చేవెళ్ల రూరల్, డిసెంబర్ 29 : గత ప్రభుత్వాల వైఫల్యం.. నిర్లక్ష్యంతో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజల పోరాటంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడొద్దన్న సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, సాగు నీరు, పంట పెట్టుబడికి రైతు బంధు సాయం అందిస్తున్నది సర్కార్. ఎకరాకు రూ.5వేల చొప్పున ఏటా వానకాలం, యాసంగికి రెండు సీజన్లలో రూ.10 వేలు ఇస్తున్నది. ఇప్పటి వరకు 9 సీజన్లలో చేవెళ్ల నియోజకవర్గంలోని 92,819 మంది రైతులకు రూ.692.56 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ నెల 28వ తేదీ నుంచి 10వ విడుత రైతు బంధు సాయం ప్రారంభించింది. యాసంగి పంటల సాగు పనులను రైతులు మొదలు పెట్టారు. 10వ విడుత చేవెళ్ల నియోజకవర్గానికి రైతు బంధు సాయం దాదాపు రూ.86 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
నాలుగున్నరేండ్లలో రైతు బంధు సాయం..
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 2018 వానకాలం సీజన్ నుంచి రైతు బంధు ప్రారంభించగా, తొలుత ఎకరానికి రూ.4వేల చొప్పున ఇచ్చారు. తర్వాత సీజన్‌కు మరో వెయ్యి పెంచి రూ.వేలు ఇస్తున్నారు. దీంతో రైతులు పంటల సాగుకు అప్పులు తెచ్చి తిరిగి వడ్డీలు చెల్లించే పని తప్పింది. ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయ రంగంలో గణనీయంగా అభివృద్ధి సాధించిందని చెప్పొచ్చు. నాలుగున్నరేండ్లలో చేవెళ్ల నియోజకవర్గానికి రైతుబంధు పథకం ద్వారా రూ. 692.56కోట్లు అందజేశారు.
యాసంగి పెట్టుబడి సాయం ప్రారంభం
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు బంధు సాయం ఈనెల 28 నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి బాధలు పోయినయ్..
గతంలో పెట్టుబడికి చాలా ఇబ్బందులు పడ్డాం. సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. పంట పెట్టుబడి సాయం కింద సీజన్‌కు రూ.5వేలు ఇస్తున్నారు. ఎలాంటి బాధ లేకుండా సాగు చేస్తున్నాం.
– పోష్టి చంద్రయ్య, రైతు, అంతారం గ్రామం
రెండు పంటలకు పెట్టుబడి సాయం
అప్పులు చేసి వడ్డీలు కట్టడానికే నానా ఇబ్బందులు పడే వాళ్లం. సీఎం కేసీఆర్ రైతుబంధు అందిస్తున్నప్పటినుంచి పెట్టుబడి ఇబ్బందులు లేకుండా సాగు చేస్తున్నాం. రెండు సీజన్లకు రూ.10వేలు సరిపోతున్నాయి. గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
– చిలుకల వెంకటయ్య, రైతు, కౌకుంట్ల