మొయినాబాద్, మే31: రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని సేంద్రీయ వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ లీలారాణి, డాక్టర్ సుక్రుత్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా శనివారం మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో రైతులకు వ్యవసాయ పంటల సాగుపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంటలు బాగా దిగుబడి వస్తుందనే ఆలోచనతో రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వినియోగిస్తుంటారని.. అధిక రసాయన ఎరువులు వినియోగించడం వలన భూమిలోపంటకు అవసరమున్న పోషకాలు దెబ్బతింటాయని చెప్పారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వల్ల భూమిలో పోషక విలువులు పెరిగి అధిక పంట దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందన్నారు. సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన ఖర్చు వినియోగం తగ్గడంతో పాటు అధిక దిగుబడులను కూడా సాధించడమే కాకుండా పురుగులు, తెగుళ్లు రాకుండా నివారించవచ్చని తెలిపారు. పంటలకు పోషకాలు సమతుల్యంగా భూమిలోని అన్ని పొరల నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. భూమిలో కార్బన్ శాతం పెంచడానికి జనుములు, జినుగులు,పెసర, పిల్లిపెసర, ఉలువలను చల్లి భూమిలో కలియదున్నితే పంటకు ఎంతో ఉపయోగమన్నారు.
అధిక రసాయన ఎరువులు వాడటం వలన నీరు, నేల కలుషితం అవుతుందని అన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా రశీదులను పొందాలని సూచించారు. పచ్చిరొట్టె ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు వినియోగం గురించి రైతులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు వేప, రావి, మర్రి, చింత వక్షాలను పెంచాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధ, ఏఈఓ కుమార్, మాజీ సర్పంచ్ మనోజ్‌కుమార్, ఆదర్శ రైతులు మోహన్‌రెడ్డి, రవిందర్, కృష్ణ, సత్యనారాయణ, పీహెచ్డీ విద్యార్థులు తరుణ్, నవ్య, రైతులు పాల్గొన్నారు.