చేవెళ్ల మండలం చనువెల్లి గ్రామానికి చెందిన ఓ రైతుకు ఒక్క రూపాయి మాఫీ అయినట్లు లక్షన్నర రుణమాఫీ జాబితాలో వచ్చింది. తనకు మొదటి విడుతలోనే రూ.లక్ష రుణం మాఫీ కాగా… రెండో విడుతలో ఒక్క రూపాయి మాఫీ అయినట్లు రావడంతో వాపోవడం రైతు వంతైంది.
చేవెళ్ల మండలం ఊరెల్ల గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.5 మాఫీ అయినట్లు లక్షన్నర రుణమాఫీ జాబితాలో పేరు వచ్చింది. రెండేండ్ల క్రితం తీసుకున్న రుణాన్ని మొత్తం తీర్చడంతో బ్యాంకులో అప్పే లేదని.. ఈ 5 రూపాయల మాఫీ విషయం తమకు తెలియదని సదరు రైతు కుటుంబం చెబుతున్నది.
రంగారెడ్డి, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ) : ఇలా చెప్పుకొంటూ పోతే రంగారెడ్డి జిల్లా రుణమాఫీ జాబితాలో చిత్రవిచిత్రాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. కొంతమంది రైతులకు పది రూపాయిలు మాఫీ అయితే.. మరికొందరికి రూ.వందల్లో మాఫీ అయింది. దీంతో రుణమాఫీ ప్రక్రియ ప్రహసనంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్తవ్యస్థ జాబితాపై అటు బ్యాంకర్లు, ఇటు వ్యవసాయ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. మొదటి విడుతలో జిల్లాలో 49,700 మందికి రూ.258.18కోట్లు, రెండో విడుతలో 22,915 మంది రైతులకు రూ.218.12 కోట్లు మాఫీ చేసినట్లు ప్రభత్వం చెబుతున్నది.
ప్రభుత్వం విధించిన ఆంక్షల నేపథ్యంలో అర్హులైన రైతులెందరో మాఫీకి దూరం కాగా.. జాబితాలో పేరు ఉన్నా కొంతమంది రైతుల ఖాతాల్లోనూ మాఫీ డబ్బులు జమ కాలేదు. దీనికితోడు జాబితాలో ఐదు రూపాయలు, పది రూపాయలు సైతం మాఫీ అయినట్లు ఉండడంతో ఇదేమి రుణమాఫీ.. అంటూ రైతులు పెదవి విరుస్తున్నారు. ఎక్కువ మందికి రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకోవడానికేనా! అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంకెల గారడిని చూసి అసలు ఏ ప్రాతిపదికన జాబితాను రూపొందించారన్న సందేహాలను రైతాంగం వ్యక్తం చేస్తున్నది.
రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34వేల మంది వరకు ఉన్నారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో కేవలం 11,700 మంది రైతుల పేర్లు మాత్రమే వచ్చాయి. రెండో విడుతలో లక్షన్నర రుణమాఫీ కేవలం 5,380 మందికి మాత్రమే అయింది. కానీ.. మాఫీకి అర్హత ఉన్నవారు ఇంతకంటే ఎక్కువే ఉన్నట్లు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లాలోని చాలావరకు సొసైటీల్లో మొదటి, రెండో విడుతల్లో వేల సంఖ్యలో రైతులు రుణమాఫీకి దూరమయ్యారు.
షాద్‌నగర్ నియోజకవర్గంలోని మేకగూడ పీఏసీఎస్‌లో రూ.లక్షలోపు రుణమాఫీ 306 మందికిగాను 181 మందికే అయింది. లక్షన్నర రుణమాఫీకి 45 మంది అర్హత కలిగి ఉండగా.. 21 మందికే మాఫీ అయింది. చేగూరు పీఏసీఎస్‌లో రూ.లక్షలోపు రుణమాఫీకి 264 మంది అర్హులుకాగా.. 156 మందికే మాఫీ అయింది. రెండో విడుతలో 55 మంది రైతులకుగాను 30 మంది రైతులే రుణవిముక్తులయ్యారు.
నందిగామ పీఏసీఎస్‌లో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్నవారు 34 మంది ఉండగా.. కేవలం 12 మందికే రుణమాఫీ జరిగింది. లక్షన్నర రుణమాఫీలో ఏడుగురు రైతులకుగాను ఒక్కరికే మాఫీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. అధికారంలోకి రాగానే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. 8 నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో మాఫీ చేపట్టడం లేదు. కొద్దిమంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నది. నాకు రూ.40,000 లోపే క్రాప్ లోన్ ఉన్నది. అయినా మాఫీ కాలేదు. అధికారులను అడిగినా సరైన సమాధానం ఇవ్వడంలేదు.
-మెకం రాజు, రైతు, మేకగూడ
నా పేరు మీద రెండు ఎకరాల 15 గుంటల భూమి ఉండగా.. చేవెళ్లలోని కో-ఆపరేటివ్ బ్యాంకులో రూ.9,6770 క్రాప్ లోను తీసుకున్నా. మొదటి విడుతలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన లక్షలోపు రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. రెండో విడుతలో మాఫీ అవుతదనుకుంటే చివరకు నిరాశే మిగిలింది. ఇప్పడు కూడా రుణమాఫీ కాకపోవడంతో అధికారులను అడిగితే నీకు రేషన్ కార్డు లేదు.. అందుకే కాలేదేమో అని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు అర్హులందరికీ అందాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని సాకులు చూపుతూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది.
-పెంజర్ల అనంతరెడ్డి , చేవెళ్ల గ్రామం, రంగారెడ్డి జిల్లా
యాచారంలోని పీఏసీఎస్ లో రూ.61000 పంట రుణం తీసుకున్నా. అయినా ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ జాబితాలో నా పేరు రాలేదు. నాలాంటి అర్హత కలిగిన ఎంతో మంది రైతులు రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ తిరుగుతున్నారు. మొదటి, రెండో విడుతల్లో రుణమాఫీ కానీ రైతులు మూడో విడుత కోసం ఎదురుచూస్తున్నారు. మూడో విడుతలోనైనా ఇప్పటివరకు రుణమాఫీ కానీ రైతులందరికీ రుణమాఫీ చేసి న్యాయం చేయాలి. లేదంటే రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రానున్న రోజుల్లో రైతులు తిరగబడటం ఖాయం.
– కోలన్ కల్పన, మల్కిజ్ గూడ, యాచారం మండలం