రంగారెడ్డి, జనవవరి 4 (నమస్తేతెలంగాణ) : యాచారం మండలంలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల తొలగింపుపై ఇంకా స్పష్టత రాలేదు. మండల పరిధిలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు ఫార్మా పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రభుత్వ అసైన్డ్ భూములను గతంలోనే ఫార్మాసిటీ కోసం స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టా భూములు ఇవ్వడానికి అప్పట్లో రైతులు నిరాకరించారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల మధ్యలో పట్టా భూములుండడం వల్ల ఆ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. పట్టా భూములను ఫార్మాకు ఇవ్వడానికి రైతులు నిరాకరించడంతో ప్రభుత్వం ఫార్మా అథారిటీ కింద వారి భూములకు పరిహారాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు.
కాని, రైతులు పరిహారం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో తమ భూములు తమకివ్వాలంటూ ఎన్నో ఏండ్లుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిషేధిత జాబితా నుంచి తొలగించి వారికే పట్టాలిప్పిస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. మార్కెట్లో ఎకరా ధర రూ.కోటి ఉన్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం రూ.25లక్షలు ఇస్తామని ప్రకటించడంతో రైతులు ముందుకు రావడంలేదు. చాలీచాలని పరిహారం వద్దంటూ వారి భూములను వారే సాగు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిలో పిల్లల పెండ్లిళ్లు, ఇతరత్రా ఖర్చులకు భూములు అమ్ముదామనుకునే రైతుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. నిషేధిత జాబితాలో భూములు ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదు. తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఎన్నికలప్పుడు హామీ.. అధికారం వచ్చాక దాటవేత..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను తిరిగి వారికే అప్పగిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ నిషేధిత భూముల ఎత్తివేతకు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ కౌల సరస్వతి ఆధ్వర్యంలో రైతులు మరోమారు ఉద్యమానికి సిద్ధమాయ్యరు. గత వారం రోజుల నుంచి ఆయా గ్రామాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించి తమ భూములను నిషేధిత జాబితాలో నుంచి తీసివేయాలని కోరుతున్నారు. జాబితా నుంచి తొలగించడం సాధ్యం కాదని, పరోక్షంగా కాంగ్రెస్ నాయకులు చెబుతుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. గ్రామాల్లో నిషేధిత జాబితాలో సుమారు 800 నుంచి 1000 మంది వరకు రైతులు ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఫార్మాకు ఇచ్చేది లేదని చెబుతూ.. సంబంధిత భూములను వారే సాగు చేసుకుంటున్నారు.
నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలి..
నిషేధిత జాబితా నుంచి మా భూములను తీసివేయాలి. పట్టా భూములను బలవంతంగా ఫార్మా కోసం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. భూములివ్వబోమని చెప్పినందుకు భూముల క్రయవిక్రయాలు జరుగకుండా అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. భూములను లాక్కుంటే ఏం పని చేసి బతుకాలి.
– అంజయ్య, కుర్మిద్ద
భూముల పేర్లు మార్చి అన్యాయం చేస్తుండ్రు..
ఆన్లైన్లో మా భూములు టీఎస్ఐఐసీ పేరు మీదకు మార్చారు. భూముల పేర్లు మార్చి తీవ్ర అన్యాయం చేస్తుండ్రు. నాకున్న మూడెకరాల భూమిని ఫార్మాసిటీ కోసం ఇవ్వమంటున్నారు. ఉన్న భూమి ఇచ్చి ఏం పనిచేసి బతుకాలో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలి. ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడారు.. ఇప్పుడెందుకు నోరు మెదుపడం లేదు.. సమాధానం చెప్పాలి. మా భూములు మాకే కావాలి.
– గడ్డం యాదయ్య, మేడిపల్లి
నిషేధిత జాబితాలో ఉన్న భూములు..
గ్రామం పేరు: ఎకరాలు
మేడిపల్లి : 483
నానక్‌నగర్: 154
తాటిపర్తి :382
కుర్మిద్దలో: 974