షాద్‌నగర్, నవంబర్ 10 ; ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎలాంటి చింత లేకుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. కష్టాలు మొదలయ్యాయి. పెట్టుబడి సాయాన్ని ఆపేసిండ్రు.. అత్తెసరుగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నరు.. ప్రస్తుతం వానకాలం పంట చేతికొచ్చినా రైతుల వైపు కాంగ్రెస్ సర్కార్ కన్నెత్తి చూడడం లేదు.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించి నష్టపోతున్నం..’ అంటూ రంగారెడ్డి జిల్లాలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి ఎవుసం చేసి, చేతికొచ్చిన పంటను దళారులపాలు చేసి నష్టపోతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. కల్లాల్లో వడ్ల కుప్పులు పోసుకుని రోజూ పడిగాపులు కాస్తున్నామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఏమోగాని.. కొనుగోలు కేంద్రాల జాడేలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సన్న వడ్లు కొలతకు సరిగ్గా ఉంటేనే బోనస్ అని అధికారులు చెబుతుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
షాద్‌నగర్ డివిజన్లో 44 వేల 542 ఎకరాల్లో సాగు..
రంగారెడ్డి జిల్లాలో లక్షా 37వేల 792 ఎకరాల్లో వరి పంట సాగైంది. షాద్‌నగర్ డివిజన్‌లోనే 40 శాతం మేర అంటే 44,542 ఎకరాల్లో వరిని సాగు చేశారు. ఫరూఖ్‌నగర్ మండలంలో 13,792, చౌదరిగూడ మండలంలో 6,798, కేశంపేటలో 10,767, కొందుర్గులో 5,196, కొ త్తూరులో 3,335, నందిగామ మండలంలో 4,651 ఎకరాల్లో వరి సాగైంది. ఇప్పటికే సుమారు 35 శాతానికి పైగా వరి కోతలు పూర్తయ్యాయి. రాష్ట్ర సర్కార్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో దళారులకు తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోతున్నారు.
గింజ కొలతలో మెలిక..
రూ.500 బోనస్ పొందాలంటే వరి గింజకు రాష్ట్ర సర్కారు కొలతలు నిర్ణయించింది. గింజ పొడవు 6 మిల్లీమీటర్లు, 2 మిల్లీమీటర్ల కన్న తక్కువగా వెడల్పు ఉండాలని, వెడల్పు, పొడవు నిష్పత్తి 2.5గా ఉండాలని నిర్ణయించింది. అయితే సర్కారు సూచించిన సిద్ధి, కంపాసాగర్, సాంబ మసూరి, జగిత్యాల వరి, వరంగల్ సన్నాలు, పాలాస ప్రభ వంటి 33 రకాల వరి వంగడాలను సాగు చేసిన ధాన్యానికి మాత్రమే బోనస్ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మెలికలు పెట్టి బోనస్‌ను ఎగ్గొట్టాలని చూస్తున్నది రైతులు మండిపడుతున్నారు.
ఇప్పటికీ అతీగతి లేదు..
వడ్ల కుప్పలను కొన్ని రోజులు కల్లంలోనే ఉంచా.. చేసేదేమీ లేక ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లి క్వింటాల్‌కు రూ. 2,100 లకే అమ్మినా. కేసీఆర్ హయాంలో పంట చేతికి రాగానే ప్రభుత్వం వడ్లను కొనేది. కాంగ్రెస్ సర్కార్ కష్టాలు పెడుతున్నది.
– అంజయ్య, షాద్‌నగర్
క్వింటాల్‌కు రూ.రెండు వేలే..
ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.2000 ఇస్తమంటుండ్రు. పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు. రుణమాఫీ కాకపాయే.. రైతు భరోసా రాకపాయే.. ఇటు అదునుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపాయే.. ఎందుకీ కాంగ్రెస్ సర్కార్. రాబోవు రోజుల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు.
– రాములు, కొండన్నగూడ
తేమ శాతం ఎక్కువ ఉంటే మద్దతు ధర రాదు..
రైతు పండించిన పంటను షాద్‌నగర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. త్వరలోనే సర్కారు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయి. ధాన్యం తేమ శాతం తక్కువగా ఉంటేనే మద్దతు ధర వస్తది. బోనస్ రావాలంటే ప్రభుత్వ విధానాల ప్రకారం వరి ధాన్యం ఉండాల్సిందే.
– శ్రీనివాసులు, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి, షాద్‌నగర్
కొనుగోలు కేంద్రాల ఏర్పాటెప్పుడో..
దాదాపు సగానికి పైగా వరి కోతలు పూర్తైనా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. జిల్లావ్యాప్తంగా 39 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా యంత్రాంగం పేర్కొన్నది. ఫరూఖ్‌నగర్ పీఏసీఎస్ పరిధిలో ఒకటి, కొందుర్గు పీఏసీఎస్ పరిధిలోని చౌదరిగూడ, కొందుర్గు, జకారం, ఎదిర, మేకగూడ పీఏసీఎస్ పరిధిలో మేకగూడలో, చేగూరు పీఏసీఎస్ పరిధిలో చేగూరులో, కొత్తపేట పీఏసీఎస్ పరిధిలో కొత్తపేట, తొమ్మిదిరేకుల, కేశంపేట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొన్నా… నేటికీ అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 2,183 నుంచి రూ. 2,320 వరకు ఉండగా, షాద్‌నగర్ మార్కెట్ యార్డులో సన్న వడ్లు క్వింటాలుకు రూ. 2,000 నుంచి రూ.2,100 మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో విక్రయిస్తే సన్నాలకు బోనస్ వర్తించదన్న ప్రభుత్వం.. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఎందుకు ప్రారంభించడం లేదని మండిపడుతున్నారు. రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తున్నారని వాపోతున్నారు.