ఇబ్రహీంపట్నం రూరల్, మే 22 : ఎండాకాలం పొలం దున్నడం పనులు ప్రారంభమయ్యాయి. వేసవిలో పొలాలను దున్నుకోవడం ద్వారా కలుపు, చీడ పురుగులు నశిస్తాయని, పొలం కూడా మెత్తబడి అధిక దిగుబడిని సాధించొచ్చని వ్యవసాయాధికారుల సూచనలతో రంగారెడ్డి జిల్లాలోని అన్నదాతలు దుక్కులను లోతుగా దున్నిస్తూ పొలాలను వానకాలం సాగుకు సిద్ధం చేస్తున్నారు. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే వరి పంటలను కోసి పొలాలను శుద్ధి చేస్తున్నారు.
దుక్కులను లోతుగా దున్నుకోవాలి..
దుక్కులను లోతుగా దున్నడం వల్ల నేల వదులై మెత్తగా మారుతుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే నీరు పల్లం వైపు వెళ్లకుండా ఎక్కడికక్కడే పొలాల్లోనే ఇంకిపోతుంది. దాని ద్వారా భూమికి ఎక్కువ రోజులపాటు తేమను నిల్వ చేసుకునే సామ ర్థ్యం పెరుగుతుంది. పంట వేసిన తర్వాత వర్షాలు పడటం కొద్దిగా ఆలస్యమైనా పంటకు నష్టం జరుగదు. పంటల కోతల తర్వాత నేలపై మిగిలే పంట మొదళ్లు, పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకుల వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతుగా పొలాలను దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోయి ఎరువుగా మారుతాయి. దీంతో నేలలో సేంద్రియ పదార్థాలు, పోషక విలువ లు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. లోతుగా దుక్కులను దున్ని సిద్ధం చేసుకుంటే వానకాలానికి ఎంతో అనుకూలంగా ఉం టుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వేసవిలో పొలాల్లో ఎ లాంటి పంటలు ఉండ వు. కావున రైతులు తమ పొలాల్లో పశువులు, గొర్రెల మందలు పెట్టుకుంటే మం చిది. పశువులు, గొర్రెలు, మేకలు విసర్జించే మలమూత్రాలు చేనుకు ఎరువుగా మారుతుంది.
వేర్లు విస్తరించే అవకాశం..
వేసవిలో లోతుగా దుక్కులు దున్ని పొలాలను సిద్ధంగా ఉంచుకుంటే తొలకరి వానలు కురిసిన తర్వాత గొర్రుతిప్పి సేద్యం చేస్తే వేర్లు బాగా భూమిలోకి విస్తరించేందుకు అనుకూలంగా ఉంటుంది. గొర్రు, గుంటక, దంతెల వంటి పరికరా లు నేల లోపలికి మూడు నుంచి ఆరు అం గుళాల వరకు చొచ్చుకెళ్తాయి. ఈ పరికరాలను తరచూ వినియోగించడం ద్వారా భూమి లోపల మూడు నుంచి ఐదు అం గుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. దాని ద్వారా నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున వేసవి దు క్కుల సమయంలో నేలను లోతుగా దున్నితే ఈ గట్టిపొర పోయి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది. అంతేకాకుండా కలుపు మొక్క లు, కాయలు, వేర్లు, దుంప లు పెకిలించబడి వేసవిలో ఉం డే ఉష్ణోగ్రతకు అవి నశించేందుకు ఆస్కా రం ఉంటుంది. దుక్కి దున్నిన తర్వాత నేలపై తేలిన కాయలు, దుంపలను తొలగిస్తే పొలం శుభ్రంగా మారుతుంది.
పంటల దిగుబడి పెరుగుతుంది
వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకోవాలి. తద్వారా తొలకరిలో కురిసే వర్షాలకు నీరు భూమిలోకి ఇంకిపోయి పొలం తడిగా మారేందుకు అవకాశం ఉంటుంది. దానిద్వారా పంటల దిగుబడి కూడా పెరుగుతుం ది. రైతులు పంటలు పూర్తి కాగానే వానకాలానికి సిద్ధంగా ఉంచుకునేందుకు పొలాలను లోతుగా దున్నుకోవాలి.
-సత్యనారాయణ, ఏడీఏ వ్యవసాయశాఖ ఇబ్రహీంపట్నం
అధిక ఉష్ణోగ్రతకు కలుపు మొక్కలు నశిస్తాయి
పంటలు పూర్తి కాగానే పొలాలను దున్నితే భూమికి బలం చేకూరుతుంది. రాలిన ఆకులతో భూమికి మల్చింగ్ చేసినట్లు అవుతుంది. పొలాల్లో పైకి తెలిన కలుపు మొక్కలు, కాయలు, వేర్లు ఎండాకాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతకు అవి నశించేందుకు ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా పంటల్లో అధిక దిగుబడి వస్తుంది.
-వంగేటి లక్ష్మారెడ్డి, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు