రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) :కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెబుతుండడంపై రైతులు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా కౌలుదారుల కాలమ్‌ను తెస్తామని చెప్పి రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడుతున్నారు. ‘ధరణి’తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడంతోపాటు దళారుల బెడద, భూకబ్జాలకు అడ్డుకట్ట పడిందని, రికార్డుల నిర్వహణ కూడా పకడ్బందీగా జరుగుతున్నదంటున్నారు. ఇలాంటి ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ‘భూమాత’ తెస్తామని చెప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అది ‘భూమాత’ కాదని భూములను కొల్లగొట్టే భూ‘మేత’గా వారు అభివర్ణిస్తున్నారు. ధరణిని రద్దు చేస్తే మళ్లీ డబుల్ రిజిస్ట్రేషన్లు, ఇష్టారాజ్యంగా రికార్డుల్లో మార్పులు, చేర్పులు వంటి సమస్యలు ఉత్పన్నమయ్యి మొదటికే మోసమొస్తుందని భయాందోళన చెందుతున్నారు. అంతేకాకుండా డిజిటల్ రికార్డులు మాయమై రాత పుస్తకాలు వచ్చి మళ్లీ వీఆర్వోల పెత్తనం రానున్నదని, కౌలుదారుల కాలమ్‌తో వివాదాలు ఏర్పడి రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందంటున్నారు. ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరిస్తున్నారు.
‘ధరణి’ రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రంలోనూ లేని ధరణి పోర్టల్ భూ రికార్డుల వ్యవస్థలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లోనూ అందుబాటులోకి వచ్చిన ధరణి సేవలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి 1,89,068 భూ సమస్యలకు ధరణి పరిష్కారం చూపింది.
భూములపై భరోసానింపిన ‘ధరణి’..
‘ధరణి’ వచ్చాక దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎవరికీ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం రాకుండా పోయింది. పట్టా పాసుపుస్తకం కోసం రోజుల తరబడిగా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి అంతకన్నా లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఒక కార్యాలయానికి, మ్యుటేషన్ కోసం మరో కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చిటికెలో అవుతున్నది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలన్నది కూడా మనమే నిర్ణయించుకునే వెసులుబాటు వచ్చింది. ఏండ్ల నాటి భూ సమస్యలకు చెక్ పెట్టేలా ఉన్న ధరణితో రెవెన్యూ అధికారులు ఊపిరిపీల్చుకుంటుండగా.. శ్రమ తగ్గి, పారదర్శకత పెరిగిందంటూ ప్రజానీకం సైతం కొనియాడుతున్నది.
‘ధరణి’ ప్రత్యేకతలు..
భూ సమస్యల పరిష్కారం..
ధరణి పోర్టల్‌తో రంగారెడ్డి జిల్లాలో ఏండ్లతరబడిగా ఉన్న ఎన్నో భూ సమస్యలకు పరిష్కారమయ్యాయి. మండల కేంద్రాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు ప్రజలకు అత్యంత చేరువయ్యాయి. మ్యుటేషన్, వారసత్వ ఫౌతీలకు సంబంధించి ఈ ఏడాది మార్చి వరకు జిల్లాలో 1,18,068 సమస్యలు పరిష్కారమయ్యాయి.
‘ధరణి’ని తీసేస్తే ఆగమే..
అధికారంలోకి రాగానే ‘ధరణి’ని తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నది. ఇదే జరిగితే డిజిటల్ రికార్డులు మాయమై రాత పుస్తకాలు మళ్లీ వచ్చి వీఆర్వోల పెత్తనం రానున్నది. కౌలుదారల కాలమ్ వస్తే భూమిపై అసలైన యజమాని హక్కులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంటుంది. పైరవీలు మొదలై లంచం ఇస్తేనే పని అయ్యే పరిస్థితి వస్తుంది. కొట్లాటలు, గొడవలు సైతం పెరిగిపోయి రైతులు రోజూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదే జరిగితే సంతోషంగా ఉన్న రైతు కుటుంబాల్లో అలజడులు రేగడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నెలల తరబడి తిరిగేటోళ్లు..
కాంగ్రెస్ హయాంలో భూ సమస్యలు ఉంటే అప్పట్లో మా పెద్దలు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్లు. ‘ధరణి’ వచ్చాకే భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. కాంగ్రెస్‌కు అధికారమిస్తే రైతుల బతుకులు ఆగమే. కౌలు అని, కాస్తు కాలమని ముంచేటట్టున్నరు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలె. కారు గుర్తుకే ఓటు వేస్తా.
– బుట్టి చంటి, ఎలిమినేడు (ఇబ్రహీంపట్నం రూరల్)
కౌలు కాలంతో కష్టాలే..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు కష్టాలు తప్పవు. ‘ధరణి’ స్థానంలో పాత పద్ధతిని తీసుకొస్తే ఇటు పట్టేదారు, అటు కౌలు రైతు ఇబ్బందులు పడాల్సిందే. కౌలు రైతులకు డబ్బులిస్తమంటూ చిచ్చు పెడుతుండ్రు. పట్టేదారు భూమెందుకిస్తడు. అటు కౌలు రైతు ఉపాధి కోల్పోతాడు. రైతు వ్యతిరేకి కాంగ్రెస్‌ను రానివ్వం. సీఎం కేసీఆర్‌కే మా మద్దతు.
– రాఘవేందర్‌గౌడ్ (షాద్‌నగర్ రూరల్)
పాత పద్ధతంటే పరేషానే..
‘ధరణి’ని తీసేసి పాత పద్ధతి తీసుకొస్తే రైతులకు పరేషానే. గతంలో కాంగ్రెస్ హయాంలో పడిన తిప్పలు చాలవన్నట్టు మళ్లీ ఇవేమి హామీలు. ఇదివరకు భూ సమస్య ఉంటే వీఆర్వో, ఆర్ఐ, డీటీ, తహసీల్దార్, కలెక్టర్ అంటూ ఆఫీసుల చుట్టూ తిరిగేది. కాంగ్రెస్‌ను రైతులు నమ్మే స్థితిలో లేరు. ధరణి పోర్టల్ ఉండాలె. బీఆర్ఎస్సే రావాలె.
– భిక్షపతి (శంకర్పల్లి)
‘ధరణి’ ఉండాల్సిందే.. బీఆర్ఎస్ గెలవాల్సిందే..
ధరణి పోర్టల్ తీసేసి పాత పద్ధతి తీసుకొస్తే ఇగ అన్ని అక్రమాలే.. అవకతవకలే. మళ్లీ రైతులకు కష్టాలు మొదలైనట్టే. మళ్లీ ఎమ్మార్వో, ఆర్డీవో అంటూ ఆఫీస్‌ల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన దుస్థితి వస్తది. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలను మేము నమ్మం. ‘ధరణి’ ఉండాల్సిందే. బీఆర్ఎస్ గెలవాల్సిందే.
– దోనూరి శంకరయ్య, సాయిరెడ్డిగూడ (షాబాద్)
రెవెన్యూ వ్యస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకున్నది. ‘ధరణి’ని తీసేసి ఏ ప్రాతిపదికన రైతు బంధు ఇస్తారో చెప్పాలి. ఇది దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలుపాల్సిందే. కాంగ్రెసోళ్లను ఊళ్లెకు రానివ్వొద్దు. ‘ధరణి’తో భూములు భద్రంగా ఉన్నయ్. రైతులు ప్రశాంతంగా సాగు చేసుకుంటుండ్రు.
– మెండె కృష్ణయాదవ్, తీగాపూర్(కొత్తూరు)
దొంగ పట్టాలు పుట్టుకొస్తయ్..
‘ధరణి’ని తీసేసి పాత పద్ధతి తీసుకొస్తే దొంగ పట్టాలు పుట్టుకొస్తయ్. గతంలో పట్టా మార్పిడి చేసుకునేందుకు కల్వకుర్తికి పోయేవాళ్లం. పొద్దున పోతే ఇంటికొచ్చేసరికి చీకటయ్యేది. అదికూడా రికార్డులో సరిగా ఉందో.. లేదోనని బెంగ ఉండేది. ‘ధరణి’ వచ్చాకే కష్టాలు తప్పినయ్. కాంగ్రెస్‌పై నమ్మకం లేదు. కారు గుర్తుకే ఓటు వేస్తం.
– పోచయ్య బదునాపూర్(తలకొండపల్లి)
ఆ కష్టాలు మళ్లొద్దు..
ఒకప్పుడు భూ సమస్యలు ఉంటే మా పెద్దలు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయేటోళ్లు. కాంగ్రెస్‌కు పట్టం కట్టి మళ్లీ కష్టాలను మేము కొనితెచ్చుకోం. ‘ధరణి’ని తీసేసి పాత పద్ధతి తీసుకొస్తే రికార్డుల్లో తప్పుల తడకలే. కౌలుదారు కాలంలో పట్టేదారు పేరు.. పట్టేదారు కాలంలో కౌలుదారు పేరు.. ఉండేదట. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలి.
– అచ్చన శ్రీశైలం, రాయపోల్ (ఇబ్రహీంపట్నం)
పాత రోజులు మాకొద్దు..
కాంగ్రెస్ హయాంలో భూ సమస్యలుంటే అష్టకష్టాలు పడ్డం. మళ్లీ పాత రోజులు మాకొద్దు. మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు. సీఎం కేసీఆర్ పుణ్యాన ‘ధరణి’తో భూ సమస్యలు లేకుండా చేసిండు. మళ్లీ కాస్తు కాలం, పట్టేదారు కాలమంటూ రైతులను మోసం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నది. కారు గుర్తుకే ఓటు వేస్తం.
– శ్రీనయ్య, (షాద్‌నగర్‌టౌన్)
‘ధరణి’ని తీసేస్తే కష్టాలే..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘ధరణి’ తీసేస్తామనడం సరికాదు. ‘ధరణి’ స్థానంలో పాత పద్ధతిని ఆచరిస్తే రైతులకు కష్టాలు తప్పవు. రైతులకు కీడు తలపెట్టే కాంగ్రెస్ పార్టీని మేము నమ్మం. ఇదివరకు పడ్డ కష్టాలు చాలవన్నట్టు మళ్లీ ఎలా ఆదరిస్తం. ‘ధరణి’ వచ్చాకే భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం కేసీఆర్ వెంటే ఉంటం.
– నాగులురెడ్డి , కౌకుంట్ల (చేవెళ్లటౌన్)
మోసాలు, దళారుల రాజ్యమే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మోసాలు, దళారుల రాజ్యం వస్తది. ‘ధరణి’ని రద్దు భూ మాత పేరుతో పాత పద్ధతిని తేవాలని చేస్తుండ్రు. పట్వారీ వ్యవస్థ మాకొద్దు. మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరగలేము. పనికిమాలిన కౌలు చట్టం ఎందుకు..? రైతుల మధ్య పంచాయితీ పెట్టేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. బీఆర్ఎస్కే రైతుల మద్దతు.
– మూడవత్ శ్రీనునాయక్ (కడ్తాల్)