వికారాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీతో జిల్లా రైతాంగానికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఓ వైపు ప్రభుత్వం విధించిన నిబంధనలతో సుమారు లక్ష మంది రైతులు నష్టపోగా, మరోవైపు బ్యాంకర్లు పెట్టే కొర్రీలతో అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. డిసెంబర్ 9, 2023 లోపు ఉన్న పంట రుణాలకు సంబంధించి అస లుతోపాటు మిత్తిని మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
అయితే వాస్తవానికి మాత్రం మిత్తి చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని బ్యాంకర్లు రైతుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. రుణమాఫీ పూర్తయ్యిందని సంబురపడి బ్యాంకులకు వెళ్తున్న రైతులకు మిత్తి చెల్లిస్తేనే రుణమాఫీ పూర్తవుతుందని బ్యాంకర్లు చెబుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు కటాఫ్ తేదీ అనంతరం ఇప్పటివరకు అయిన వడ్డీని వసూలు చేస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు కేవలం అసలు రుణాలకు సంబంధించిన జాబితానే ప్రభుత్వం పంపించిందని, మిత్తి డబ్బులు చెల్లిస్తేనే రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని ఒత్తిడి తెస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఏటా రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసూ వాటి రసీదులు పొందినప్పటికీ పంట రుణాలను రెన్యువల్ చేసుకోలేదంటూ రుణమాఫీ జాబితా నుంచి పేర్లను తొలగించినట్లు పలువురు వాపోతున్నారు. అయితే ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలను తీసుకురాకపోవడంతోపాటు బ్యాంకర్లు చేసిన తప్పిదాలతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షలలోపు పంట రుణాలకు సంబంధించి అసలుతోపాటు వడ్డీని కూడా మాఫీ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. జిల్లాలోని పలు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల్లో కేవలం అసలు మాత్రమే మాఫీ అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇదీగాక జిల్లాలోని కెనరా బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకర్లు చేసిన తప్పిదం అన్నదాతల పాలిట శాపంగా మారింది. సదరు బ్యాంకర్లు రుణ జాబితాను వడ్డీతోకలిపి కాకుండా అసలు మాత్రమే ప్రభుత్వానికి పంపడంతో.. ప్రస్తుతం రైతులు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతేకాకుండా వడ్డీ డబ్బులు చెల్లిస్తేనే రుణమాఫీ అవుతుందని ఆ బ్యాంకర్లు తెగేసి చెబుతుండడంతో తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసి వడ్డీ చెల్లిస్తున్నారు. ఓ వైపు రేషన్‌కార్డును ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేపట్టడంతో అర్హులైన సుమారు లక్ష మంది రైతులు నష్టపోగా, మరోవైపు రుణమాఫీ అయిన రైతులను వడ్డీ డబ్బులు చెల్లించాలని స్పష్టం చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిసెంబర్ 9, 2023 లోపు ఉన్న పంట రుణాలకు సంబంధించి అసలుతోపాటు మిత్తిని మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ కటాఫ్ తేదీ అనంతరం అయిన వడ్డీ డబ్బులు చెల్లించాలని రైతులపై బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. కటాఫ్ తేదీ అనంతరం ఈ ఏడు నెలలకు సంబంధించి వడ్డీ డబ్బులను చెల్లిస్తేనే రుణమాఫీ పూర్తి చేయడంతోపాటు రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పటికే పంట పెట్టుబడికి అప్పులు చేసిన రైతులు, ఇప్పుడు వడ్డీ డబ్బులు చెల్లించేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. రైతు భరోసా ఇవ్వకుండా, అసలుతో కలిపి మిత్తిని మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల పాలు చేస్తున్నదని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అసలు, మిత్తిని మాఫీ చేయడంతోపాటు కటాఫ్ తేదీ అనంతరం కాలానికి వడ్డీని వసూలు చేయకుండా బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని కోరుతున్నది. మరోవైపు రూ.2 లక్షలపైన ఉన్న రుణాలను ఆగస్టు 15లోపు చెల్లించాలని రైతులకు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా రూ.2 లక్షలకు పైన ఉన్న రుణాలను చెల్లించకపోతే రుణమాఫీ వర్తించదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేస్తామని హామీనిచ్చి, ఇప్పుడు రుణమాఫీకి మెలికలు పెట్టడంపై జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం పట్టా పాస్ బుక్‌లు తనఖా పెట్టి బ్యాంకులో లక్ష రూపాయల రుణం తీసుకున్నాను. ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో పాస్ పుస్తకాన్ని తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లగా.. బ్యాంకు అధికారులు వడ్డీ చెల్లించాలని చెబుతున్నారు. ప్రతి రైతు వద్ద రూ.20వేల నుంచి 40 వేల వరకు వడ్డీని వసూలు చేస్తున్నారు.
-మహితాబ్ అలీ, మద్గుల్ చిట్టంపల్లి, వికారాబాద్