Farmers | యాచారం, జూన్ 4 : గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు. గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తమ సమస్యలు పరిష్కరించాలని అధికారులపై తిరగబడ్డారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు.
అనంతరం గ్రామంలో కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్ఐ రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చందు నాయక్, తావు నాయక్ మాట్లాడుతూ… గ్రామంలో 50, 60 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా రైతులకు పట్టాలు లేవని వెంటనే అర్హులైన వారందరికీ ఆన్లైన్లో నమోదు చేసి, పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని వారు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ సదస్సులను తూతూ మంత్రంగా కాకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు న్యాయం చేసేలా కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామ కంఠం భూములను కొంతమంది తమ వ్యవసాయ పొలాల్లో కలుపుకొని సాగు చేసుకుంటున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. గ్రామ కంఠం భూములను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేద ప్రజలకు గ్రామకంఠం భూమిని పంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో నెలకొన్న భూముల సమస్యలను వెంటనే పరిష్కారానికి నోచుకోకపోతే రానున్న రోజుల్లో తాహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, రైతులు ఉన్నారు.