రంగారెడ్డి, మే 27 (నమస్తే తెలంగాణ) : ఈ యాసంగిలో వరి పంట దిగుబడి ఆశాజనకంగా ఉన్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అరకొర కొనుగోలు కేంద్రాలు సక్రమంగా కొనసాగడం లేదు. కష్టించి పంటను పండించి..తేమ శాతం లేకుండా చేసేందుకు కల్లాల్లో ఆరబెట్టి స్థానికంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి తీసుకెళ్దామంటే..అక్కడి సిబ్బంది సరిపడా గన్నీ బ్యాగు లు లేవని.. అవి వచ్చిన తర్వాతే ఇస్తామని.. అప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని సూచిస్తున్నారు. దీంతో అన్నదాతలు ఆ వడ్లను కల్లాల్లోనే రోజుల తరబడిగా ఉంచుతూ.. కాపలా కాస్తున్నారు. కాగా జిల్లాలో వరి కోత లు పూర్తయ్యాయి. ఈ సీజన్లో జిల్లాలో 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు.
అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కేవలం 40 మాత్రమే కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి.. కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే, హమాలీల కొరతతోపాటు.. సరిపడా సంచులు లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ధాన్యాన్ని సేకరించడం లేదు. కేంద్రాల్లో కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతున్నా రు. మరోవైపు అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉదయం వరకు ధాన్యాన్ని ఆరబెట్టగా.. సాయం త్రం సమయంలో వర్షం కురిసి తడిసిపోతుండడంతో అన్నదాత పరిస్థితి ఆందోళనక రంగా మారింది. కొనుగోలు కేంద్రా ల్లో ఆ ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో .. మళ్లీ ఆరబెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది.
గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో ఆమనగల్లు, కడ్తాల్, మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల తదితర మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పెద్ద ఎత్తున తడిసి ముద్దయింది. అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో… తూకం వేసిన వడ్లను ఎప్పటికప్పుడు రైస్‌మిల్లులకు తరలించకపోవడంతో తడిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అన్నదాతలు ఆందోళన బాటపడుతున్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సోమవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టగా.. బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించిన విషయం తెలిసిందే.
జిల్లాలో ఈ యాసంగిలో కేవలం 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరించింది. అయితే, జిల్లాలో ఈసారి 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా.. ప్రభుత్వం కేవలం 18,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేయడంతో అన్నదాతలు చాలా నష్టపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే ఉన్నది. సరిప డా సంచులు, హమాలీ కొరత వంటి కారణాలను చెబుతూ రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించలేదు. దీంతో వేలాది మంది అన్నదాతలు కొనుగోలు కేంద్రాల్లో కాకుండా మధ్య దళారులకు తక్కువ ధరకు విక్రయించి నష్టపోయారు.