జిల్లాలోని గ్రీన్ఫీల్డ్ ప్రతిపాదిత గ్రామాల్లోకి రోడ్డు సర్వేకోసం వస్తున్న అధికారులను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రెండోవిడత రోడ్డు సర్వేకోసం ప్రతిపాదిత గ్రామాల్లోకి అధికారులు వెళ్తే.. తమ గ్రామాల్లోకి రానే రావొద్దు అంటూ అన్నదాతలు మూకుమ్మడిగా అడ్డుకుని సర్వేను చేయ నీవ్వడం లేదు. రెండోవిడతలో కందుకూరు మండలంలోని పంజాగూడ నుంచి కుర్మిద్ద, కడ్తాల్, ఆమనగల్లు మండలాల మీదుగా ఆకుతోటపల్లి వరకు సుమారు 21 కిలోమీటర్ల దూరం 330 అడుగుల రోడ్డు వెడల్పు కు 554 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-రంగారెడ్డి, జనవరి 9 (నమస్తే తెలంగాణ)
గ్రీన్ఫీల్డ్ రోడ్డు సర్వే కోసం అధికారులు గ్రామాల్లోకి భారీ పోలీసు బలగా లతో వెళ్తున్నారు. అయినా రైతులంతా సమష్టిగా ఉండి పోలీసులను అడ్డుకుని సర్వేను ముందుకు సాగనివ్వడం లేదు. సర్వేను అడ్డుకుంటే కేసులు కూడా పెడతామని పోలీసులు బెదిరిస్తున్నా వారు లెక్క చేయడం లేదు. రైతులంతా సమష్టిగా ఉండి సర్వేను అడ్డుకుంటుండడంతో అధికారులు లగచర్ల ఘటనను దృష్టిలో ఉంచుకుని వెను తిరుగుతున్నారు.