కొడంగల్, మే 13 : మండలంలోని అప్పాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఈ నెల 2న వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కాగా.. వరి పంటను అమ్ముకోవచ్చని రైతులు సంతోషించారు. కానీ పంట కోతల తరువాత రోడ్డుపై ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రం వద్ద 10 రోజులకుపైగా పడిగాపులు కాసినా అమ్మకాలు పూర్తి కావడం లేదని అన్నదాతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ఏనాడూ వరుసగా తూకం వేసిన పాపాన పోలేదని, కూలీలు అందుబాటులో లేక పంట చాలా వరకు రోడ్డుపైనే ఉండే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పంట కొనుగోళ్లు చేపడితే రైతులకు ఎటువంటి కష్టం కానీ.. నష్టం కానీ వాటిల్లదని, కొనుగోలు కేంద్రం నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు చాలా వరకు నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. ఇప్పటివరకు 4వేల బస్తాలను కొనుగోలు చేపట్టగా.. అందులో 2వేల బస్తాలను రైస్‌మిల్‌కు తరలించినట్లు వీవోఏ రమేశ్ తెలిపారు.
నాకున్న 10 ఎకరాల్లో వరి పంట సాగు చేశాను. అందులో దాదాపు 500 బస్తాల వరకు వరి దిగుబడి వచ్చింది. పంటను ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రానికి తీసుకెళితే అప్పట్లో తేమ శాతం 9 వచ్చింది. కానీ కూలీల కొరత కారణంగా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా బస్తాలు నానిపోయాయి. ఇప్పుడు కొనమంటే ఆరబెట్టుకు వస్తే కొంటామని అంటున్నారు. నింపిన బస్తాలు పూర్తిగా తడిసిపోవడంతో మళ్లీ కొత్త బస్తాల్లో ధాన్యాన్ని నింపుతున్నాం. ఎప్పుడు ఎండుతాయి, ఇంకెప్పుడు కొంటారు. మొదట్లోనే కొంటే మాకు ఈ తిప్పలు ఉండేవి కాదు.
– హన్మంతు, రైతు, అప్పాయిపల్లి, కొడంగల్
ఎండిన పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి వారం రోజులు కావస్తున్నది. కానీ కాంటా వేయడంలేదు. 4 ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే 120 బస్తాలు పండాయి. తూకం చేసి కాంటా వేయగా, హమాలీలు సంచులు పూర్తిగా కుట్టలేదు. దాంతో కొనుగోలు కేంద్రం వద్దే వరి బస్తాలు ఉండిపోయాయి. రాత్రి కురిసిన వర్షానికి బస్తాలు చాలా వరకు తడిసిపోయాయి. తాడిపత్రి కప్పుకున్నప్పటికీ గాలికి ఎగిరిపోయి బస్తాలు తడిశాయి. ఇప్పుడు తడిసిన ధాన్యం కొనుగోలు చేయబోమని, మళ్లీ ఆరబెట్టుకు రావాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. అన్ని పనులు మానుకొని కొనుగోలు కేంద్రం వద్దే పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
– రాజుస్వామి, రైతు, అప్పాయిపల్లి, కొడంగల్
లేబర్ కొరత కారణంగానే కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడుతున్నది. ఇప్పటి వరకు 4వేల బస్తాలను కొనుగోలు చేశాం. అందులో ఇప్పటి వరకు 2వేల బస్తాలు రైస్‌మిల్‌కు తరలించాం. తేమ శాతం అధికంగా రావడం వల్ల కూడా కొనుగోళ్లలో ఆలస్యం అవుతున్నది. వీలైనంత వరకు త్వరగా కొనుగోలు చేసేలా అన్నింటా చర్యలు తీసుకొంటున్నాం.
– రమేశ్, వీవోఏ, అప్పాయిపల్లి, కొడంగల్
పంట సాగుకు చేసిన కష్టం కంటే అమ్ముకోవడానికే ఎక్కువగా తిప్పలు పడాల్సి వస్తున్నది. 20 రోజుల క్రితం పంట కోశాం. పంట ఆరబెట్టుకున్న తరువాత గత 11 రోజులుగా కొనుగోలు కేంద్రంలో పంటను అమ్ముకోవడానికి ఎదురు చూస్తున్నాం. కూలీలు లేరని, కూలీలు తక్కువగా ఉన్నారనే సాకులతో అమ్మకాలు త్వరగా జరగడంలేదు. ఎవరికీ నష్టం జరగడం లేదు కానీ రైతులకు మాత్రం బాధతో పాటు నష్టం జరుగుతున్నది. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియడంలేదు. ఎంత వరకు పంటను కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. త్వరగా కొనుగోళ్లు చేస్తే రైతులు కొంతవరకైనా నష్టపోకుండా ఉంటారు.
– ఆశప్ప, రైతు, అప్పాయిపల్లి, కొడంగల్