బొంరాస్పేట, అక్టోబర్ 3 : వికారాబాద్ జిల్లాలో యాసంగి వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు వేరుశనగ విత్తనాలు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వర్షాలు అనుకూలంగా కురవడంతో రైతులు సాగు పనులకు సన్నద్ధమయ్యారు. వానకాలంలో మెట్ట పొలాల్లో పెసర, బెబ్బెర్లు, మినుములు తదితర పంటలను సాగు చేయగా చేతికి వచ్చాయి. వాటి స్థానంలో యాసంగిలో వేరుశనగను సాగు చేస్తుంటారు. పొలాలను చదును చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న రైతులు వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేస్తున్నారు.
జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు సాగు చేయనున్నారు. వర్షాకాలంలో సాగు చేసిన వేరుశనగ కంటే యాసంగిలో సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి అధికంగా వస్తుంది. జిల్లాలోని బొంరాస్పేట మండలంలోనే అత్యధికంగా నాలుగు వేలకుపైగా ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేయనున్నారు. వ్యవసాయ బోర్ల కింద ఆరుతడి పంటగా తుంపర్ల పరికరాల ద్వారా నీరందించి దీనిని సాగు చేస్తారు. ఫిబ్రవరి నెలాఖరులో, మార్చి మొదటి వారంలో పంట చేతికి వస్తుంది. దిగుబడి బాగా వస్తే ఎకరాకు ఏడు క్వింటాళ్ల వరకు వస్తుంది. మార్కెట్లో క్వింటాలు వేరుశనగకు రూ.6 వేల వరకు ధర పలుకుతుంది.
ప్రభుత్వం వేరుశనగ విత్తనాలను రైతులకు గతంలో రాయితీపై అందించేది. రాయితీ విత్తనాల సరఫరా నిలిచిపోవడంతో రైతులు బయట మార్కెట్లో విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలో విత్తనాల కోసం వేరుశనగ కాయలను కొనుగోలు చేసి మరల్లో నూర్పిడి చేసి వచ్చిన పలుకును పొలంలో విత్తనాలుగా వేసేవారు. ఇదంతా ప్రయాసతో కూడుకున్నది కావడంతో రైతులు నేరుగా పలుకులనే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో క్వింటాలు పలుకులకు రూ.12 నుంచి రూ.13 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
కనిపించని నాగళ్లు
వేరుశనగ విత్తనాలు వేయడానికి రైతులు ఎద్దులతో నాగళ్లను ఉపయోగించేవారు. రానురాను పశు సంపద తగ్గడం, నాగళ్లతో విత్తనాలు వేస్తే ఎక్కువ రోజులు సమయం తీసుకుంటుండడంతో ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. గంట వ్యవధిలో ఎకరా పొలంలో విత్తనాలు వేస్తుండగా.. రూ.1500 చెల్లిస్తున్నారు. విత్తనాలు వేయడానికి ట్రాక్టర్లు రావడంతో ఎక్కడా నాగళ్లు కనిపించడంలేదు.
పంటలకు పందుల బెడద
రైతులు ఎన్నో ఆశలతో సాగు చేసే వేరుశనగ పంటకు అడవి పందుల బెడద తప్పడంలేదు. విత్తనాలు వేసినప్పటి నుంచి అడవి పందులు పొలాల్లో పడి పాడుచేస్తుంటాయి. ముఖ్యంగా పంటకు ఊడలు దిగి కాయ గట్టిపడే సమయంలో పంటను నాశనం చేస్తుంటాయి. పందులను తరమడానికి రైతులు పొలాల వద్ద కాపలా కాస్తుంటారు. పొలం చుట్టూ పాత చీరలను, ఇనుప తీగలను కంచెగా వేసి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా ఎక్కడో ఓ మూలకు గుంపులుగా వచ్చి పంటలపై పడి నష్టం కలిగిస్తుంటాయి.