదు నెలలుగా బోనస్ డబ్బుల కోసం వారు నిరీక్షిస్తున్నారు. ఆ డబ్బులొస్తే యాసంగి సాగుకు వినియోగించుకోవచ్చునని ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తానన్న బోనస్ డబ్బు లు ఇంకా రాలేదు. నేను 140 క్వింటాళ్ల సన్న వడ్లను కడ్తాల్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించా. 90 రోజులు దాటినా బోనస్‌కు సంబంధించిన రూ.70 వేలు నా బ్యాంకు ఖాతాలో ఇంకా జమ కాలేదు. రైతుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిసారీ మాట తప్పి మోసం చేస్తున్నది.
-గోరేటీ వెంకటేశ్‌యాదవ్, రైతు, కడ్తాల్
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు రైతులకు బోనస్ కింద వెంటనే రూ.500 చెల్లించాలి. ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇచ్చి ..పవర్లోకి రాగానే వాటిని కాంగ్రెస్ నాయకులు పట్టించుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నదాతలకు ధోకా చేస్తున్నా రు. ఇచ్చిన హామీలనింటినీ నెరవేర్చాలి.
-మొగిలి వెంకటేశ్
సన్న వడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన 48 గంటల్లోనే రైతన్నల బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పటివరకు డబ్బులను జమ చేయలేదు. బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది.
-రమేశ్‌నాయక్, యువ రైతు, ఆమనగల్లు