కొడంగల్ : ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లను కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట క్లస్టర్ పరిధిలో సంచుల్లేక కొనుగోళ్లు సాగడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు సంచులకోసం క్లస్టర్ నిర్వాహకులు వారం రోజుల కిందట టోకెన్లు జారీ చేశారు. అయితే సంచుల కోసం కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నా అందడంలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలంపేట క్లస్టర్ పరిధిలో సుల్తాన్పూర్, బాలంపేట, గుండెపల్లి, అల్లాపూర్ గ్రామాలు ఉన్నాయి. వచ్చిన సం చులు బాలంపేటకు మాత్రమే పరిమితమై వచ్చినవి వచ్చినట్టే రాత్రికి రాత్రే మధ్యవర్తుల ద్వారా చేతులు మారుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ గ్రామాలు దూరంగా ఉండడంతో సంచులు వచ్చిన విషయం తమకు తెలియడంలేదని సుల్తాన్పూర్, గుండెపల్లి, అల్లాపూర్ గ్రామాల రైతులు పేర్కొంటున్నారు. పంటను అమ్ముకోలేక.. రోడ్లపై ఉంచి కాపాడుకోలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని..టోకెన్ల ప్రకారం సంచుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.