ఇబ్రహీంపట్నం, నవంబర్ 2 : ప్రస్తుతం గ్రామాల్లో రైతులు పెద్దఎత్తున వరికోతలు ప్రారంభించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు ఈ ఏడాది పంటను ముందుగానే కోస్తున్నారు. కోసిన వరిధాన్యం ఆరబెట్టుకునేందుకు, వానొస్తే ధాన్యంపై కప్పేందుకు, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు బస్తాలతో కుట్టిన పట్టాలే దిక్కవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. బహిరంగ మార్కెట్లో టార్పాలిన్లకు అధిక ధరలు ఉండటంతో అన్నదాతలు కొనలేని పరిస్థితిలో ఎరువుల బస్తాలతో పట్టాలు కుట్టించుకుని ధాన్యంపై కప్పుకొంటున్నారు.
మరికొందరు చేసేదేమీలేక కవర్లను అద్దెకు తీసుకువచ్చి వరిధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. సర్కారు సబ్సిడీపై టార్పాలిన్లు అందించకపోవడంతో అన్నదాతలు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఓవైపు వర్షాలతో చేసేదేమీలేక రైతులు తక్కువ ధరలకు వరిధాన్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది అన్నదాతలు జిల్లావ్యాప్తంగా వరిపంటను పెద్దఎత్తున సాగుచేశారు. పంట చేతికందిన సమయంలో వర్షాలు పెద్దఎత్తున కురుస్తున్నందున, ధాన్యం మొలకెత్తకుండా రైతులు ప్రైవేటుగా అద్దెకు దొరికే టార్పాలిన్లు తీసుకువచ్చి ఆరబెట్టుకుంటున్నారు. తమ ఇబ్బందులు పట్టించుకుని టార్పాలిన్లు సబ్సిడీపై అందజేయాలని కోరుతున్నప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.
సర్కారు రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో ఉండటంతో ఎక్కువకాలం రైతులకు ఉపయోగపడతాయి. దీంతోపాటు 50 శాతం సబ్సిడీ అందించడం వలన అన్నదాతలకు ఆర్థిక భారం పడకపోయేది. కాని, ప్రస్తుతం రైతులు బయటి మార్కెట్లో కొనుగోలు చేసిన టార్పాలిన్లు అంత నాణ్యతగా లేకపోవడంతో ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. అవి కూడా రూ.3వేల నుంచి రూ.5వేల వరకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది అన్నదాతలు పట్టణాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు అధిక ధరలకు టార్పాలిన్లను విక్రయిస్తున్నారు.
పంట కోతలు, ధాన్యం ఆరబెట్టే సమయాల్లో రైతులకు టార్పాలిన్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. వర్షం కురిస్తే ధాన్యం తడవకుండా పట్టాలను రాశులపై కప్పుతుంటారు. గతంలో వ్యవసాయ, ఉద్యానవనశాఖల ద్వారా రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లు అందించేది. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. బహిరంగ మార్కెట్లో పట్టాలకు అధిక రేటు ఉంటున్నది. దీంతో అధిక ధరలకు కొనలేక, వర్షాల నుంచి పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రైతులపై అదనపు భారం
అన్నదాతలు ధాన్యం ఆరబెట్టుకునేందుకు, వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు ప్లాస్టిక్ సంచులతో కుట్టిన పట్టాలను అద్దెకు తీసుకొచ్చుకుంటున్నారు. అయితే ఇవి కూడా పట్టణాల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. పట్టాలకు రోజుకు రూ.50 చొప్పున అద్దె వసూలు చేస్తుండగా, దారి ఖర్చులు కలిపి తమపై అధిక భారం పడుతున్నదని రైతులు వాపోతున్నారు. ఒక్కో అన్నదాతకు వ్యవసాయ సీజన్లో రూ.2వేల నుంచి రూ.4వేల వరకు అదనపు భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు రైతులు తాము ఉపయోగించిన చిన్న యూరియా బస్తాలతో పరదాలు కుట్టించి వినియోగిస్తున్నారు.
ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలి
వరి ధాన్యం కోసి ఆరబెట్టుకుందామంటే వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోతున్నది. ధాన్యం ఆరబెట్టుకునేందుకు సర్కారు సబ్సిడీపై టార్పాలిన్లు అందించాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడంలేదు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మొలకెత్తుతున్నది. చేసేదేమీలేక తక్కువ ధరలకు ధాన్యం దళారులకు విక్రయించుకోవల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందజేయాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు